Editorials

డిసెంబరు 8 నుండి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్-NewsRoundup-Nov 23 2024

డిసెంబరు 8 నుండి హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్-NewsRoundup-Nov 23 2024

* తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ శనివారం భారీ విరాళం సమర్పించారు. ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలో వ్యాసరాజ మఠాధిపతి విద్యాశ్రీశ తీర్థ స్వామీజీ సమక్షంలో తితిదే అడిషనల్‌ ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు.

* మహారాష్ట్ర ఎన్నికల్లో అత్యధికంగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెసే. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయింది. క్రమంగా తగ్గుతూ వస్తున్న దాని సంఖ్యా బలం ఈ ఎన్నికల్లో పాతిక సీట్లలోపే ఆగిపోయింది.

* సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, యూట్యూబ్‌ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన లీగల్‌ టీమ్‌ హెచ్చరించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. తన గురించి ఏ సామాజిక మాధ్యమం వేదికలోనైనా అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్‌ సూచించినట్టు తెలిపింది. తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్టు రెహమాన్‌, సైరా బాను దంపతులు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, తాజాగా రెహమాన్‌ లీగల్‌ టీమ్‌ స్పందించింది.

* డిసెంబర్‌ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ‘అగ్నివీర్‌’ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరగనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నియామక ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ / స్టోర్ కీపర్ ట్రెడ్స్‌కు పదో తరగతి అర్హతగా ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీస్ (WMP) అభ్యర్థులకు ఫిబ్రవరి 12, 2024 నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం ర్యాలీ జరిగే చోటుకి అన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని బోర్డు సూచించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని అధికారులు వివరించారు.

* ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నవంబర్‌ 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సభను బహిరంగ సభలా కాకుండా.. రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతు సదస్సుపై ప్రధానంగా చర్చించారు.

* హైదరాబాద్‌ నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో నెలల వయసున్న పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్‌ దంపతులకు బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్‌ రావడంతో చికిత్స నిమిత్తం నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికిత్స పేరుతో ఆస్పత్రి సిబ్బంది అని చెప్పిన గుర్తుతెలియని మహిళ.. చిన్నారిని తీసుకెళ్లింది. ఎంతసేపటికీ బాబును తీసుకురాకపోవడంతో ఆస్పత్రి మొత్తం వెతికినా బాబు, ఆ మహిళ కనిపించలేదు. అనుమానం వచ్చిన తల్లి హసీనా వెంటనే నాంపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో భద్రతా వైఫల్యం కారణంగానే కిడ్నాప్‌ చేశారని బాధిత తల్లి ఆరోపిస్తున్నారు.

* పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (90*; 193 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి చేరువ కాగా.. కేఎల్ రాహుల్ (KL Rahul) (62*; 153 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యశస్విపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. జైస్వాల్‌ ప్రత్యేక ప్లేయర్‌ అని, అతను అద్భుతమైన ఆటతీరులో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడని పేర్కొన్నాడు. యశస్వి సెంచరీతో సంతృప్తిపడేలా కనిపించడం లేదని, అవకాశం దొరికితే 150 లేదా 200 సాధించేలా ఉన్నాడని గావస్కర్ వివరించాడు.

* జైల‌ర్ విల‌న్, మ‌ల‌యాళం న‌టుడు వినాయకన్ ఫుల్లుగా తాగి రోడ్డు మీద ర‌చ్చ చేశాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ట్రాన్స్, జైల‌ర్ వంటి సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు వినాయ‌క‌న్. అయితే ఈ న‌టుడు ఏదో ఒక వివాదంలో వార్త‌ల్లో ఎక్కుతుంటాడు అన్న విష‌యం తెలిసిందే. ఇంత‌కుముందు హైద‌రాబాద్ పోలీసుల‌కు కూడా ఒక తాగి రచ్చ చేస్తూ ప‌ట్టు బ‌డ్డాడు. అయితే తాజాగా గోవాలో ఉన్న వినాయ‌క‌న్ అక్కడ ఒక లోక‌ల్ షాప్ వ్యాపారితో గొడ‌వ‌పెట్టుకున్నాడు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదా ర‌చ్చ చేస్తుండ‌గా.. ఆయ‌న‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

* మద్యం లారీలకు(Liquor lorries) రక్షణ కల్పించాలని మద్యం లారీ యజమానులు డిమాండ్‌ చేశారు. శనివారం నాగర్‌కర్నూల్‌(Nagarkurnool) జిల్లా తిమ్మాజిపేటలోని టీజీబీసీఎల్‌ స్టాక్‌ పాయింట్‌ వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో లారీల నుంచి మద్యం చోరీకి గురవుతున్నదని వాపోయారు. దీంతో పోయిన మద్యం విలువ మేము చేతి నుంచి చెల్లించాల్సి వస్తుందని, అందుకే స్టాక్‌ పాయింట్‌ అధికారులు మద్యం లారీలకు రక్షణ కల్పించాలన్నారు. పలు దఫాలుగా చర్చలు నిర్వహించినా ఫలితం లభించకపోవడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి కృషి చేస్తామని స్టాక్‌ పాయింట్‌ అధికారులు తెలిపారు. అధికారుల హామీతో లారీ యజమానులు ధర్నా విరమించారు.

* మహారాష్ట్ర (Maharastra ) ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ (AP Minister Satyakumar) డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్డీయేకు (NDA) అనుకూలంగా రావడంతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు చెందిన మంత్రులు డబ్బుల సంచులతో మహారాష్ట్రకు వెళ్లి ప్రచారం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఎన్నికల్లో చ్చిన హామీ మేరకు ఏపీలో మహిళలకు పింఛన్లు, గ్యాస్‌ కనెక్షన్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ కూటమి మాత్రమే నెరవేరుస్తుందని అన్నారు. ఎన్డీయే కూటమిపై ఉన్న విశ్వాసంతో మరోసారి అధికారం ఇచ్చిన మహారాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z