Business

PAN 2.0 ముఖ్య సమాచారం. భారీగా తగ్గిన బంగారం ధర-BusinessNews-Nov 27 2024

PAN 2.0 ముఖ్య సమాచారం. భారీగా తగ్గిన బంగారం ధర-BusinessNews-Nov 27 2024

* ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలని అనుకునే వారికి గుడ్‌న్యూస్‌. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్స్‌ ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొస్తోంది. హోండా యాక్టివా ఈ, క్యూసీ 1 పేరిట రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లను విపణిలోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఈవీ స్కూటర్లను ఇవాళ ప్రదర్శించారు. హోండా యాక్టివా ఈవీ.. రెగ్యులర్‌ యాక్టివా మోడల్‌ కంటే కొంచెం భిన్నంగా ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌తో పాటు సైడ్‌ ఇండికేటర్ల విషయంలో స్వల్ప మార్పులు చేశారు.ఇది స్వాపబుల్‌ బ్యాటరీతో వస్తుంది. ఇందులో రెండు 1.5 కిలోవాట అవర్‌ బ్యాటరీలను అమర్చారు. ఈ స్కూటర్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 102 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్టంగా గంటకు 80 మీటర్ల వేగంతో వెళ్లవచ్చు. స్టాండర్డ్‌, స్పోర్ట్స్‌, ఎకానమీ మోడ్‌లలో హోండా యాక్టివా ఈవీ అందుబాటులోకి రానుంది.

* అమెరికా లంచం కేసులో గౌతమ్‌ అదానీ ఇరుక్కోవడం.. అదానీ గ్రూప్‌నకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే ఆయా కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పడిపోతుండగా, విదేశీ మదుపరులు పెట్టుబడులకు దూరం జరుగుతున్నారు. తాజాగా ప్రముఖ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీలైన మూడీస్‌, ఫిచ్‌ల సెగ కూడా అదానీకి తగిలింది. అదానీ గ్రూప్‌లోని ఏడు సంస్థల రేటింగ్‌ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్‌’ నుంచి ‘నెగెటివ్‌’లోకి దిగజార్చినట్టు మంగళవారం మూడీస్‌ ప్రకటించింది. వీటిలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌, రెండు అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ విభాగాలు, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టెప్‌ వన్‌ లిమిటెడ్‌, అదానీ ట్రాన్స్‌పోర్టేషన్‌ రెస్ట్రిక్టెడ్‌ గ్రూప్‌ 1, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌, అదానీ ఇంటర్నేషనల్‌ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలున్నాయి. మరోవైపు అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై బాండ్లను నెగెటివ్‌ మోడ్‌లో పెట్టినట్టు ఫిచ్‌ రేటింగ్స్‌ స్పష్టం చేసింది. దీంతో ఆయా సంస్థల్లోకి పెట్టుబడులు, బాండ్ల క్రయవిక్రయాలు రిస్క్‌లో పడ్డైట్టెంది.

* దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆ మధ్య ఆల్‌టైమ్‌ హై రికార్డులతో హోరెత్తించినా.. ఆ తర్వాత వరుసగా క్షీణించాయి. కానీ తిరిగి పరుగులు పెట్టిన గోల్డ్‌ రేట్లు.. ఇప్పుడు పతనం దిశగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్‌ బంగారం ధర ఏకంగా రూ.1,310 పడిపోయింది. రూ.77,240 వద్ద స్థిరపడింది. సోమవారం కూడా రూ.1,090 కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక 22 క్యారెట్‌ రేటు ఈ ఒక్కరోజే రూ.1,200 తగ్గి 10 గ్రాములు రూ.70,800 వద్ద నిలిచింది. అంతకుముందు రోజు రూ.1,000 పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి విలువ రూ.1,250 క్షీణించి రూ.78,150 పలుకుతున్నది. సోమవారం రూ.1,000 తగ్గిన సంగతి విదితమే. అలాగే కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.90,600లుగా ఉన్నది. మునుపటి రోజు రూ.1,600 పడిపోయింది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ బలోపేతం.. గ్లోబల్‌ గోల్డ్‌ మార్కెట్‌ను షేక్‌ చేస్తున్నది.

