Health

అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి 15ఎకరాలు-NewsRoundup-Nov 29 2024

అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి 15ఎకరాలు-NewsRoundup-Nov 29 2024

* రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక క్రమపద్ధతిలో వ్యవస్థల నిర్వీర్యం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో మనం వచ్చే ఎన్నికల్లో చూస్తామని అన్నారాయన. తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయశారాయన.

* టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కొంత సమయం క్రితం కన్నుమూశారు. సోషల్‌మీడియా ద్వారా సమంత ఈ విషయాన్నితెలిపారు. మళ్లీ మిమ్మల్ని కలిసేంత వరకు.. సెలవు నాన్న అంటూ ఆమె ఒక పోస్ట్‌ పెట్టారు. అయితే, ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఆమె వెళ్లడించలేదు. కానీ, అనారోగ్య సమస్యల వల్ల చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జోసెఫ్ మరణించారని తెలుస్తోంది.

* ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.

* గురుకులాల్లో ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌ల వెనుక బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హ‌స్తం ఉంద‌ంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో కాంగ్రెస్‌కు తెలియదని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్‌ పార్టీలు మాత్రమే వారికి తెలుసని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని సురేఖపై విమర్శలు గుప్పించారు. తన గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత మంత్రికి ఏ మాత్రం లేదని హెచ్చరించారు.

* కోలీవుడ్‌లో నటి నయనతార, ధనుష్‌ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివనన్‌పై ధనుష్‌ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్‌ను కోరింది. అయితే, తాజాగా సోషల్‌మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. ధనుష్‌ను టార్గెట్‌ చేసే నయన్‌ పోస్ట్‌ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. కోలీవుడ్‌లో నయనతార, ధనుష్‌ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్‌పై నయన్‌ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్‌ను హెచ్చరిస్తూ నయన్‌ ఇలా పోస్ట్‌ చేసింది. ‘అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.’ అంటూ ఒక నోట్‌ను నయన్‌ పంచుకుంది.

* నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh) పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు. కీర్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

* నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్‌ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం.. కేసును కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. ర్యాగింగ్‌, వేధింపుల వల్ల 2015 జులై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్‌ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌ రాసింది. అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్‌. గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్లపాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెలువరించింది.

* మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్‌ (Congress) లోతుగా విశ్లేషిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్‌గా మారుతోందన్నారు. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వంటివి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాయని, ఈ విషయంలో కఠిన క్రమశిక్షణ అవసరమన్నారు. కలిసికట్టుగా పోరాడకుండా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థులను ఎలా ఓడించగలం? అని ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్న ఖర్గే.. ఈ ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

* ‘‘కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చా. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో 30వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది. మా పాలన పగ, ప్రతీకారాలతో ఉండదు. అలాగని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. మంత్రి నాదెండ్ల మనోహర్‌ పలు చోట్ల తనిఖీలు నిర్వహించి 51వేల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు వెయ్యి నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది. కానీ, ఇక్కడ భద్రతా సిబ్బంది కేవలం 16 మంది మాత్రమే. పౌరసరఫరాలశాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసినా స్థానిక అధికారులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకు డీప్‌ నెట్‌ వర్క్‌ పనిచేస్తోంది’’ అని పవన్‌ అన్నారు.

* గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చటమే తమ లక్ష్యమని ‘ఈగల్‌’ విభాగాధినేత, ఐజీ ఆకె రవికృష్ణ తెలిపారు. సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రేహాండ్స్‌ తరహాలో ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ ఆపరేషన్లు చేపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్‌ ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అల్లూరి జిల్లాలో గంజాయి ప్రభావం ఉన్న తొమ్మిది మండలాల్లో కూంబింగ్‌ చేపట్టి మత్తు దందాకు చెక్‌ పెడతామన్నారు. సరిహద్దుల్లో డ్రోన్ సాయంతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

* బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ (Border _ Gavaskar Trophy 2024) తొలి టెస్టులోనే భారత్‌ 295 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆసీస్‌ మాజీలే కాకుండా.. ప్రపంచ క్రికెట్‌ అభిమానులు షాక్‌కు గురయ్యారు. సొంతగడ్డపై కివీస్‌ చేతిలో సిరీస్‌ వైట్‌వాష్‌కు గురైన టీమ్‌ఇండియా నుంచి ఎవరూ ఇలాంటి విజయం ఊహించలేదు. పెర్త్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో తొలుత బ్యాటింగ్‌ తీసుకోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తమైంది. కానీ, అదే భారత్ విజయానికి కారణమని.. సారథిగా వ్యవహరించిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆసీస్‌పై టీమ్‌ఇండియా ఇంతటి భారీ స్థాయిలో గెలుస్తుందని అనుకోలేదని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్‌ వ్యాఖ్యానించాడు.

