* భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరోసారి చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది. భానుడి రహస్యాలను ఛేదించేందుకు సిద్ధమైంది. గతంలో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన ఇస్రో తాజాగా.. ప్రోబా-3 మిషన్ ప్రయోగించబోతున్నది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. మిషన్ ప్రయోగం బాధ్యతలను ఇస్రో తీసుకుంటుండగా.. శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో విజయవంతమైన రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (PSLV) తీసుకెళ్లనున్నది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రోబా-3 మిషన్‌ను డిసెంబర్ 4న ఏపీలోని శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) సహకారంతో ప్రోబా-3ని ప్రయోగించబోతున్నారు. బుధవారం సాయంత్రం 4:08 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. మిషన్‌లో భాగంగా 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇది సంక్లిష్ట కక్ష్యలోకి ఖచ్చితత్వంతో ప్రయోగం నిర్వహించేందుకు విశ్వసనీయతను పీఎస్‌ఎల్‌వీ బలోపేతం చేస్తుందని పేర్కొంది. మిషన్‌లో భాగంగా యూరోపియన్ ఏజెన్సీ సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నది. ప్రోబా-3 మిషన్‌లో ప్రయోగించిన ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి.
* గృహ రుణం వంటి దీర్ఘకాల లోన్లను తీసుకున్నవారికి అధిక వడ్డీరేట్లు శరాఘాతమే అవుతాయి. అయితే రుణ కాలపరిమితిని వీలైనంత తగ్గించుకుంటే వడ్డీ భారం కూడా తక్కువగా పడుతుందని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. చక్రవడ్డీ నుంచి ఉపశమనం లభిస్తుండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు పదేండ్ల కాలవ్యవధితో రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వార్షిక వడ్డీరేటుకు తీసుకున్నైట్టెతే రూ.26 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. కానీ ఇదే రుణాన్ని 15 ఏండ్ల కాలవ్యవధితో తీసుకుంటే వడ్డీ భారం రూ.41 లక్షలకు, 20 ఏండ్లకైతే రూ.58 లక్షలకు పెరుగుతున్నది. కాబట్టి వీలున్నప్పుడల్లా కొద్దికొద్దిగా అసలు రుణాన్ని తీర్చుతూపోతే టెన్యూర్‌ను తగ్గించుకోవచ్చు. ఈఎంఐలను మాత్రం తగ్గించుకోకూడదని గుర్తుంచుకోవాలి. ఈఎంఐ తగ్గితే భారం అంతే ఉంటుంది. అలాగే పెరిగే మీ ఆదాయాన్నిబట్టి ఏటా మీ ఈఎంఐలను పెంచుకుంటూపోయినా రుణ భారం తగ్గుతుందని సూచిస్తున్నారు. ఈఎంఐని ఏటా 5 శాతం పెంచుకుంటూపోయినా 20 ఏండ్ల కాలవ్యవధితో ఉన్న గృహ రుణం 18 ఏండ్లకు తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. ఈఎంఐ 10 శాతం పెంచుకుంటే 9 శాతం వార్షిక వడ్డీరేటుతో ఉన్న రూ.50 లక్షల రుణం కాలవ్యవధి 10 ఏండ్లకు తగ్గుతుంది.
* బంగారం ధర ఇప్పుడే చుక్కలను అంటుతోంది. గత ఏడాది కాలంలోనే అనూహ్యంగా పెరిగి మధ్యతరగతి వారికీ అందుబాటులో లేని స్థాయికి చేరింది. బంగారం ధర పెరగడం ఇక్కడితో ఆగదని, వచ్చే ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ, పెట్టుబడుల సేవల సంస్థ అయిన గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 3,150 డాలర్లకు (1 డాలర్= రూ.84.44) చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అంటే గ్రాము మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర మన రూపాయల్లో రూ.8,553 కావచ్చు. ప్రస్తుతం ఔన్సు బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 2,650-2,700 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. శనివారం చూస్తే హైదరాబాద్ బులియన్ విపణిలో 24 క్యారెట్ల పసిడి ధర గ్రాము రూ.7,900 వద్ద ఉంది. స్వల్ప-మధ్యకాలంలో మేలిమి బంగారం గ్రాము ధర రూ.7,500కు చేరొచ్చని విక్రేతలు అంచనా వేస్తున్నా, దీర్ఘకాలంలో మాత్రం ధరలు పెరుగుతాయనే చెబుతున్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (stock market) లాభాల్లో ముగిశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి నెమ్మదించడంతో.. దాని ప్రభావం ఆరంభంలో సూచీలపై పడింది. దీంతో నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. మధ్యాహ్నం తర్వాత రాణించాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్ మళ్లీ 80 వేల ఎగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 79,743.87 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 79,802.79) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేటికే మరింత నష్టాల్లోకి జారుకుని 79,308 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత కోలుకుని లాభాల్లోకి వచ్చిన సూచీ.. చివరికి 445.29 పాయింట్ల లాభంతో 80,248.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 144.95 పాయింట్ల లాభంతో 24,276.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 84.71 వద్ద ముగిసింది.
* ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా..2024, నవంబర్‌లో వాహన విక్రయాలు 12 శాతం పెరిగి 79,083 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఈ విక్రయాలు 70,576 యూనిట్లగా ఉన్నాయి. SUV(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంలో కంపెనీ దేశీయ మార్కెట్‌లో 46,222 వాహనాలను విక్రయించింది. గతేడాది విక్రయించిన 39,981 వాహనాలతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్‌లో 16% వృద్ధిని సాధించిందని మహీంద్రా & మహీంద్రా(M&M) ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మీద, కంపెనీ గత నెలలో ఎగుమతులతో సహా 47,294 SUVలను విక్రయించింది. గత నెలలో మొత్తం ట్రాక్టర్ విక్రయాలు(ఎగుమతులతో కలిపి) 33,378 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది నవంబర్‌లో మొత్తం ట్రాక్టర్ అమ్మకాలు(ఎగుమతులతో కలిపి) 32,074గా ఉన్నాయి.
* దేశీయంగా జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరిగాయి. నవంబర్ నెలలో రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రికార్డయ్యాయి. గతేడాది నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 8.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు తొమ్మిది శాతం పెరిగి రూ.1.87 లక్షల కోట్లు నమోదు కాగా, ఈ ఏడాది అత్యధికంగా ఏప్రిల్ లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏప్రిల్ తర్వాత గరిష్టంగా జీఎస్టీ వసూలు కావడం నవంబర్ నెలలోనే ఫస్ట్ టైం. గత నెలలో వసూలైన రూ.1.82 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.34,141 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.42,047 కోట్లు, ఐజీఎస్టీ రూ.91,828 కోట్లు ఉన్నాయి. సెస్ ల రూపేణా రూ.13,253 కోట్ల వసూళ్లు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఫెస్టివ్ సీజన్ కారణంగా గత నెలలో దేశీయ లావాదేవీలు 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు ఆరు శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే నవంబర్ లో రీఫండ్స్ 8.9 శాతం తగ్గి రూ.19,259 కోట్లకు పరిమితం అయ్యాయి. గతేడాది ఏప్రిల్ – నవంబర్ మధ్య కాలంలో రూ.11.81 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు కాగా, ఈ ఏడాది రూ.12.90 లక్షల కోట్లకు పెరిగింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z