Business

LIC Scholarship స్కీం వివరాలు-BusinessNews-Dec 07 2024

LIC Scholarship స్కీం వివరాలు-BusinessNews-Dec 07 2024

* ఇజ్రాయెల్‌కు చెందిన కమ్యూనికేషన్స్‌ కంపెనీ ‘తదిరన్‌ టెలికాం’ భారత్‌లో ఐపీ టెలిఫోన్లను తయారుచేయడానికి సంవత్సరానికి కనీసం 10 మిలియన్‌ డాలర్లు(రూ.84 కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ ‘మోషే మిట్జ్‌’ తెలిపారు. ‘తదిరన్‌ టెలికం’, భారత్‌లో ఐపీ ఫోన్లను తయారుచేయడానికి DCM శ్రీరాంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు ఏడాదికి 1 లక్ష ఫోన్లను ఉత్పత్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఐపీ టెలిఫోన్లు..కాన్ఫరెన్స్‌ కాల్స్‌తో సహా బహుళ కమ్యూనికేషన్‌ ఫంక్షన్లకు ఉపయోగపడతాయి. వీటిని సాధారణంగా వ్యాపార సంస్థల్లో ఉపయోగిస్తారు. ‘తదిరన్‌’ తన వ్యాపార భాగస్వాముల ద్వారా గత 26 సంవత్సరాలుగా భారత్‌లో కార్యకలపాలు నిర్వహిస్తోంది. కంపెనీ వ్యాపారంలో 70 శాతం సాఫ్ట్‌వేర్‌ నుంచి, 30 శాతం హార్డ్‌వేర్‌ నుంచి వస్తున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ‘తదిరన్‌’తో భాగస్వామ్యం గురించి DCM శ్రీరాం ప్రెసిడెంట్‌ రుద్ర శ్రీరాం మాట్లాడుతూ..ఈ గ్రూప్‌ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తిని తయారుచేయడం ఇదే మొదటిసారన్నారు.

* ప్రైవేటురంగ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (VI) సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం సూపర్‌ హీరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను (Vi Super Hero plan) తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత అపరిమిత డేటా అందివ్వనుంది. ప్రస్తుతం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచిత డేటా ఇస్తోంది. ఎంపిక చేసిన సర్కిళ్లలో ఇకపై మరో ఆరు గంటల పాటు అదనంగా ఈ ప్లాన్‌ అమలు చేయనుంది.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో వినియోగదారులకు రోజురోజుకూ మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే పలు సంస్థలు ఏఐని అందిపుచ్చుకోగా.. తాజాగా ప్రైవేటు రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ (IDFC FIRST Bank) కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఏఐ పవర్డ్‌ హోలోగ్రాఫిక్‌ డిజిటల్‌ అవతార్‌ను ప్రవేశపెట్టింది. బాలీవుడ్‌ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) రూపంతో ఈ అవతార్‌ను క్రియేట్ చేసింది. హోలోగ్రాఫిక్ డిజిటల్ అవతార్ అనేది ఒక వ్యక్తి లేదా పాత్రకు సంబంధించిన త్రీడి (3D) వర్చువల్ రూపం. ఇది హోలోగ్రామ్ లాగా కనిపించి యూజర్లతో ఇంటరాక్ట్ అవుతుంది. ముంబయిలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ జుహు బ్రాంచ్‌లో తొలుత ఈ సేవల్ని ప్రారంభించారు. బ్యాంకులో ఉండే హోలోగ్రాఫిక్‌ ఎక్స్‌టెండెడ్‌ రియాలిటీ (HXR) డివైజ్‌ సాయంతో డిజిటల్‌ అవతార్‌తో నేరుగా సంభాషించొచ్చు. బ్యాంక్‌ సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం పొందొచ్చు. దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచుల్లో ఈ సేవల్ని విస్తృతం చేయాలని చూస్తున్నారు.

* ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి బెంగళూరులో మరో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం యూబీ సిటీలో ఉన్న కింగ్‌ఫిషర్‌ టవర్స్‌లోనే రెండో ఫ్లాట్‌ను ఆయన (Narayana Murthy) కొన్నట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 16వ అంతస్తులో ఉన్న ఈ ఇంటి ధర రూ.50 కోట్లు అని పేర్కొన్నాయి. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి నారాయణమూర్తి దీన్ని కొనుగోలు చేసినట్లు ఆ కథనాలు వెల్లడించాయి. 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్‌ (Flat)లో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నాయట. ఐదు కార్లను పార్క్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది. బెంగళూరు (Bengaluru)లో ఇటీవలకాలంలో జరిగిన అపార్ట్‌మెంట్‌ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ లావాదేవీల్లో ఇదే అత్యధికం అని ఆ కథనాలు తెలిపాయి. చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం.

* ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. గోల్డన్‌జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2024 పేరిట తీసుకొచ్చిన పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకం అందించనుంది. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ స్వయంగా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. అర్హులు, దరఖాస్తు తేదీ పూర్తి వివరాలను అందులో పొందుపరిచింది. 2021-22, 2022-23, 2023 -24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈ స్కాలర్ షిష్‌న‌కు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా సమానమైన సీజీపీఏ గ్రేడ్‌ కలిగి ఉండాలి. 2024 -25లో ఉన్నత విద్య చదవాలనుకొనే బాల, బాలికలకు జనరల్‌ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేషన్‌, ఏదైనా విభాగంలో డిప్లొమో చేయాలనుకుంటున్నా, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్‌ కోర్సులు చేయాలన్నా, ఐటీఐ చదవాలనుకున్నా ఈ నగదు భరోసా కల్పిస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z