* జీవితం ఎప్పుడూ ఊహించిన విధంగా ఉండదని దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తెలిపారు. ఈ మేరకు పూరి మ్యూజింగ్స్‌ వేదికగా ‘ప్లాన్‌-బి’ అనే అంశంపై మాట్లాడారు. ‘‘ఇక్కడి ఎవరి జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు. అన్ని అనుకున్నట్టు జరగవు. అందుకే మనం ఎప్పుడూ ప్లాన్‌-బితో సిద్ధంగా ఉండాలి. ప్లాన్‌-బి అనేది బ్యాకప్‌ స్ట్రాటజీ. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారిని రెడీగా పెట్టుకోవాలి. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, కంగారు తగ్గుతుంది. అనుకున్నది జరగనప్పుడు, ప్లాన్‌-ఎ ఫెయిల్‌ అయినప్పుడు ప్లాన్‌-బితో మనం తిరిగి నిలబడవచ్చు. జీవితంలో మీరు పెద్ద సవాళ్లు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాకపోతే దీనిని అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం. లేకపోతే ముందుకు వెళ్లలేం’’

* రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌ సబ్‌కమిటీ సమావేశమైంది. రాజధానిలో ఈఎస్‌ఐ ఆసుపత్రితో పాటు వైద్యకళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గత తెదేపా ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించింది. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ అండ్‌ డిజైన్‌కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 15 ఎకరాలు కేటాయించింది. ఎల్‌అండ్‌టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.

* డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కాకినాడ పర్యటన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. కాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాద్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డీసీఎస్‌వోను పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి డీసీఎస్‌వోగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ను వ్యవస్థీకృతం చేశారని, దేశ రక్షణకు ఇది పెనుముప్పుగా ఉందని పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న బియ్యాన్ని శుక్రవారం ఆయన ఆయన పరిశీలించారు.

* లబ్ధిదారులకు ఇందిర‌మ్మ ఇళ్ల కేటాయింపులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్లపై ఆయన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తొలి ద‌శ‌లో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నందున త‌గిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామ కార్యదర్శి, మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు సాంకేతిక‌ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల‌న్నారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

* వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల వైకాపా నేతల అధీనంలో ఉన్న సంగారెడ్డికి చెందిన సతీశ్‌కుమార్‌ కార్లను ఎట్టకేలకు పోలీసులు విడిపించారు. పులివెందుల వైద్య కళాశాల కోసమని చెప్పి సతీశ్‌కుమార్‌కు చెందిన ఆరు కార్లను పులివెందుల వైకాపా నేతలు అద్దె ఒప్పందంపై తీసుకెళ్లారు. ఒక్కో కారుకు రోజుకు రూ.1500 చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించి కార్లను తీసుకున్నారు. గత మూడేళ్లుగా కార్లను వైకాపా నేతలు వినియోగిస్తున్నారు. జీపీఎస్‌ ట్రాక్‌ చేసి చూడగా.. కార్లు వేంపల్లెలో ఉన్నట్లు గుర్తించిన సతీశ్.. వాటిని తిరిగి ఇచ్చేయాలని అడిగారు. అలా అడిగినందుకు తనను ఇడుపులపాయలో బంధించి కొట్టారని 2021లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు కార్లను ఇప్పించలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎట్టకేలకు ఈ కేసులో కదలిక వచ్చింది. కడప పోలీసుల సాయంతో నాలుగు రోజులుగా పులివెందలు, వేంపల్లెలో తిరిగిన తెలంగాణ పోలీసులు.. ఆరు కార్లను స్వాధీనం చేసుకొని బాధితుడు సతీశ్‌కు అప్పగించారు. సతీశ్‌.. తెలంగాణ పోలీసులతో కలిసి కడప నుంచి ఆరు కార్లతో సంగారెడ్డికి బయలుదేరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z