ScienceAndTech

అంతరిక్షానికి వెళ్లివచ్చిన వ్యోమగామికి ఆన్‌లైన్ వేధింపులు-NewsRoundup-Nov 27 2024

అంతరిక్షానికి వెళ్లివచ్చిన వ్యోమగామికి ఆన్‌లైన్ వేధింపులు-NewsRoundup-Nov 27 2024

* బంగ్లాదేశ్‌లో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి హసన్‌ మహమూద్‌ ఆవేదన వ్యక్తంచేశారు. భారత్‌పై వ్యతిరేక ప్రచారాన్ని పెంచడం, తీవ్రవాద శక్తులను ప్రోత్సహించడం వంటివి బంగ్లాదేశ్‌ను పూర్తి అరాచకంగా మారుస్తున్నాయన్నారు. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చర్యలే ఇందుకు కారణమని ఆరోపించారు. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభు అరెస్టు, అనంతర పరిణామాలపై ఆయన స్పందించారు.

* దేశంలో త్వరలో హైస్పీడ్‌ రైళ్లు (High speed trains) రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. బీఈఎంఎల్‌తో (BEML) కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో (ICF) ఈ రైళ్ల డిజైన్, తయారీ కొనసాగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. భాజపా ఎంపీ సుధీర్‌ గుప్తా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. వందేభారత్‌ రైళ్లు విజయవంతం అయిన నేపథ్యంలో మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో హైస్పీడ్‌ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్‌ తెలిపారు. ఇందుకోసం ఒక్కో కార్‌కు (బోగీ) ట్యాక్సులు మినహాయించి రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని పేర్కొన్నారు. అయితే, హైస్పీడ్‌ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు.

* బిగ్‌బాస్ ఫేమ్‌ ప్రియాంక జైన్ (Priyanka Jain), బుల్లితెర నటుడు శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలకు (Tirumala) వెళ్తూ అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించిందని ఇద్దరు ప్రాంక్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం చిత్రీకరించారు. నడక మార్గంలో చిరుత పులి దాడి అంటూ సోషల్‌మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేయడంతో దానిపై దుమారం రేగింది. భక్తులను భయాందోళలకు గురి చేసే చర్యలకు పాల్పడటంపై వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో ఆధారంగా వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తితిదే సిద్ధమైంది.

* తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై నటి కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) అధికారిక ప్రకటన చేశారు. ఆంటోనీతో దిగిన ఫొటోని ఆమె ఇన్‌స్టాలో పంచుకున్నారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. కంగ్రాట్స్‌ తెలుపుతున్నారు. ఈ పోస్ట్‌పై నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్‌ లవ్‌’’ అని కామెంట్ పెట్టారు.

* గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి అనిత అధ్యక్షతన బుధవారం సచివాలయంలో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్ ఫోర్స్ పేరును ‘ఈగల్’గా మార్చడంపై చర్చించారు. ఈగల్‌ టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపింది. మంత్రులు లోకేశ్‌, సత్యకుమార్‌, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి భేటీలో ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ.. ‘ఈగల్’ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో నార్కోటిక్స్‌ కంట్రోల్ సెల్, నార్కోటిక్స్‌ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ‘ఈగల్ 1972’ టోల్ ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై నిఘా పెడతామని చెప్పారు. గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామన్నారు. ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధిస్తామని మంత్రి అన్నారు.

* జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్‌’ ఇటీవల రోదసి యాత్ర నిర్వహించింది. దీని ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన 100వ మహిళగా ఇంజినీర్‌ ఎమిలీ కాలండ్రెల్లీ రికార్డుకెక్కారు. అయితే.. ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో అంత ఎత్తు నుంచి భూమిని చూడడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘మేము భారరహిత స్థితిలో ఉన్నాం. తలకిందులుగా ఉండి మన గ్రహాన్ని చూశాను. ఎంతో ఆశ్చర్యం, ఆనందం వేసింది. నిజం చెప్పాలంటే నా పిల్లలు పుట్టినప్పుడు ఎలాంటి అనుభూతి చెందానో.. ప్రస్తుతం అలానే అనిపించింది’’ అంటూ రాసుకొచ్చారు. బ్లూ ఆరిజన్‌ పెట్టిన పోస్టు కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. కొందరు మాత్రం ఆమె తీరును తప్పుపట్టారు. మహిళా వ్యోమగామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాడీ షేమింగ్‌ చేస్తూ అసభ్యకర పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన ఆమె వెంటనే సంబంధిత వీడియోను తొలగించడంతో పాటు.. ఘాటుగా బదులిచ్చారు. ‘‘నా జీవితంలో నేను పొందిన అత్యంత విలువైన అనుభవమిది. కానీ, భూమికి తిరుగు ప్రయాణంలో ఉండగా నెట్టింట నాపై వచ్చిన కామెంట్లు చూశాను. వాటిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. సంకుచిత మనస్తత్వం కలిగిన పురుషులను పట్టించుకునే సమయం లేదు’’ అని గట్టిగా బదులిచ్చారు.

