* ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా తన ‘సీఆర్ఎఫ్1100 ఆఫ్రికా ట్విన్’ బైకులకు రీకాల్ ప్రకటించింది. త్రాటల్ ఆపరేషన్ సమస్య కారణంగా కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు సమాచారం. 2022 ఫిబ్రవరి – 2022 అక్టోబర్ మధ్య తయారైన బైకులలో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. ఎన్ని బైకులు ఈ రీకాల్ ప్రభావానికి గురయ్యాయో.. కంపెనీ వెల్లడించలేదు. త్రాటల్ ఆపరేషన్ సమస్య వల్ల రైడర్.. రైడింగ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కంపెనీ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ యూనిట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రూపొందించనుంది.
* అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం. భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు. రిలయన్స్ జియో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.
* అమెరికాలో కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గౌతమ్ అదానీకి (Gautam adani) ‘మహాయుతి’ విజయంతో కాస్త ఊరట లభించినట్లయ్యింది. 3 బిలియన్ డాలర్ల ధారావి ప్రాజెక్ట్‌కు ముప్పు తొలగినట్లయ్యింది. తాము అధికారంలోకి వస్తే అదానీకి అప్పగించిన ధారావి ప్రాజెక్ట్‌ను (Dharavi project) రద్దు చేస్తామని ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన ప్రకటించడం ఇందుకు నేపథ్యం. ఓటర్లు మహాయుతికి పట్టం కట్టడంతో అదానీ దాన్నుంచి బయటపడినట్టే. లంచం ఆరోపణలపై అమెరికా కోర్టులో కేసు నేపథ్యంలో ఒకవేళ విపక్ష కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే మరో ఎదురుదెబ్బ తగిలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
* భారత్‌లో పెద్ద నగరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేళ్లలో 39 శాతం పెరిగింది. 2024 అక్టోబర్‌లో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,780కి పెరిగిందని, ముఖ్యంగా భవన నిర్మాణ సామగ్రి, నైపుణ్యం గల మానవ వనరులు ఖరీదైనవిగా మారాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ తన నివేదికలో తెలిపింది. 15 అంతస్తుల గ్రేడ్ ‘ఏ’ నివాస భవనానికి ఇది సగటు ఖర్చని కొలియర్స్ పేర్కొంది.
* అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయంలో ఎలాన్ మస్క్ (Elon Musk) కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సంపద సైతం భారీగా పెరుగుతోంది. తాజాగా 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికాకు చెందిన ఓ వార్తా పత్రిక వెల్లడించింది. ఎన్నికల రోజు నుంచి టెస్లా స్టాక్ 40 శాతం పెరగ్గా.. శుక్రవారం ఒక్కరోజే 3.8 శాతం పెరిగింది. దీంతో మస్క్ సంపద 320 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేశారు. ప్రస్తుతం ఆయన 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ కుబేరుడిగా చరిత్ర సృష్టించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాల కారణంగానే మస్క్ సంపద భారీగా పెరిగినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. అదేక్రమంలో ట్రంప్ తన కార్యవర్గంలో మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఇది కూడా ఓ కారణంగా పలువురు పేర్కొంటున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z