* ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. ‘‘13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. డిసెంబరు 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’’ అని సీపీ తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
* డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును పరిశీలించిన తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. స్టెల్లా నౌక ద్వారా పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిస్తున్నారన్న సమాచారంతో గత నెల 29న పవన్ కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా అధికారులతో కలిసి నౌకను పరిశీలించారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ‘‘నవంబరు 29న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్టెల్లా షిప్‌ను పరిశీలించిన తర్వాత ఐదు విభాగాల అధికారులు బృందంగా ఏర్పడి 12గంటల పాటు స్టెల్లా షిప్‌లోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12శాంపిల్స్ సేకరించారు. షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉన్నాయి. వాటిలో 1,320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్టు నిర్ధరించాం. ఈ షిప్ ద్వారా సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వాళ్లు ఎక్కడి నుంచి బియ్యం తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారనేదానిపై దర్యాప్తు జరుగుతోంది.
* ప్రజా భద్రత దృష్ట్యా టెలిఫోన్, మొబైల్ ఫోన్లపై నిఘా కోసం ఇచ్చిన అనుమతిని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ముగ్గురు నిర్దేశిత అధికారులకు ఈ ఫోన్లపై నిఘా ఉంచేందుకు అనుమతిని పొడిగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ విభాగం డీజీ లేదా అదనపు డీజీ, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన ఐజీ లేదా డీఐజీలకు కల్పించిన ఈ అధికారాలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
* గుంటూరు జిల్లా తాడేపల్లిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. ఐదు నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన సరస్వతి కూరగాయలు కొనుగోలు చేసి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగలు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ దాడిలో సరస్వతికి గాయాలయ్యాయి. కొత్తూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మరో మహిళ మెడలో అదే బైక్‌పై వచ్చిన దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు సంఘటనలు జరిగాయి. హై సెక్యూరిటీ ఉండే కుంచనపల్లి, కొత్తూరు ప్రాంతాల్లోనే చైన్ స్నాచింగ్‌లు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
* జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదించిన (One Nation One Election) రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను కాంగ్రెస్ (Congress) తీవ్రంగా తప్పుపట్టింది. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కేందుకు భాజపా (BJP) యత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ విరుద్ధం. ఈ బిల్లును మేము ఏ మాత్రం ఆమోదించం’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) అన్నారు. ‘‘కేంద్రం ప్రతిపాదన వెనక అసలైన ఉద్దేశం స్పష్టం అవుతోంది. ‘ఓకే దేశం.. ఒకే ఎన్నిక’ అంటే ‘ఒకే దేశం.. కానీ, ఎన్నికలు లేవు’ అని అర్థం. ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయాలని భాజపా ప్రయత్నిస్తోంది. అదే ఆ పార్టీ ప్రధాన అజెండా. కానీ, వారు అనుకుంటున్నది ఎన్నటికీ జరగదు. ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే ప్రసక్తే లేదు’’ అని కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) విమర్శించారు.
* దేశాన్ని ఏకం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసించారు. అప్పట్లో ఆయన చేసిన కృషి వల్లే భారత్ మహోన్నత దేశంగా ఆవిర్భవించిందన్నారు. రాజ్యసభలో (Rajya Sabha) రాజ్యాంగంపై జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం మరింత బలం చేకూర్చిందని అన్నారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలతో విరుచుకుపడ్డారు. నియంతృత్వ అహంకారంతో విర్రవీగిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. కళ్లద్దాలు పరాయి దేశానివైతే.. భారతీయత ఎప్పటికీ కనిపించదంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కును కాలరాసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో రాజ్యాంగ సవరణ చేశారని మండిపడ్డారు. భారత్ ఎప్పటికీ స్వతంత్ర ఆర్థిక శక్తిగా ఎదగలేదంటూ చెప్పిన హస్తం పార్టీకి దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అమిత్‌షా అన్నారు. మనల్ని పాలించిన బ్రిటన్‌ను అధిగమించి భారత్ ప్రస్తుతం ఐదో ఆర్థికశక్తిగా అవతరించిందని గుర్తు చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం అందించాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌తో పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. గత ఐదేళ్లలో 93 కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చేయలేదని సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ పథకాలను అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. 73 కేంద్ర పథకాలను పునరుద్ధరించినట్లు చెప్పారు. రాష్ట్ర వాటా ఇచ్చిన పథకాలకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరారు. పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకిచ్చే ప్రత్యేక గ్రాంట్ పెండింగ్ నిధులు ఇవ్వాలన్నారు.
* వైకాపా నేత పేర్ని నాని పేదల బియ్యం బొక్కేసి నీతి కబుర్లు చెబుతున్నాడని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రూ.90లక్షల విలువైన 185 టన్నుల బియ్యాన్ని తినేశారని దుయ్యబట్టారు. పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందన్న మంత్రి కొల్లు రవీంద్ర.. దొంగ అయిన పేర్ని నానికి పరామర్శలు విడ్డూరమని మండిపడ్డారు. వైకాపా అంతా దొంగల పార్టీనే అని అర్థమవుతోందని ఆక్షేపించారు.
* శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై తితిదే ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యతో కలిసి అన్నమయ్య భవన్‌లో సమీక్షనిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
*** తితిదే నిర్ణయాలివే..
* 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
* 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్‌ఈడీ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
* జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజులకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు కేటాయింపు
* తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు
* భాజపా (BJP)లో సంస్థాగత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిని (BJP National President) ఎన్నుకునే అవకాశముంది. ప్రస్తుతం దాదాపు 60శాతం భాజపా రాష్ట్ర అధ్యక్షుల పదవీకాలాలు ముగిశాయి. వీటన్నింటికీ జనవరిలో ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాతి నెలలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ ముఖ్య నేతలు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భాజపా పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి.
* పుష్ప-2 సక్సెస్ మీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడమే నటుడు అల్లు అర్జున్ చేసిన తప్పా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. సీఎం పేరు మర్చిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. ‘‘అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు పెట్టండి. మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దాం. స్కాములు, ఫార్ములా అంటున్నారు.. అన్నీ చర్చిద్దాం. కేబినెట్ మీటింగ్‌లో కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
* రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్‌ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్‌లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. పేరు మర్చిపోయినందుకు యాక్టర్‌ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
* అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్‌ఎస్‌లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్‌ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ లేనేలేదు.
* శబరి (Sabari) కొండపైగల అయ్యప్ప దేవస్థానం (Ayyappa Temple) లో అపశృతి చోటుచేసుకుంది. ఓ 40 ఏళ్ల భక్తుడు ఉన్నట్టుండి ఫ్లైవోవర్ పైనుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతని కాలు, చెయ్యి విరిగింది. దాంతో అతడిని హుటాహుటిన దేవస్థానంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పంపా (Pampa) ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు మరిన్ని వైద్య పరీక్షలు చేయించేందుకు కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి అతడు మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు కర్ణాటకలోని రామనగర జిల్లాకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడికి మానసిక వైకల్యం ఏమైనా ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
* లగచర్లలో రైతులపై (Lagacharla Farmers) పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు (BRS leaders ) మంగళవారం మెదక్‌లో అంబేద్కర్ విగ్రహానికి (Ambedkar Statue) వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంఎల్‌సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి, జైలులో పెట్టడం సరైనది కాదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ.. ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z