* న్యూయార్క్ నుంచి దిల్లీ బయలుదేరిన విమానంలో ప్రయాణించిన ఓ వృద్ధురాలి పట్ల ఒక ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్ల క్రితం దాఖలైన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. దీన్ని పరిశీలించిన జస్టిస్ కేవీ విశ్వనాథన్.. గతంలో విమాన ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ఇటీవల సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు నాకు విమానంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఇద్దరు ప్రయాణికులు ఎక్కువగా మద్యం తీసుకున్నారు. అందులో ఒకరు బాత్‌రూంలోకి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు అందులోనే ఉన్నాడు. మరో వ్యక్తి తలుపు బయటే నిలబడి వాంతులు చేసుకున్నాడు. అందులో ఉన్న సిబ్బంది అంతా మహిళలే. ఆ పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది. వారిని బయటకు తీసుకువెళ్లాలని సహా ప్రయాణికులు అభ్యర్థించారు’’ అని వెల్లడించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఓ వినూత్న ప్రణాళికను అధికారులు రూపొందించాలని జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం..అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీకి సూచించింది.
* ప్రతి సంస్థకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ సంస్థలో చేరే ఉద్యోగులు కచ్చితంగా వాటిని పాటించాల్సి ఉంటుంది. అయితే తమ సంస్థలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని జపాన్ (Japan)లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం ఉద్యోగులను హడలెత్తిస్తోంది. ఇంతకీ ఆ బ్యాంకు పెట్టిన అసాధారణ నిబంధన ఏంటంటే..జపాన్‌లోని షికోకు బ్యాంక్ (Shikoku Bank) తమ ఉద్యోగులుగా చేరేవారికి అసాధారణ నిబంధనలు పెడుతోంది. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తమ ప్రాణాలు తీసుకుంటామని అధికారిక డాక్యుమెంట్‌పై రక్తంతో సంతకం చేయాలన్న (pledge in blood) రూల్ పెట్టింది. “ఈ బ్యాంకులో ఉద్యోగం చేసే ఉద్యోగులు డబ్బు దొంగిలించినా, లేదా దొంగతనానికి ఇతరులకు సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి, ఆత్మహత్య చేసుకోవాలి” అని బ్యాంకు తమ అధికారిక సైట్‌లో పేర్కొంది.
* ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైకాపా సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైకాపా సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఈ 3 స్థానాలను తెదేపా తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన భాజపా, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై చర్చ జరుగుతోంది.
* ఉగ్రవాదానికి భారత్ దీటుగా బదులిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హెచ్చరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court)లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగమే మనకు మార్గదర్శి. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లయింది. భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచింది. రాజ్యాంగం అంటే కేవలం పత్రం కాదు.. ప్రజాస్వామ్య దీపిక. రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా’’ అన్నారు.
* అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వ్‌దేవ్ ఆరోపించారు. బైడెన్ ప్రపంచంలోని చాలా మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారన్నారు. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. దానిని రష్యాపై దాడిగానే భావిస్తామని చెప్పారు. ఆ ఆయుధాలు మాపై ప్రయోగిస్తే కొత్త అణువిధానం ప్రకారం పరిణమాలు తప్పకుండా ఉంటాయన్నారు. మరోవైపు అమెరికా, ఐరోపా వర్గాలు అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేయాలన్న దానిపై చర్చించుకొన్నట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌లో కథనం వెలువడింది. స్వల్పకాలంలో ఎన్ని ఆయుధాలు సరఫరా చేసినా.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు ఉండదని వారు భావిస్తున్నారు. కాకపోతే.. కీవ్ సంధి కుదుర్చుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
* తన ఆర్థిక అజెండాలో కీలకమైన దిగుమతి సుంకాల (Import Tariffs) గురించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్టుపై తాజాగా చైనా స్పందించింది. వాణిజ్య యుద్ధంలో ఎవరూ విజయం సాధించలేరని వ్యాఖ్యానించింది. ‘‘జనవరి 20వ తేదీన నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా.. మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించడానికి అవసరమైన పత్రాలపై సంతకం చేస్తాను’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు చైనా (China) వస్తువులపై సైతం 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికాలోని చైనా దౌత్యకార్యాలయం అధికార ప్రతినిధి లియు పెంగ్యు స్పందించారు. ‘‘ అమెరికా- చైనా ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఇరుదేశాలకు పరస్పరం మేలు చేస్తాయని మేం విశ్వస్తున్నాం. వాణిజ్య యుద్ధానికి దిగితే మాత్రం ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.
* నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండ్రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.
* వైకాపా హయాంలో అప్పటి సీఎం జగన్‌కు అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమోతు చక్రవర్తి ఫిర్యాదు చేశారు. జగన్‌కు అదానీ సంస్థ రూ.1,750కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీ విచారణలో తేలిందని అందులో ఆయన పేర్కొన్నారు. సెకితో అదానీ కంపెనీ ఒప్పదంపై విచారణ జరపాలని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
* ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh News)లో మూడు, ఒడిశా (Odisha), బెంగాల్ (West Bengal), హరియాణా (Haryana) రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు డిసెంబర్ 10ని తుది గడువుగా ఈసీ నిర్ణయించింది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ వరకు ఉపసంహరణకు ఈసీ అవకాశం కల్పించింది. డిసెంబర్ 20న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.. అదే రోజు 5 గంటల నుంచి లెక్కింపు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యల రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యం అయింది.
* తెలంగాణలో ‘ఆర్‌ఎస్’ బ్రదర్స్ (రేవంత్, బండి సంజయ్) పాలన సాగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహణపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి కేటీఆర్ హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
* తెలంగాణ రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం దిల్లీ వెళ్లనున్నారు. వారంతా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)తో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ (Parliament)లోని తన కార్యాలయంలో కలిసేందుకు పార్టీ నేతలకు ప్రధాని సమయం ఇచ్చారు. తమ నియోజకవర్గాల సమస్యలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను రాష్ట్ర నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
* తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. ఐపీఎం పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 2022 జులై 21న నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 381 మంది దరఖాస్తు చేయగా… 2022 నవంబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఈనెల 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు tspsc.gov.inలో ఉన్నాయని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z