* పార్టీ సభ్యత్వ నమోదులో మొదటి పది స్థానాల్లో ఉన్న ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అనతికాలంలోనే సభ్యత్వాలను 52 లక్షలకు చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. గత నెల 26న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టగా.. ఇప్పటివరకు 52.45 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని.. ఇదొక చరిత్ర అని అన్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా మంత్రి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విధాలుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడినపెడుతూనే పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. సరైన వ్యక్తిని సరైన చోట ఉంచుతామన్న మాటకు కట్టుబడి.. పార్టీ కోసం శ్రమించిన వారిని పదవుల్లో నియమిస్తున్నామని వెల్లడించారు.

* అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ (Lottery) టికెట్ల విషయానికొస్తే ఆ బంపర్‌ ఆఫర్‌ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. తాజాగా బ్రిటన్‌ (UK)కు చెందిన ఓ వ్యక్తికి ఆ బంపర్‌ ఆఫర్‌ తగిలింది. నేషనల్‌ లాటరీ టికెట్‌ను కొన్న ఓ వ్యక్తి ఏకంగా 177 మిలియన్‌ పౌండ్లు (సుమారు రూ.1800 కోట్లు)ను గెలుచుకున్నారు. యూకేలోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రా తీయగా.. 07, 11, 25, 31, 40 నంబరు టికెట్‌కు జాక్‌పాట్‌ దక్కినట్లు ప్రకటించారు. ఈ లాటరీ (Lottery) టికెట్‌ని ఒక వ్యక్తి మాత్రమే తీసుకున్నట్లయితే.. ఈ ఏడాది సండే టైమ్స్‌ రిచ్‌ లిస్ట్‌లో ఉన్న సంగీత కళాకారులు హ్యారీ స్టైల్స్‌, అడెలె కంటే ధనవంతుడిగా నిలుస్తాడని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. మరోవైపు విజేతకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు.

* కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గత ఐదేళ్లలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌ జరిగినట్టు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. గన్నవరంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. కూలీలు, తన వద్ద పనిచేసే డ్రైవర్ల పేరుతో తవ్వకాలకు దరఖాస్తులు పెట్టి ఇష్టానుసారం తవ్వకాలు జరిపారు. ఐదేళ్ల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలను కొల్లగొట్టారు. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారు. గన్నవరంలో ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని, దీనిపై విచారణ జరుగుతోందని చర్యలు తప్పక ఉంటాయని ఇటీవల శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రైతులు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది. సీనరేజి చెల్లించకుండా తవ్విన మట్టి విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరులపై విజిలెన్స్‌ కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

* ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైశ్వాల్ సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన ర్యాంకింగ్స్‌లో జైశ్వాల్ రెండో స్ధానానికి చేరుకున్నాడు. యశస్వి జైశ్వాల్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం గమనార్హం.కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు జైశ్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు. అయితే పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.297 బంతుల్లో 161 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్ర‌మంలోనే య‌శ‌స్వీ రెండు స్ధానాలు ఎగ‌బాకి సెకెండ్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అతడి ఖాతాలో 825 పాయింట్లు ఉన్నాయి.మ‌రోవైపు టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి 9 స్ధానాలు ఎగ‌బాకి 13వ ర్యాంక్‌కు వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి కూడా ఆజేయ శతకంతో మెరిశాడు. ఇక టాప్‌ ర్యాంక్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌(903) పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

* సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి అదానీపై అమెరికా కోర్టులో కేసు నమోదైన సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై కూడా కాంగ్రెస్‌ తనదైన శైలిలో విరుచుకుపడింది. అయితే ఈ అంశం తెలంగాణలో రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అదానీని విమర్శిస్తూంటే.. రేవంత్‌ మాత్రం కుమ్మక్కు అయ్యారని కేటీఆర్‌, రేవంత్‌లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అదానీతో సంబంధాలు, పెట్టుబడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు రాహుల్‌ కొంత తడబడాల్సి వచ్చింది.ఆ తర్వాత ఏమైందో కాని తెలంగాణ సీఎం స్కిల్ యూనివర్శిటీకి అదానీ ఇచ్చిన వంద కోట్లను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా దావోస్‌లో అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటని, రేవంత్‌ స్వస్థలం కొడంగల్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ సంగతేమిటి? అని కూడా కేటీఆర్‌, హరీశ్‌కు ప్రశ్నిస్తున్నారు. అదానీకి తాము గతంలో రెడ్‌లైట్‌ చూపామని, రేవంత్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచారని ఎద్దేవా చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z