* పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న ఇరాన్‌కు కరెన్సీ (Rial) కష్టాలు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇరానియన్ రియాల్’ భారీ స్థాయిలో పతనమవుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం తర్వాత మరింత పడిపోవడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. డాలరుతో పోలిస్తే మారకపు విలువ నవంబర్‌లోనే దాదాపు 10 శాతం పడిపోయింది. శక్తిమంతమైన దేశాలతో ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకున్న సమయంలో (2015లో) డాలరు మారకపు విలువ 32 వేలుగా ఉంది. ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మరణం తర్వాత ఈ ఏడాది జులైలో అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన రోజు డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.03 లక్షల రియాల్స్‌కు పతనమైంది. ప్రస్తుతం అది 7,77,000 రియాల్స్‌కు పడిపోయినట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇరాన్‌లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం వెంటాడుతోంది. భారీ స్థాయిలో సహజవాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన రంగాన్ని సిద్ధం చేయలేకపోతోందనే వాదన ఉంది. దీంతో కీలక సమయాల్లో ఇంధన కొరత ఏర్పడుతున్నట్లు సమాచారం.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) బుధవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. దీనికి తోడు ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీంతో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 137 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్ ఉదయం 80,666.26 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,684.45) నష్టంతో ప్రారంభమైనప్పటికీ.. కాసేపు లాభాల్లో కదలాడింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 80,050.07 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ. చివరికి 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది.
* దేశీయ మార్కెట్లో ఐపీఓల హవా కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలి పబ్లిక్ ఆఫర్‌ల (IPO) ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించేందుకు పలు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. మొయిన్ బోర్డు కేటగిరీ నుంచి విశాల్ మెగామార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్… మూడు కంపెనీలు ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. మంచి ప్రీమియంతో లిస్ట్ అయిన ఈ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. దీంతో వీటి మొత్తం మార్కెట్ విలువ రూ.70వేల కోట్లకు చేరింది. విశాల్ మెగా మార్ట్ (Vishal Mega Mart).. రూ.104 వద్ద షేర్లు ప్రారంభమయ్యాయి. అంటే ఇష్యూ ధర రూ.78తో పోలిస్తే 33.33 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మార్కెట్ ముగిసే సమయానికి 45 శాతం లాభంతో 112.36 వద్ద స్థిరపడ్డాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.50వేల కోట్లకు పెరిగింది. ఇక నేడు లిస్ట్ అయిన మరో కంపెనీ సాయి లైఫ్‌సైన్సెస్ (Sai Life Sciences). 18 శాతం ప్రీమియంతో రూ.549 వద్ద కంపెనీ షేర్లు ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. చివరకు 40 శాతం లాభంతో రూ.766 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.16వేల కోట్లకు చేరింది.
* ఎయిర్ ఇండియా తన దేశీయ, అంతర్జాతీయ రూట్ నెట్‌వర్క్‌లోని విద్యార్థులకు ప్రత్యేక తగ్గింపు ఛార్జీలు, అదనపు ప్రయోజనాలను బుధవారం ప్రారంభించింది. విద్యార్థులకు బేస్ ఛార్జీలపై 10% వరకు తగ్గింపు ఇవ్వడమే కాకుండా, అదనంగా 10 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతినిస్తుంది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో టికెట్ బుక్ చేసిన వారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ తగ్గింపుతోపాటు ఒకసారి ప్రయాణ తేదీని ఉచితంగా మార్పు చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఈ ప్రత్యేక ఛార్జీలు ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్యాబిన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. భారత్‌లోని 49 నగరాలకు, విదేశాల్లో 42 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా సర్వీసులను నిర్వహిస్తోంది. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాతో సహా మరికొన్ని గమ్యస్థానాల్లో దేని మధ్యనైనా ప్రయాణించే విద్యార్థులు ఈ సౌకర్యాలు పొందొచ్చు. ఎయిర్ ఇండియా మొబైల్ యాప్‌పై టికెట్లు కొనుగోలు చేసేవారికి ఇప్పటికే ఎటువంటి బుకింగ్ రుసుమును వసూలు చేయడం లేదు. దీనివల్ల విద్యార్థులు దేశీయ విమానాల్లో రూ.399, అంతర్జాతీయ విమానాల్లో రూ.999 వరకు ఆదా చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిర్ ఇండియా బ్యాంకు భాగస్వాములు జారీ చేసిన క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసి మరికొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తం ఆఫర్లతో విద్యార్థులు మొత్తం 25% వరకు తగ్గింపును పొందొచ్చు. ఎయిర్ ఇండియా లాయల్టీ ప్రోగ్రాం ‘మహారాజా క్లబ్’లో కూడా విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకోవచ్చు. దాని ద్వారా ప్రతి ట్రిప్‌లో రివార్డు పాయింట్లను పొందొచ్చు. కాంప్లిమెంటరీ టికెట్లు, అప్‌గ్రేడ్ కోసం రెడీమ్ చేసుకోవడానికి వాటిని వినియోగించొచ్చు. మహారాజా క్లబ్ సభ్యులు నేరుగా ఎయిర్‌ఇండియా వెబ్‌సైట్/ యాప్‌లో బుక్ చేసినప్పుడు 33% వరకు అదనపు రివార్డు పాయింట్లను పొందుతారు.
* ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ (Realme) మరో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ 14ఎక్స్ (Realme 14x) పేరిట లాంచ్ చేసింది. IP69 రేటింగ్, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరాతో దీన్ని తీసుకొచ్చింది. రియల్‌మీ కొత్త మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా.. 8 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.15,999 గా కంపెనీ నిర్ణయించింది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z