* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా – ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి కదా..? చర్చ నాలుగు గోడల మధ్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు అని కేటీఆర్ అన్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్ (BRS) పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కోరింది. డిసెంబర్ 19న (గురువారం) దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది.
* శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మెస్ ఛార్జీలు, రైతు బీమా, వ్యవసాయ యంత్ర పరికరాలకు డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భట్టి విక్రమార్కకు హరీశ్‌రావు సవాల్ విసిరారు. రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఛాలెంజ్ వేస్తున్నా.. భట్టి విక్రమార్క మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే.. నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో భట్టి మాటల్లో నీతి అంత ఉంది. ఉట్టిఉట్టిగా మాట్లాడట్లేదు. రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో ఇస్తాను. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెస్ ఛార్జీలు పెంచింది. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులు ఇచ్చాం. నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధం. ఒక వేళ ఇచ్చి ఉంటే భట్టి విక్రమార్క రాజీనామా లేఖను సీదా గవర్నర్ గారికి ఇస్తారా..? అని స్పీకర్ ద్వారా హరీశ్‌రావు సవాల్ విసిరారు.
* స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పురపాలక, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని చెప్పారు. మూడు బిల్లులకు బీఆర్‌ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. తమ సవరణలను ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అసరమైతే సభలో డివిజన్‌కు కూడా పట్టుబడుతామని స్పష్టం చేశారు.
* అంబేద్కర్ (Ambedkar) పై కేంద్ర మంత్రి అమిత్ షా (Minister Amit Shah) వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ఆరోపించారు. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమని ట్విటర్‌లో ( Twitter ) పేర్కొన్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసినట్లేనని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమేనని వ్యాఖ్యనించారు. మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందని, రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తోందని మండిపడ్డారు.
* తెలంగాణలో పదో తరగతి (TG 10th Exams) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
* అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో శుభవార్త చెప్పింది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితిని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం షెడ్యూలింగ్, రీషెడ్యూలింగ్‌లో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇకపై ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్‌మెంట్ (US visa appointment rules)ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జనవరి 1, 2025 అంటే నూతన సంవత్సరం నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయనున్నట్లు భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ‘‘ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా వీసా (Visa) ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లు కల్పించాలి. వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. జనవరి 1, 2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్‌లో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ (Visa Appointment)కు తొలి షెడ్యూల్‌చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్‌ను మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీరు అపాయింట్‌మెంట్‌ను మిస్ అయినా.. లేదా రెండోసారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా.. కొత్త అపాయింట్‌మెంట్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మళ్లీ అప్లికేషన్ రుసుము చెల్లించాలి’’ అని ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
* టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసీస్‌తో మూడో టెస్టు డ్రా గా ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆస్ట్రేలియా నుంచి బయలుదేరిన అశ్విన్ ఇవాళ భారత్‌కు చేరుకున్నాడు.
* కేంద్ర క్యాబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు.
* నటుడు మోహన్‌బాబు (Mohan Babu) హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. తీర్పును న్యాయస్థానం ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. కుటుంబ వివాదం నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్ట్‌పై దాడి ఘటనలో ఆయనపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* భార్యకు మత్తుమందు ఇచ్చి.. పలువురితో అత్యాచారం చేయించిన కేసులో (French mass rape Case)లో ఫ్రాన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె మాజీ భర్త డొమినిక్ పెలికాట్ (72) (Dominique Pelicot)తో పాటు అత్యాచారానికి పాల్పడిన మరో 50 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. ఫ్రాన్స్‌లో (France) సంచలనం రేపిన ఈ కేసుపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం డొమినిక్‌తో పాటు వారందర్నీ నేరస్థులుగా పరిగణిస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ప్రపంచం తలదించుకునేలా ఓ మహిళపై పాశవికంగా ప్రవర్తించిన డొమినిక్‌కు మాత్రం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగతా దోషులకు విధించిన శిక్షపై స్పష్టత లేదు.
* వైకాపా ప్రభుత్వం తీరుతో ఏపీ ఫైబర్‌నెట్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి (GV Reddy) అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)కు అప్పటి అధికారులు అక్రమంగా రూ.2.10కోట్లు చెల్లించారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీ రెడ్డి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలలు అందించడమే లక్ష్యంగా 2016లో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారన్నారు. 2019 నాటికి 24వేల కి.మీ మేర కేబుల్ వేసి 10లక్షల కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇవాళ ఆ సంఖ్య 5లక్షలకు పడిపోయిందన్నారు.
* ఔటర్ రింగ్ రోడ్డును ఆయాచితంగా అప్పనంగా ఎవరికో అప్పగించారని, టెండర్లపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సిట్‌తో సమగ్ర దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై విచారణ జరపాలని హరీశ్‌రావు కోరటం అభినందనీయమన్నారు. సిట్ విచారణను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
* టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. భార్య, పిల్లలతో కలిసి త్వరలో లండన్‌లో స్థిరపడతాడని సమాచారం. రిటైర్మెంట్ తర్వాత తన మిగిలిన జీవితాన్ని యూకేలో గడపాలనుకుంటున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వెల్లడించారు. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్‌లో పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తోంది. కోహ్లీ, అనుష్క దంపతుల కుమారుడు అకాయ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లోనే జన్మించాడు. కోహ్లీ కుటుంబం ఈ ఏడాది ఎక్కువ కాలం లండన్‌లో ఉన్నారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత కూడా ఫ్యామిలీని కలిసేందుకు కోహ్లీ యూకేకు వెళ్లాడు. అక్కడ కోహ్లీకి ఆస్తులు కూడా ఉన్నాయి. ‘అవును.. విరాట్ తన పిల్లలు, భార్య అనుష్క శర్మతో కలిసి లండన్ వెళ్లాలని యోచిస్తున్నాడు. అతను భారత్‌ను వదిలి అతి త్వరలో యూకేకు షిఫ్ట్ కాబోతున్నాడు. అయితే, ప్రస్తుతం కోహ్లీ క్రికెట్‌తో పాటు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు’ అని రాజ్‌కుమార్ శర్మ తెలిపారు.
* సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం జల్‌జీవన్ మిషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రూ.26,804 కోట్ల ప్రతిపాదనలు పంపి రూ.4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. చిన్న రాష్ట్రాలు కూడా రూ.లక్ష కోట్లకు పనులు చేసుకున్నాయన్నారు. గతంలో చేపట్టకుండా నిలిచిపోయిన పనులు పునఃపరిశీలిస్తామన్నారు. పరిశీలన తర్వాత ప్రాజెక్టులు తిరిగి చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు.
*** మంత్రివర్గ నిర్ణయాలివే..
అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయం
హడ్కో ద్వారా రూ.11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతి
జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్ల రుణానికి ఆమోదం
45 పనులకు రూ.33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతి
బుడమేరు, పది జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్‌కు ఆమోదం
ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.వెయ్యి కోట్ల రుణానికి ఆమోదం
పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు అనుమతి
పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు ఆమోదం
క్లీన్ ఎనర్జీ కోసం ఎన్‌టీపీసీ ద్వారా పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు
రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులతో విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటు
రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం. 1.41 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి.
* దేశంలో విద్యుత్ వాహన పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో 2030 నాటికి భారత ‘ఈవీ’ మార్కెట్ రూ.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు. గురువారం నిర్వహించిన ‘8వ ఈవీఎక్స్‌పో 2024’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ గురించి మాట్లాడారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z