Business

వచ్చే ఏడాది బంగారం ధగధగల్లో తగ్గుదల-BusinessNews-Dec 15 2024

వచ్చే ఏడాది బంగారం ధగధగల్లో తగ్గుదల-BusinessNews-Dec 15 2024

* బయోకాన్‌ గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజందార్‌ షాకు ప్రతిష్ఠాత్మక జెంషెడ్‌జీ టాటా పురస్కారం దక్కింది. మన దేశంలో బయోసైన్సెస్‌ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు ఆమెకు ఇండియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ (ఐఎస్‌క్యూ) ఈ అవార్డును ప్రకటించింది. 2004లో ఐఎస్‌క్యూ ఈ అవార్డును ప్రారంభించింది. భారతీయ సమాజానికి గణనీయ సేవలు అందించిన వ్యాపార దిగ్గజాలను గుర్తించి ఐఎస్‌క్యూ ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన ఐఎస్‌క్యూ వార్షిక కాన్ఫరెన్స్‌ 2024లో కిరణ్‌కు ఈ పురస్కారం అందించబోతున్నట్లు ప్రకటించారు. ‘దేశంలో అత్యంత గొప్ప వ్యక్తుల్లో ఒకరిగా జెంషెడ్‌జీ టాటా నిలిచారు. ఆయన దూరదృష్టి, నాణ్యత పట్ల నిబద్ధత అందరికీ తెలిసిందే. అలాంటి జెంషెడ్‌జీ టాటా పేరు మీద ఏర్పాటు చేసిన పురస్కారాన్ని నాకు ప్రకటించడం ఎంతో ఆనందాన్నిస్తోంద’ని కిరణ్‌ మజుందార్‌ షా వెల్లడించారు.

* మన దేశంలో స్టాక్‌ మార్కెట్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. అమెరికాలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రేడింగ్‌ జరుగుతుంది. 6.30 గంటల ట్రేడింగ్‌ సమయంలో లాభాలు ఆర్జించిన వాళ్ల కంటే నష్టపోయే వాళ్లే ఎక్కువమంది ఉంటారని అంచనా. అదే రోజంతా ట్రేడింగ్‌ జరిగితే.. పరిస్థితి ఎలా ఉంటుందో! ట్రేడింగ్‌ సమయం పొడిగింపు దిశగా ఇప్పటికే అమెరికాలో అడుగులు పడుతున్నాయి. దేశంలో తొలి 24 గంటల స్టాక్‌ ఎక్స్ఛేంజీకి అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ ఇటీవలే అనుమతినిచ్చింది. ‘24 ఎక్స్ఛేంజీ’గా వ్యవహరించే ఈ ఎక్స్ఛేంజీ రెండు విడతల్లో తన కార్యకలాపాలను 2025లో ఆరంభించనుంది. తొలి విడతలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు (అమెరికా కాలమాన ప్రకారం) ట్రేడింగ్‌ నిర్వహిస్తుంది. తదుపరి, రెండో విడతలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ట్రేడింగ్‌ను పొడిగించనుంది. మధ్యలో రాత్రి 7 గంటలకు ఒక గంట మాత్రమే విరామం తీసుకుంటుంది. 24 గంటల ట్రేడింగ్‌ అని చెబుతున్నా, రోజు మొత్తంమీద 23 గంటల పాటు ట్రేడింగ్‌ లావాదేవీలు జరగనున్నాయి.

* తవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది. భారతీ ఎయిర్‌టెల్ భారీగా లబ్ధి పొందగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఐసీ నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 623.07 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 90.5 పాయింట్లు వృద్ధి చెందాయి. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.47,836.6 కోట్ల వృద్ధితో రూ.9,57,842.40 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,826.97 కోట్లు పెరిగి రూ.8,30,387.10 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11,887.78 కోట్లు పుంజుకుని రూ.14,31,158.06 కోట్ల వద్ద స్థిర పడింది. ఐసీఐసీఐ బ్యాంకు ఎం-క్యాప్ రూ.11,760.8 కోట్ల లబ్ధితో 9,49,306.37 కోట్లకు చేరింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.9,805.02 కోట్లు పుంజుకుని రూ.16,18,587.63 కోట్లకు చేరుకున్నది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.52,031.98 కోట్ల పతనంతో రూ.17,23,144.70 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.32,067.73 కోట్ల నష్టంతో రూ.5,89,869.29 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.22,250.63 కోట్లు పతనమై రూ.5,61,423.08 కోట్లకు చేరుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.2,052.66 కోట్లు, ఐటీసీ ఎం-క్యాప్ రూ.1,376.19 కోట్లు కోల్పోయాయి. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఎస్బీఐ, ఐటీసీ నిలిచాయి.

* ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఆల్‌టైమ్‌ హైకి చేరిన విషయం తెలిసిందే. తులం 24 క్యారెట్‌ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు గరిష్ఠంగా రూ.82,400 పలికింది. అయితే అక్టోబర్‌ ఆఖరుదాకా పరుగులు పెట్టిన గోల్డ్‌ రేట్లు.. గత నెలన్నర (45 రోజులు)గా పడుతూ.. లేస్తూ.. సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూజీసీ తాజా అంచనాలు సైతం ప్రస్తుత మార్కెట్‌ తీరుకు అనుగుణంగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలోనూ మార్కెట్‌ ట్రెండ్‌ ఇదే రీతిలో ఉండవచ్చన్న అభిప్రాయాన్ని 2025 ఔట్‌లుక్‌లో వ్యక్తం చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z