Editorials

మసూద్ అజహర్ బహిరంగ సభ. భారత్ ఆగ్రహం-NewsRoundup-Dec 06 2024

మసూద్ అజహర్ బహిరంగ సభ. భారత్ ఆగ్రహం-NewsRoundup-Dec 06 2024

* ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్‌లోని బహ్వల్‌పుర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాక్‌ను డిమాండ్‌ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ మీడియాతో మాట్లాడారు. మసూద్‌ అక్కడ ప్రసంగించినట్లు వచ్చిన వార్తలు నిజమైతే.. ఉగ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడంలో పాకిస్థాన్‌ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైనట్లేనన్నారు. మసూద్‌ భారత్‌పై సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడ్డాడని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుకుంటోందన్నారు.

* దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కాప్రా మున్సిపల్‌ కాంప్లెక్‌, మౌలాలీ హెచ్‌బీ కాలనీ, మల్లాపూర్‌, హెచ్‌ఎంటీ నగర్‌, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌, నాగోల్‌, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ నుంచి పికప్‌ వ్యాన్‌లు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఎల్‌జీ అనుబంధ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా (LG Electronics India IPO) ఐపీఓకు రాబోతోంది. ఇందుకోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి (SEBI) ముసాయిదా పత్రాలను సమర్పించింది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఈ పబ్లిక్‌ ఇష్యూ జరగబోతోంది. ప్రమోటర్‌ సంస్థ అయిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఐఎన్‌సీ 10.18 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ సేల్‌కు మోర్గాన్‌ స్టాన్లీ, జేపీ మోర్గాన్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బోఫా సెక్యూరిటీస్‌, సిటీ గ్రూప్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఐపీఓ ద్వారా రూ.15,237 కోట్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాకే చెందిన హ్యందాయ్‌ మోటార్‌ రూ.27 వేల కోట్లు సమీకరించిన కొద్ది రోజులకే ఎల్‌జీ ఐపీఓకు వస్తుండడం విశేషం. ఎల్‌జీ సంస్థ దేశీయంగా వాషింగ్‌ మెషిన్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లను విక్రయిస్తోంది. దేశీయంగా శాంసంగ్‌, వాల్‌పూల్‌ సంస్థలు గట్టి పోటీనిస్తున్నాయి.

* ఆర్మీ శిక్షణ పేరుతో యువకుల్ని చిత్రహింసలకు గురి చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాకుళం జిల్లాలో విశ్రాంత ఆర్మీ అధికారినంటూ వెంకటరమణ అనే వ్యక్తి స్థానికంగా ఇండియన్‌ ఆర్మీ కాలింగ్‌ సంస్థ నిర్వహిస్తున్నాడు. ఆర్మీ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వటానికి ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. శిక్షణ కోసం వచ్చిన ఓ యువకుడిని సంస్థ డైరెక్టర్‌ రమణ కరెంట్‌ వైరుతో విచక్షణారహితంగా చితక బాదాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను కొందరు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్‌ చేసి స్పందించాలని కోరారు. యువకుడిపై దాడిని మంత్రి లోకేశ్‌ ఖండించారు. కారకులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటారని లోకేశ్‌ తెలిపారు.

* అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిందని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావులేకుండా పాలన అందిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసులకు పదోన్నతులు, బదిలీలు జరిపామన్నారు. పోలీసు, అగ్నిమాపక శాఖలో 15వేల మందికి నియామక పత్రాలు అందించామని తెలిపారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు వస్తున్నారన్నారు. ‘‘సైబర్, డ్రగ్స్‌ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌.. మన రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నాయి. యవతకు సైబర్‌ క్రైమ్‌ విభాగంలో శిక్షణ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నా. టీజీ న్యాబ్‌కు డీజీపీ స్థాయి అధికారిని నియమించాం. కఠిన చర్యలు చేపట్టి గంజాయి, డ్రగ్స్‌ను అరికడుతున్నాం. డ్రగ్స్‌ రవాణాదారులు ఇక్కడికి రావాలంటేనే భయపడాలి. డ్రగ్స్‌ విష వలయం గురించి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలి. ప్రత్యేక శిక్షణ పొందిన వారితో విద్యార్థులకు పాఠాలు చెప్పించాలి. పిల్లల భవిష్యత్తు గురించి పాఠశాలల యాజమాన్యాలకు బాధ్యత ఉండాలి. విద్యా సంస్థల యాజమాన్యాలతో పోలీసు కమిషనర్లు సదస్సులు నిర్వహించాలి. డ్రగ్స్‌ కేసులకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 6 నెలల్లోగా తీర్పులు వచ్చేలా చూస్తాం’’ అని సీఎం తెలిపారు.

