అక్రమంగా తానా ఫౌండేషన్ నిధులు ₹30కోట్లను ($3.6మిలియన్) సొంత ఐటీ సంస్థకు బదలాయించుకున్న మాజీ కోశాధికారి పోలవరపు శ్రీకాంత్ నుండి ప్రతి పైసా వెనక్కి రాబడతామని, దీనికోసం అమెరికా దర్యాప్తు సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నామని తానా ఫౌండేషన్ ప్రస్తుత ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్ TNIకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో తెలిపారు. నిధులు వెనక్కి తీసుకురావడంతో పాటు చట్టం తన పని తాను చేసేందుకు కూడా సంస్థ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో ఇంత భారీ మొత్తంలో నిధులు బదలాయించుకోవడం అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ప్రవాసులకు నెలకొన్న ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు.
తానా ఫౌండేషన్‌కు పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. మెరిల్ లించ్ బ్యాంకు ఖాతాలో (Endowments/Investments Account) దాతలు అందజేసిన నిధులను ఆదాచేయగా, PNC బ్యాంకు ఖాతాను దైనందిన కార్యకలాపాలకు (Operations Acount) వినియోగిస్తున్నారు. మెరిల్ లించ్ ఖాతాకు సంబంధించిన లావాదేవీల ఈమెయిళ్లు అదే బ్యాంకు ఖాతా మెయిల్‌బాక్స్‌కు వస్తుండటంతో ఆ ఖాతా నుండి నిధులు దారిమళ్లిన అంశం కనిపెట్టేందుకు లేదా ఇతరులకు తెలిసేందుకు ఆస్కారం లేకుండా పోయింది.
లావాదేవీల సమగ్ర నివేదికను సంస్థకు సమర్పించే క్రమంలో శ్రీకాంత్ తాను బదిలీ చేసుకున్న లావాదేవీలను నివేదికల్లో పొందుపరచలేదు. దీనితో పాటు QuickBooks సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌డేట్ చేయకపోవడం వలన ఖాతాలో నగదు ఉందనే భ్రమను సంస్థకు కల్పించాడు.
$3.6మిలియన్ డాలర్లలో ప్రతి డాలరును తానాకు వెనక్కి తీసుకురావడం, చట్టపరిధికి లోబడి ఇతనిపై తీసుకోవల్సిన అన్ని చర్యలను తానా పరిశీలించి నిస్సంకోచంగా తీసుకుంటుందని శశికాంత్ తెలిపారు. ఇలాంటి నేరాలు మళ్లీ పునరావృతం కాకుండా ఖాతాలను బలోపేతం చేసే అన్ని అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు.
తన ఐటీ సంస్థ “బృహత్ టెక్నాలజీస్”కు రావల్సిన నగదు చెల్లింపుల బకాయిల ఉన్నాయని, అవి రాగానే తానాకు నిధులు వెనక్కి ఇచ్చేస్తానని శ్రీకాంత్ బోర్డు మీటింగులో పేర్కొన్నాడు. తన తరఫున వకీలును తానా వకీలుకు పరిచయం చేశాడు.
–సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z