* కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా కార్ల ధరలు (price hike) పెంచేస్తున్నాయి. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలైన మారుతీ, హ్యుందాయ్, మహీంద్రా, ఎంజీఈ మోటార్ ధరల పెంపును ప్రకటించగా.. తాజాగా టాటా మోటార్స్, కియా కూడా ఆ జాబితాలో చేరాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి. తమ ప్రయాణికుల వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. విద్యుత్ వాహనాలూ ధరలూ పెంచుతున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరో ఆటోమొబైల్ కంపెనీ కియా సైతం జనవరి 1 నుంచి కార్ల ధరలను 2 శాతం మేర పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరకు ధరలు పెరగడం, సప్లయ్ చైన్ వ్యయాలు అధికమవ్వడం కారణంగా ధరల పెంపు తప్పడం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు దేశీయంగా 16 లక్షల యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం రేపటితో (డిసెంబర్ 10) ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమిచింది. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగియనుండడంతో కొత్త గవర్నర్‌ను నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. రిలయన్స్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీ స్టాక్స్ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగియగా.. నిఫ్టీ 24,650 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,602.58 (క్రితం ముగింపు 81,709.12) పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇంట్రాడేలో 81,411.55 – 81,783.28 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ.. చివరికి 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 58.80 పాయింట్ల నష్టంతో 24,619.00 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించి 84.74 వద్ద ముగిసింది.
* బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.190 తగ్గి, రూ.78,960లకు చేరుకున్నది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ.79,150 వద్ద స్థిర పడింది. సోమవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.190 తగ్గి రూ.78,560 పలికింది. శుక్రవారం ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్స్ బంగారం తులం ధర రూ.78,750 వద్ద స్థిర పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.410 వృద్ధి చెంది రూ.77,029 లకు చేరింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.738 వృద్ధితో 93,186 పలికింది.
* వాట్సాప్ యూజర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పాత వర్షెన్ ఫోన్లకు వాట్సాప్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 33 ఫోన్లకు సైతం సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్స్‌లో ఆడ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు సేవలు నిలిచిపోతాయని పేర్కొంది. ఐఫోన్స్, హువావే, లెనెవో, ఎల్‌జీ, మోటరోలా, సామ్‌సంగ్, సోనీ కంపెనీలకు చెందిన మోడల్స్ ఉన్నాయి. మోటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఐఓఎస్ 15.1 కంటే పాత వెర్షన్లకు సపోర్ట్‌ని నిలిపివేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి iPhone 5s, iPhone 6, iPhone 6 Plus మోడల్స్‌లో ఇక వాట్సాప్ పని చేయదని వాట్సాప్ ట్రాకర్ వాబీటాఇన్ఫో (WABetaInfo) పేర్కొంది.
వాట్సాప్ ఇకపై ఐఓఎస్ 15.1 కంటే పాత వెర్షన్‌లను మే 5న, 2025 నుంచి సపోర్ట్ ఇవ్వనున్నట్లు చెప్పింది. వాట్సాప్‌తో పాటు వాట్సాప్ బిజినెస్‌కి సైతం వర్తిస్తుందని తెలిపింది. ఐఓఎస్ వెర్షన్ యూజర్లు తప్పనిసరిగా కొత్త మొబైల్స్‌కి మారాలని సూచించింది. వాస్తవానికి, ఈ మోడల్స్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్ రావడం నిలిచిపోయింది. కంపెనీ ఆండ్రాయిడ్ 5.0 తర్వాత.. iOS 12 తర్వాతి ఓఎస్‌లో వాట్సాప్ సపోర్ట్ ఇస్తున్నది. ప్రస్తుతం ఆయా మోడల్స్ ఫోన్లు వాడే వారంతా తప్పనిసరిగా వాట్సాప్‌ని ఉపయోగించడానికి స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి. లేకపోతే వాట్సాప్ ఇకపై పని చేయదని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ ఆయా మోడల్స్ జాబితాను విడుదల చేసింది. ఇక వాట్సాప్ పని చేయని ఫోన్లు ఇవే..
iPhone 5
iPhone 6
iPhone 6S
iPhone 6 Plus
iPhone 7 Plus
Huawei Ascend G525
Huawei Ascend P6S
Huawei C199
Huawei P20 Pro
Huawei Y625
Lenovo-46600
Lenovo A820
Lenovo A858T
Lenovo-P70
Lenovo S890
LG Optimus 4X HD
LG Optimus G
LG Optimus G Pro
LG Optimus L7
Motorola Moto G
Motorola Moto X
Samsung Galaxy Ace 2018
Samsung Galaxy Note 10
Samsung Galaxy Note 2
Samsung Galaxy A32
Samsung Galaxy Note 3
Samsung Galaxy S3 Mini
Samsung Galaxy S4 Active
Samsung Galaxy S4 Mini
Samsung Galaxy S4
Sony Xperia E3
Sony Xperia M
Sony Xperia Z1
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z