తమిళనాడులోని హోసూరులో తెలుగువారు గ్రామ గ్రామానికి వెళ్లి మాతృభాష మర్చిపోయిన తెలుగువారిని చైతన్య పరిచే కార్యక్రమం నిర్వహిస్తున్నారని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాల తెలుగువారూ భాషాభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. మహారాష్ట్రలోని శిరిడీలో శనివారం నిర్వహించిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య (రాతెస) తొమ్మిదో వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు మాతృభాషకు దూరమవుతూ అక్కడి భాషీయులుగా మారిపోతున్నారు. దీంతో దేశంలోఎక్కువమంది మాట్లాడే భాషల్లో రెండో స్థానంలో ఉండే తెలుగు నాలుగో స్థానానికి పడిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
సినీనటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. భావితరాలకు భాషను పరిచయం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రాతెస పక్షాన తెలుగు బోధనకు ప్రత్యేక పుస్తకాలు రూపొందించే ప్రక్రియ చేపట్టామని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ సంచాలకులు మునిరత్నం నాయుడు వెల్లడించారు. అంతకుముందు నగరంలో ర్యాలీ నిర్వహించారు. రాతెస అధ్యక్షులు సుందరరావు, శిరిడీ తెలుగు సంఘం అధ్యక్షుడు మండవ రాజు, కార్యదర్శి ప్రసాద్, డాక్టర్ జీవీ పూర్ణచందు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z