Business

నెమ్మదించిన ఇండియా ఆర్థిక వృద్ధి-BusinessNews-Nov 29 2024

నెమ్మదించిన ఇండియా ఆర్థిక వృద్ధి-BusinessNews-Nov 29 2024

* ఉద్యోగుల యూఏఎన్‌ (యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌) క్రియాశీలకంగా ఉండేలా చూడాలని ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ఈపీఎఫ్‌వోను ఆదేశించింది. ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (ఈఎల్‌ఐ) పథకం ప్రయోజనాలు పొందేందుకు వీలుగా దాన్ని యాక్టివ్‌లో ఉంచుకోవాలని సూచించింది. ఈఎల్‌ఐ పథకం ద్వారా గరిష్ఠ సంఖ్యలో యజమానులు, ఉద్యోగులు ప్రయోజనం పొందేలా చూసేందుకు వీలుగా ఉద్యోగుల్లో విస్తృత ప్రచారంతో యూఏఎన్‌ క్రియాశీలత పెంచాలని మంత్రిత్వశాఖ కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరిన వారంతా తమ యూఏఎన్‌ (UAN Activation) క్రియాశీలకంగా ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అప్పుడే బడ్జెట్‌లో ప్రకటించిన ఈఎల్‌ఐ ప్రయోజనాలు అందుతాయని ఇటీవల కేంద్రం తెలిపింది. ఇందుకు నవంబరు 30 ఆఖరు తేదీ. ఈనేపథ్యంలో ఈపీఎఫ్‌వో (EPFO) దీనిపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టింది.

* దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కాస్త నెమ్మదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై – సెప్టెంబర్‌) స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 5.4 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 8.1 శాతంగా ఉంది. ముఖ్యంగా తయారీ రంగంలో క్షీణత కారణంగా వృద్ధి నెమ్మదించింది. అంతకుముందు త్రైమాసికంలో 6.7 శాతంగా నమోదైంది.

* 2×800 మెగావాట్ల రాయ్‌పూర్‌ ఫేజ్‌-II అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో మెకానికల్‌ పనుల కోసం అదానీ పవర్‌ నుంచి రూ.510 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు ‘పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌’ ఈ రోజు(శుక్రవారం) తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో అదానీ పవర్‌లోని థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వద్ద మెకానికల్‌ నిర్మాణ పనులు చేయాల్సి ఉందని ‘పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌’ ఎక్స్చేంజ్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌ను 34 నెలల్లో పూర్తి చేయాలని ‘పవర్‌ మెక్‌’ లక్ష్యంగా పెట్టుకుంది. పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌, 1999లో స్థాపించిన ప్రముఖ హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్/నిర్మాణ సంస్థ. ఇది నాణ్యతతో కూడిన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు.. ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో నిన్నటి సెషన్‌లో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు.. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. నిఫ్టీ 24,100 ఎగువన ముగిసింది.

* బ్యాంకింగ్‌ సేవలు, ఇ-కామర్స్‌ సంస్థల ఓటీపీ సందేశాలు డిసెంబరు 1 నుంచి ఆలస్యమవుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) స్పష్టత ఇచ్చింది. మోసాలను అరికట్టేందుకు సంక్షిప్త సందేశం (SMS) ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడం (ట్రేసబిలిటీ)పై టెలికాం సంస్థలకు ఇచ్చిన ఆదేశాల కారణంగా మెసేజ్‌ల డెలివరీలో ఎటువంటి జాప్యం ఉండబోదని పేర్కొంది. ఓటీపీలు కూడా ఎప్పటిలానే సత్వరం అందుతాయని తెలిపింది. ఆలస్యమవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని వెల్లడించింది. ఈ మేరకు ట్రాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z