Health

తెలంగాణలో 213 అంబులెన్సులు ప్రారంభం-NewsRoundup-Dec 03 2024

తెలంగాణలో 213 అంబులెన్సులు ప్రారంభం-NewsRoundup-Dec 03 2024

* రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ భేటీ అయింది. ఏపీలో తొలిసారి జరుగుతున్న ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశమైంది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లో సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

* ఉపగ్రహ ప్రయోగాలు వేగవంతం కావడంతో భూదిగువ కక్ష్య అంతరిక్ష వ్యర్థాలతో (Space Junk) కిక్కిరిసిపోయే ప్రమాదం ఉందని ఐరాసకు చెందిన ఓ ప్యానల్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తుండగా.. వీటిల్లో 3,500 నిరుపయోగమైనవి కాగా.. వీటి ప్రయోగాల కారణంగా తయారైన 12 కోట్ల రాకెట్‌ శకలాలు కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన స్లింగ్‌షాట్‌ ఏరోస్పేస్‌ గణంకాలు చెబుతున్నాయి.

* ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)తో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది. కాకినాడలోని బియ్యం అక్రమ రవాణాపై వారు చర్చించనున్నారు.

* రేషన్‌ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఇదో జాతీయస్థాయి కుంభకోణమన్నారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

* మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కన్నప్ప’లో విష్ణు కుమారుడు అవ్రామ్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా మంచి ఆదరణ లభించింది. తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు (Mohan Babu) తెలిపారు.

* వైకాపా (YSRCP) సోషల్‌ మీడియా పూర్వ కన్వీనర్‌ సజ్జల భార్గవరెడ్డి (Sajjala Bhargava Reddy)కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. విజ్ఞప్తులు ఏమైనా ఉంటే హైకోర్టు ముందే చెప్పుకోవాలని స్పష్టం చేసింది.

* మహారాష్ట్రలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే కుమారుడు శ్రీకాంత్ శిందే పేర్కొన్నారు. మహాయుతి ప్రభుత్వం కొలువుదీరడానికి ముందు రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయని.. అవన్నీ నిరాధారమైనవని అన్నారు.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin)ను భారత్‌లో పర్యటించాలని కోరుతూ ప్రధాని మోదీ (PM Narendra Modi) పంపిన ఆహ్వానం తమకు అందిందని ఆ దేశ రాయబార కార్యాలయం పేర్కొంది. పుతిన్‌ రాకకు 2025 ప్రారంభంలో తేదీలు ఖరారు చేస్తామని క్రెమ్లిన్‌ సహాయకుడు యూరి ఉషకోవ్‌ తెలిపారు.

* ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 108, 102 వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీసుల కోసం 77 అంబులెన్సులకు జెండా ఊపారు.

* బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan) పురుషులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి అయ్యాక ప్రతి వ్యక్తి తన భార్య మాటే వినాలని ఆయన అన్నారు. ముంబయిలో జరిగిన ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ ప్రదర్శనలతో విమర్శకులను ఎలా సైలెంట్‌ చేస్తున్నారు? అది ఎలా సాధ్యమవుతుంది’’ అని అభిషేక్‌ బచ్చన్‌ను హోస్ట్‌ ప్రశ్నించాడు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఇది చాలా సాధారణమైన విషయం. విమర్శలను పెద్దగా పట్టించుకోను. దర్శకులు చెప్పినవిధంగా చేసుకుంటూ వెళ్తాను. మన పనేదో మనం చేసుకొని సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోవడమే’’ అని బదులిచ్చారు. దీనిపై హోస్ట్‌ స్పందిస్తూ.. ‘‘ఇంట్లో నేను ఇదే ఫార్ములా వాడుతుంటా. నా భార్య ఏం చెప్పినా వింటా’’ అని నవ్వులు పూయించాడు. అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘‘అవును నిజం.. పెళ్లైన పురుషులు తమ భార్య మాట వినాలి’’ అని బదులిచ్చారు. అభిషేక్‌ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో వార్తలు వస్తోన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

* పవర్‌.. మనీ.. సక్సెస్‌ మన జీవితాంతం ఉండవని, అవి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలని సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అభిప్రాయపడ్డారు. పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ‘రీప్లేసబుల్‌’ అనే అంశంపై మాట్లాడారు. ‘‘ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు’’.

* పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ.. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. పలు అంశాలపై చర్చ జరపాలన్న విషయంపై కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్‌సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో చర్చించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మంగళవారం నుంచి ఉభయసభలు సజావుగా సాగేలా విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z