* రాబోయే రోజులన్నీ.. తూర్పు, ఈశాన్య భారతావనివేనని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. శుక్రవారం దిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్‌ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈశాన్య ప్రాంతం గొప్ప సంస్కృతి, చైతన్యవంతమైన వ్యక్తులతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే అపారమైన సామర్థ్యంతో ఉందన్నారు. గత ప్రభుత్వాలు చాలా కాలంగా ఓట్ల సంఖ్యతో అభివృద్ధిని ఎలా తూకం వేశాయో చూశామని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండటంతో గత పాలకులు అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని దుయ్యబట్టారు.

* శబరిమల (Sabarimala)లోని అయ్యప్ప క్షేత్రంలో నటుడికి వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు (Kerala High Court) తప్పుబట్టింది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ నటుడు దిలీప్‌ (Actor Dileep) గురువారం శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. టీడీబీ ఆయనకు వీఐపీ దర్శనం కల్పించింది. ఈ సమయంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. కొందరు భక్తులు దేవుడిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. దీనిపై మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేరళ హైకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని విచారించింది. చాలా సమయంపాటు నటుడు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతిచ్చారని టీడీబీని ప్రశ్నించింది. ఆయన వల్ల పిల్లలు, వృద్ధులు సహా ఇతర భక్తులు గంటల తరబడి లైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. యాజమాన్యమే ఇలా ప్రవర్తిస్తే.. భక్తులు ఎవరికి ఫిర్యాదు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

* భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)ని సింధు మనువాడనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి స్టార్‌ షట్లర్‌ తొలిసారి స్పందించారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సింధును విలేకరులు పెళ్లి గురించి ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ.. ‘అవును, ఈనెల 22న నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ సమాధానమిచ్చారు.

* తెలంగాణ‌లోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీకి రాష్ట్ర ప్ర‌భుత్వం వైస్ ఛాన్స్‌ల‌ర్‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు వెల్ల‌డించింది. ఈ ప‌దవిలో చ‌క్ర‌పాణి మూడేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. గ‌తంలో అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో సోషియాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెస‌ర్‌గా చ‌క్ర‌పాణి విధులు నిర్వ‌ర్తించారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మ‌న్‌గా ఘంటా చ‌క్ర‌పాణి సేవ‌లందించారు.

* తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే.. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్‌ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు. అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పీఎస్‌ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది.

* కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌. తాను చనిపోయే వరకు సిద్ధరామయ్య కోసం ఒక రాయిలా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘సిద్ధరామయ్యకు నా చివరి శ్వాస వరకూ రాయిలా అండగా ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా నిబద్ధతతో పనిచేస్తాను. కాంగ్రెస్‌ శక్తి అంటే దేశ శక్తి. దేశ చరిత్రలో కాంగ్రెస్‌ త్యాగలే ఎక్కువ. ఈ పార్టీ అధికారంలో ఉందంటే అన్ని వర్గాలకూ అధికారం దక్కినట్లే. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ప్రజల కష్టాలకు స్పందిస్తుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌(స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌)లోగోని, సంబంధిత వాహనాలను,బోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే…ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం..హోమ్ గార్డుల రోజు వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదంలో మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నారం’ అని అన్నారు. కాగా, హెంగార్డులకు పెంచిన జీతాలు, ఇతర సదుపాయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z