Sports

ప్రపంచ చదరంగ పోటీలో మళ్లీ డ్రా-NewsRoundup-Dec 07 2024

ప్రపంచ చదరంగ పోటీలో మళ్లీ డ్రా-NewsRoundup-Dec 07 2024

* ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ (World Chess Championship)లో డ్రాల పర్వం కొనసాగుతోంది. భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్ (Gukesh), డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ (Ding Liren) మధ్య జరుగుతున్న ఈ పోరులో వరుసగా ఏడోది, మొత్తంగా ఎనిమిదో గేమ్‌ డ్రాగా ముగిసింది. శనివారం పదో రౌండ్లో ఈ ఆటగాళ్లు పాయింట్ పంచుకున్నారు. మరో నాలుగు గేమ్‌లు మిగిలి ఉన్న ఈ పోటీల్లో ప్రస్తుతం గుకేశ్, లిరెన్‌ చెరో 5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. పదో రౌండ్‌లో 18 ఏళ్ల గుకేశ్ నల్లపావులతో ఆడగా.. 32 ఏళ్ల లిరెన్‌ తెల్లపావులతో ఆడాడు. 34 ఎత్తులు పూర్తయిన తర్వాత ఆటగాళ్లిద్దరూ డ్రాకు అంగీకరించారు.

* తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 13 రాష్ట్రాల్లో భాజపా, 6 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలిస్తోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో అత్యధిక సీట్లతో విపక్షంలో ఉన్నాం.. ఎన్నికలు ఎక్కడ జరిగినా భాజపా గెలుస్తుందన్నారు. మహారాష్ట్రలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందని.. తెలంగాణలోనూ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు.

* దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol)కు పదవీ గండం తప్పింది. ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ (Emergency Martial Law) ప్రకటనతో చిక్కుల్లో పడిన ఆయనపై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. అయితే, అధికార ‘పీపుల్‌ పవర్‌’ పార్టీకి చెందిన చాలామంది చట్టసభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించడంతో ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు.

* కివ్‌: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు (Russia-Ukraine War) డెన్మార్క్‌ (Denmark) మరోసారి సాయం అందించింది. రెండో విడతలో ఎఫ్‌- 16 యుద్ధ విమానాలను పంపించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) వెల్లడించారు. ప్రస్తుతం పారిస్‌లో ఉన్న జెలెన్‌స్కీ అగ్ర నాయకులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే డెన్మార్క్‌ అందించిన సాయం గురించి తెలిపారు. ‘‘తొలి విడతలో డెన్మార్క్‌ అందించిన యుద్ధ విమానాలు రష్యా క్షిపణులను కూల్చివేస్తున్నాయి. ఇప్పుడు మా ఆయుధాల నిల్వ మరింత బలోపేతం అయింది. మా మిత్ర దేశాలన్నీ కలిసి ఉక్రెయిన్‌కు సాయం చేస్తే.. ఇప్పటివరకు రష్యా చర్యలను పూర్తిగా నిలువరించే అవకాశం ఉండేది’’ అని పేర్కొన్నారు. ఇతర మిత్ర దేశాలు కూడా తమకు సాయం చేయాలని కోరారు.

* ఏడాదిలో ఏనాడైనా కేసీర్‌ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్‌ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది. ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి నల్గొండ వ్యక్తే. నల్గొండలో అడుగుపెట్టినప్పుడల్లా సాయుధ రైతాంగ పోరాటం గుర్తొస్తుంది. నల్గొండలో కృష్ణా జలాలు ప్రవహిస్తే ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుందని ప్రజలు భావించారు. కేసీఆర్‌ పాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి గురైంది. ఉమ్మడి పాలనలో కంటే కేసీఆర్‌ పాలనలోనే నల్గొండకు ఎక్కువ నష్టం జరిగింది. గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కేసీఆర్‌ హయాంలో నిలిచిపోయాయి.

* వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో, వాటిలో కొన్ని మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మొక్కుల రూపంలో భక్తులు స్వామికి సమర్పించిన కోడెల నిర్వహణకు విధివిధానాలను రూపొందించేందుకు మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ మేరకు జీవోను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పట్టాదారుపాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, సంబంధిత మండల వ్యవసాయాధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్నామన్నారు.

* ‘‘వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనం వేరు. దాని ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, పుష్ప క్యారెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్ (Allu Arjun) సూపర్‌హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. సినిమా చరిత్రలో, ప్రేక్షకుల మదిలో దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో అల్లు అర్జున్ జీవించాడు. సీఎం తనతో ఫొటో దిగడానికి ఆసక్తి చూపించనప్పుడు.. తన అహాన్ని చంపుకొని భన్వర్‌సింగ్‌కు (Pushpa 2 Fahad Fazil) సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు విపరీతంగా మద్యం తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. కేవలం అతడి హావభావాలే కాదు, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతాయి. ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ, ‘పుష్ప2’ ఈ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ‘పుష్పరాజ్‌’ (Pushpa 2 Allu Arjun) పాత్ర ముందు అల్లు అర్జున్‌ కూడా తక్కువే అనిపించాడు’’ అని రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma Review on Pushpa Movie) అభిప్రాయం వ్యక్తం చేశారు.

* ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas) అరెస్టు నేపథ్యంలో బంగ్లాదేశ్‌ (Bangladesh)లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మరో ఇస్కాన్‌ (ISKCON) కేంద్రంపై దుండగులు దాడి చేసినట్లు ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారామణ్‌ దాస్ తెలిపారు. ‘‘బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్‌ కేంద్రం, మరో ఆలయంపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ దాడిలో కేంద్రం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ దాడులు ఇకనైనా ఆగేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఆ దేశ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా.. బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. కృష్ణదాస్ తరఫున వాదించడానికి వచ్చిన ఓ న్యాయవాదిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టగా.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో న్యాయవాదిని స్థానికులు కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్ పిటిషన్ నెల రోజుల పాటు వాయిదా వేసింది. కాగా బంగ్లాలో జరుగుతున్న అల్లర్లపై బ్రిటన్‌ స్పందిస్తూ ఆ దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని పేర్కొంది. రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది.

* ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. తర్వాత తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థుల సూచనలు, సలహాలు విన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రుల సహపంక్తి భోజనాలకు 23 ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌.. పిల్లలతో కలిసి భోజనం చేయనున్నారు.

* గత ఐదు సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలు ఎన్నో అక్రమాలు చేశారని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu) ఆరోపించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ చేసిన అక్రమాలు బయటికి వస్తున్నాయని చెప్పారు. ‌గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్‌కు చెందిన భూమిని అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. 11 సంవత్సరాల లీజు అగ్రిమెంట్‌ను 33 సంవత్సరాల సబ్ లీజుకు మార్చారన్నారు. దేశంలోనే ఇటువంటి మోసం ఎక్కడా జరిగి ఉండదని మండిపడ్డారు. కార్యవర్గాన్ని సైతం రద్దుచేసి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాలయాళ నటుడు సిద్ధిఖీని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, గంటల వ్యవధిలోనే ఆయనకు బెయిల్‌ రావడం గమనార్హం. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ఆయన దర్యాప్తు సంస్థ ఎదుట హాజరయ్యారు (Siddique Arrest). ఈక్రమంలోనే నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు. అక్కడ ఆయనకు బెయిల్‌ లభించడంతో సిద్దిఖీ విడుదలయ్యారు. నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ గడువు ముగియడంతో సిద్ధిఖీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ సినిమా ఇండస్ట్రీతో పాటు రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది (Siddique Released on Bail). మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌ (Hema Committee Report) ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అక్కడి దర్శక – నిర్మాతలను ఉద్దేశించి పలువురు నటీమణులు ఆరోపణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత సిద్ధిఖీపై నటి రేవతి సంపత్‌ పదునైన ఆరోపణలు చేశారు. 2016లో తిరువనంతపురంలోని ప్రభుత్వ హోటల్‌లో సిద్దిఖీ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇటీవల ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z