* టెలికాం సంస్థ అప్పుల గురించి కేంద్రం ప్రకటన చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నాలుగు ప్రధాన టెలికాం కంపెనీల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉందని పేర్కొంది. అప్పుల్లో వొడాఫోన్‌ (VI) ముందు వరుసలో ఉండగా.. బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) చివరి స్థానంలో ఉంది. పార్లమెంట్‌ సభ్యులు అడిగన ప్రశ్నకు కేంద్ర టెలికాం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2024 మార్చి 31 నాటికి వొడాఫోన్‌ ఐడియాకు రూ.2.07 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. రూ.1.25 లక్షల కోట్ల అప్పుతో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉండగా.. జియోకు రూ.52,740 కోట్లు అప్పు ఉన్నట్లు తెలిపారు.

* దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (Stock market) లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. చివరికి లాభాల్లో స్థిరపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌- హెజ్‌బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మన మార్కెట్లకు కలిసొచ్చింది. సెన్సెక్స్‌ ఉదయం 80,121.03 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,004.06) లాభాల్లో ప్రారంభమైంది. ఉదయం కాసేపు ఒడుదొడుకులు ఎదుర్కొంది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగింది. చివరికి 230 పాయింట్ల లాభంతో 80,234 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 80 పాయింట్ల లాభంతో 24,274.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.44గా ఉంది.

* పాన్ కార్డు ఆధునికీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌కు (PAN 2.0) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం రూ.1435 కోట్లు వెచ్చించనుంది. పన్ను చెల్లింపుదారలకు మెరుగైన సేవలు, సాంకేతికంగా మార్పులు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. కొత్త కార్డులను క్యూఆర్‌ కోడ్‌తో తేనున్నారు. అయితే, ప్రభుత్వం పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌ తీసుకొస్తున్న వేళ.. పాన్‌కార్డుదారుల్లో సందేహాలు నెలకొన్నాయి. పాత కార్డు పరిస్థితేంటి? కార్డులో కరెక్షన్లు చేసుకోవడానికి వీలవుతుందా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ (Income tax dept) తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ వివరాలు ఇవీ..

కొత్త కార్డు అక్కర్లేదు: ఇప్పటికే పాన్‌ కార్డు ఉన్న వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్‌ 2.0 వచ్చినా పాత కార్డులు కొనసాగుతాయి. నంబర్లూ అవే ఉంటాయి.

కరెక్షన్లకు అవకాశం: పాన్‌కార్డుదారులు ఏవైనా సవరణలు ఉంటే చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబర్‌, అడ్రస్‌, పుట్టిన తేదీ, పేరులో సవరణలు చేసుకోవచ్చు. పాన్‌ 2.0 తర్వాత ఉచితంగానే ఈ అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతానికి ఆధార్‌ సాయంతో ఆయా వివరాలను ఎన్‌ఎస్‌డీఎల్‌, యూటీఐఎస్‌ఎల్‌ వెబ్‌సైట్ల ద్వారా చేసుకోవచ్చని ఐటీ శాఖ తెలిపింది.

క్యూఆర్‌ కోడ్‌ పాతదే: పాన్‌ 2.0 ప్రాజెక్ట్‌లో పాన్‌ కార్డులు క్యూఆర్‌ కోడ్‌తో వస్తాయి. అలాగని ఇదేం కొత్త విధానం కాదు. 2017-18 నుంచి జారీ చేస్తున్న కార్డులన్నింటి మీదా క్యూఆర్‌ కోడ్‌ ఉంటోంది. దాన్నే 2.0లోనూ కొనసాగిస్తారు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే పాన్ డేటా బేస్‌లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. క్యూఆర్‌ కోడ్‌లేని పాన్‌కార్డుదారులు ప్రస్తుతం, భవిష్యత్‌లోనూ క్యూఆర్‌కోడ్‌తో కూడిన కార్డు జారీకి దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z