Business

ChatGPT సెర్చింజన్ వచ్చేసింది-BusinessNews-Dec 17 2024

ChatGPT సెర్చింజన్ వచ్చేసింది-BusinessNews-Dec 17 2024

* పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తోన్న ఫుడ్‌ డెలివరీ రంగం దేశానికి ఎంతో కీలకమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. జొమాటో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫుడ్‌ డెలివరీ రంగంపై ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో 77లక్షల మంది డెలివరీ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. 2030 నాటికి వీరి సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. ‘‘2.5 కోట్ల మందికి ఉపాధి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ ఉద్యోగాలు కల్పించడమే అత్యంత ముఖ్యమైన అంశం’’ అని నితిన్‌ గడ్కరీ అన్నారు. దేశంలోని ఎంతో మంది నిరుద్యోగులకు జొమాటో ఉపాధి కల్పిస్తోందన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ ఏజెంట్లు లిమిటెడ్‌ సమయంలో వస్తువులను డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక.. ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు.

* సెర్చ్‌ ఇంజిన్‌ విషయంలో గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు చాట్‌జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ (OpenAI) సెర్చ్‌ ఇంజిన్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే పెయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తాజాగా నిర్వహించిన ఈవెంట్‌లో స్పష్టం చేసింది. అంటే ఇకపై సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేకుండా ఎవరైనా చాట్‌జీపీటీ సెర్చ్‌ ఇంజిన్‌ను వినియోగించుకోవచ్చన్నమాట. మరిన్ని సదుపాయాలు, సరికొత్త హంగుల్ని దీనికి జోడించినట్లు తెలిపింది. చాట్‌జీపీటీ ఆప్టిమైజ్‌ వెర్షన్‌ను ఆవిష్కరించింది. స్మార్ట్‌ఫోన్‌, టాబ్లెట్లతో ఈ సెర్చ్‌ ఇంజిన్‌ వినియోగించేవారికి మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఇందులో తాజాగా అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ సెర్చ్‌ మోడ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాయిస్‌ కమాండ్ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. చాట్‌జీపీటీ లాగిన్‌ అయిన యూజర్లందరూ సెర్చ్‌ ఇంజిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు తోడు.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనుండటంతో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 81,511.81 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,748.57) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా అదే ఒరవడి కొనసాగించింది. తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 80,612.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1064 పాయింట్లు క్షీణించి 80,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 322 పాయింట్లు కుంగి 24,336 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 (SENSEX- 30) సూచీలో ఐటీసీ మాత్రమే లాభాల్లో ముగిసింది. మిగిలిన షేర్లన్నీ నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ సుజీకీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73.56 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,655.80 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

* పెద్దఎత్తున రిటర్నులు.. అంటూ స్టేట్‌బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ చెబుతున్నట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ (SBI) స్పందించింది. ఇవన్నీ కేవలం నకిలీ వీడియోలు అంటూ స్పష్టంచేసింది. ఈమేరకు ‘ఎక్స్‌’ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్‌ విడుదల చేసింది. ‘‘బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు నమ్మొద్దు. ఆ వీడియోలో పేర్కొన్న పథకాలతో బ్యాంక్‌కు గానీ, బ్యాంక్‌ అధికారులకు గానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలో ఫలానా పథకంలో పెట్టుబడి పెట్టండంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఇలాంటి అవాస్తవమైన, అసాధారణ రాబడి ఇచ్చే వాగ్దానాలు ఎస్‌బీఐ చేయదు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేసింది.

* బంగారం అంటే మహిళలకు ఎంతో మక్కువ. ప్రతి ఒక్కరూ పండుగలు, కుటుంబ శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయాలని తలపోస్తారు. సాధ్యం కాకుంటే ఉన్న బంగారం ఆభరణాలే ధరిస్తారు. కానీ, కొనేండ్లుగా బంగారం ఆభరణాల వినియోగం క్రమంగా వృద్ధి చెందుతోంది. దీనికి తోడు దేశీయంగా బంగారం దిగుమతిపై సుంకాల తగ్గింపు.. అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయంగా బంగారం ధరల్లో ఒడిదొడుకులు.. వినియోగదారుడి సెంటిమెంట్ బలోపేతం.. పెండ్లిండ్లూ పండుగల సీజన్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బంగారం ఆభరణాల వినియోగం 14-18 శాతం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో బంగారం ఆభరణాల వినియోగం 18 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో బంగారం కడ్డీలు, బంగారం నాణెల కొనుగోళ్లు పెరిగాయి. 2024 జూలైలో బంగారం దిగుమతిపై సుంకం 900 బేసిక్ పాయింట్లు తగ్గించడం, దరిమిలా కొంతకాలం బంగారం ధరల్లో సర్ధుబాట్లు నమోదయ్యాయి. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ త్రైమాసికంలో బంగారం ఆభరణాల కొనుగోళ్లు బలహీనంగా ఉంటాయి. కానీ, సుంకాల తగ్గింపుతోపాటు నైరుతి రుతుపవనాల్లో వర్షాలు కురవడం, పవిత్ర దినాలు, పెండ్లిండ్ల సీజన్ నేపథ్యంలో బంగారం ఆభరణాలకు గిరాకీ పెరిగింది. సంఘటిత మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో స్టోర్ల ఏర్పాటుకు వివిధ జ్యువెల్లరీ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z