* జమిలి ఎన్నికల (Simultaneous polls)పై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేబినెట్ ఇటీవల ఆమోదించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులతో సహా 32 పార్టీలు పలువురు ప్రముఖులు దీనిని సమర్థించారు. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్ సిఫార్సు చేసింది.
* అడిలైడ్‌లో ఆసీస్, భారత్ మధ్య జరిగిన టెస్టులో మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) -ట్రావిస్ హెడ్(Travis head) మధ్య మాటల యుద్ధాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాగా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తోటి క్రీడాకారుడి పట్ల మైదానంలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5 ఆర్టికల్‌ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 20శాతం పెనాల్టీ విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, హెడ్పైనా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్‌ను జరిమానాగా విధించింది. ఇద్దరూ తమ తప్పుల్ని అంగీకరించారని, మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపారని పేర్కొంది.
* తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
* ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో చర్చలు జరిపేందుకు భారత కార్యదర్శి విక్రమ్ (Vikram Misri) బంగ్లాదేశ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బంగ్లా విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగశాఖ సలహాదారుతో తౌహిద్ హుస్సేన్‌తో జరిగిన భేటీలో ఆ దేశంలోని హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు మిశ్రి పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై.. ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ గురించి చర్చించినట్లు మిశ్రి మీడియాతో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ దళాలు భారత సరిహద్దుల్లో డ్రోన్ల మోహరించిన విషయంపై మాట్లాడామన్నారు. ‘‘బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక, ప్రయోజనకరమైన సంబంధాన్ని భారత్ కోరుకుంటోందని తెలిపాము. ఇక్కడి యూనస్ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని ఎదురు చూస్తున్నాం’’ అని మిశ్రి తెలిపారు.
* తనని డ్యాన్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారంటూ జరుగుతోన్న ప్రచారంపై ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) స్పందించారు. ఆయా కథనాల్లో నిజం లేదని అన్నారు. తన పదవీ కాలం ముగియకుండానే సొంత నిర్ణయాలు తీసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
* తిరుగుబాటుదళాలు (Syria rebels) సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ (Bashar Al-Assad) దేశాన్ని విడిచివెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు డమాస్కస్‌లోని అధ్యక్షుడి విలాసవంతమైన ఆయన నివాసంలోకి ప్రజలు చొరబడి.. ఆయన ఇంట్లోని ప్లేట్లు, ఫర్నిచర్.. ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లారు. అధ్యక్షుడి నివాసానికి సంబంధించి కొన్ని వీడియాలు బయటకు వచ్చాయి. ఓ వీడియోలో సిరియా మాజీ అధ్యక్షుడి ‘ఫ్యామిలీ బంకర్’ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఆందోళనకారులు అసద్ ఇంట్లోని పలు తలుపులు తెరిచిన తర్వాత ఓ సొరంగ మార్గం బయటపడిందని.. అందులో వారికి సంబంధించిన బంగారు ఆభరణాలు, ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ సొరంగం, దాని చివర్లో చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలు, ఇతర వస్తువులు, విశాలమైన గదులు కనిపిస్తున్నాయి. మరో వీడియోలో అధ్యక్షుడికి సంబంధించిన ప్రైవేటు గ్యారేజీలో కోట్ల రూపాయలు విలువైన పోర్ష్, లంబోర్గిని, ఫెరారీ, మెర్సిడెజ్- బెంజ్, ఆడీ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరోవైపు కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి, నగదు పెట్టెలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.
* కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధాన్యం కొనుగోళ్లలో సంస్కరణలు తీసుకొచ్చామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలిన్లు ఇస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కలిశెట్టిగూడెంలో మంత్రి మనోహర్ సోమవారం పర్యటించారు. స్థానిక ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
* వైకాపా అధినేత జగన్ కంటే మహానటులు ఎవరు లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. పదే పదే అబద్ధాలు చెప్పడంతోపాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ప్రజా రక్షకుడిగా చెప్పడం ఆయనకే సాధ్యమైందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచకపాలన సాగించి.. ఇప్పుడేమో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్నారని మండిపడ్డారు. వైకాపా హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం ఘోరంగా పడిపోయిందని దుయ్యబట్టారు. గాడితప్పిన విద్యా వ్యవస్థను యువ నేత, మంత్రి నారా లోకేశ్ అహర్నిశలు కష్టపడి దారిలో పెడుతుంటే చూసి సహించలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నటించడం ఆపి ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు.
* తల్లి మందలించిందని మనస్తాపానికి గురై ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మామిళ్ల గూడెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలో నివాసం ఉండే మెడికల్ రిప్రజెంటేటివ్ కుమార్తె ఖమ్మంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొద్దిరోజులుగా పలు ఆరోగ్య సమస్యలు ఉండడంతో మధ్యాహ్న వేళల్లో పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాస్తోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా.. ఉదయం పెన్ను కొనుక్కొని వస్తానని చెప్పి ఇంటికి ఆలస్యంగా రావడంతో బాలిక తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఇంటి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు వివరాలు సేకరించారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్ఐ భాస్కర్‌రావు, సీఐ అంజలి తెలిపారు.
* గత వైకాపా ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) విమర్శించారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. విజయవాడలో సబ్‌జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ‘‘ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారమిచ్చారు. ఖైదీని ఖైదీలా.. ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా నిఘా ఉంటుంది.. చర్యలు తప్పవు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశాం. జైలులో అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించాం. విచారణ జరుగుతోంది. రెండు రోజుల్లో నివేదిక వస్తుంది. దానిపై త్వరలో చర్యలు తీసుకుంటాం.
* తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సిద్ధమవుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ తల్లుల లాంటి మహిళలను అరెస్టు చేయించారని భారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 18 వేలు జీతం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలపైకి కాంగ్రెస్ ప్రభుత్వమే పోలీసులను ఉసిగొల్పిందని ఆరోపించారు. రాష్ట్రంలో 12 వేల మంది సర్పంచ్‌లు ఆందోళన చేస్తున్నారని, వారి గోడును పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్‌పై (Chinmoy Krishna Das) బంగ్లాదేశ్‌లో మరో కేసు నమోదయింది. ఆయనతోపాటు వందలాది మంది అనుచరులపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు. ఇప్పటికే దేశ ద్రోహం ఆరోపణలపై కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు బంగ్లా మీడియా వర్గాలు వెల్లడించాయి. గత నెల 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్ కృష్ణదాస్, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని ఇనాముల్ హక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
* రష్యాతో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోనున్నది భారత ప్రభుత్వం. సుమారు 4 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రేడార్ వ్యవస్థ(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది. అయితే మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రేడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రేడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z