Business

వాట్సాప్‌లో ఛాట్‌జీపీటీ-BusinessNews-Dec 19 2024

వాట్సాప్‌లో ఛాట్‌జీపీటీ-BusinessNews-Dec 19 2024

* మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ఏఐ (OpenAI) మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ‘12 డేస్‌ ఆఫ్‌ ఓపెన్‌ఏఐ’ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్‌ చాట్‌జీపీటీని (chatGPT) వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్‌, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే (Whatsapp) చాట్‌జీపీటీని వినియోగించొచ్చు. ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఓపెన్‌ఏఐ అందుబాటులోకి తెచ్చింది. +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్‌ చేయొచ్చు. మనం అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ (chatGPT) సమాధానాలు ఇస్తుంది. భారత్‌లోనూ దీన్ని వాడుకోవచ్చు. ఇదే నంబర్‌కు కాల్‌ చేసి కూడా చాట్‌జీపీటీ సేవలు పొందొచ్చు. అయితే, ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం అమెరికా, కెనడాకు మాత్రమే పరిమితం.

* ఈ క్యాలెండర్‌ సంవత్సరం(2024)లో దేశీయ స్థిరాస్తి రంగం 4.20 బిలియన్‌ డాలర్ల(రూ.35,700 కోట్ల) ప్రైవేట్‌ ఈక్విటీ(PE) పెట్టుబడులను ఆకర్షించింది. ఇది 32% వార్షిక వృద్ధిని సూచిస్తోంది. దీనికి కారణం రెసిడెన్షియల్‌ విభాగంలో అధిక ఇన్‌ఫ్లోలని స్థిరాస్తి కన్సల్టెంట్‌ ‘నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా’ ఈరోజు(గురువారం) ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల ట్రెండ్స్‌ 2024 నివేదికలో తెలిపింది. మొత్తం పెట్టుబడుల్లో 45% వాటాతో వేర్‌హౌసింగ్‌ రంగం ముందుంది. ఆ తర్వాత రెసిడెన్షియల్‌ సెక్టార్‌ 28 శాతం, ఆఫీస్‌(కార్యాలయ) రంగం 26 శాతంగా ఉన్నాయి. 2024లో రెసిడెన్షియల్‌ సెక్టార్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులు 1,177 మిలియన్‌ డాలర్లతో రెండింతలు పెరిగాయి. వేర్‌హౌసింగ్‌ రంగం 1,877 మిలియన్‌ డాలర్లను, కార్యాలయ రంగం 1,098 మిలియన్‌ డాలర్లను పొందాయి. దేశీయ స్థిరాస్తి రంగంలో మొత్తం ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడుల్లో 50% వాటాతో ముంబై అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది. ఈ విధంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో UAE నుంచి వచ్చిన మూలధన ప్రవాహం గరిష్ఠంగా 1.70 బిలియన్‌ డాలర్ల(రూ.14,450కోట్ల)గా ఉందని అంచనా. ఇది మొత్తం పెట్టుబడుల్లో 42%. స్వదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది 1.30 బిలియన్‌ డాలర్ల(రూ.11,050 కోట్ల)ను పెట్టుబడిగా పెట్టారు. సింగపూర్‌ సంస్థలు, ఫండ్లు..భారత్‌లో ప్రైవేట్‌ ఈక్విటీలో 633.70 మిలియన్‌ డాలర్లు(రూ.5,390 కోట్లు) పెట్టుబడి పెట్టాయి.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market today) భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మన మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో స్థిరపడ్డాయి. తాజాగా 25 బేసిస్‌ పాయింట్ల మేర కీలక వడ్డీ రేట్లను తగ్గించిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌.. వచ్చే ఏడాది మాత్రం మార్కెట్‌ ఆశించిన స్థాయిలో రేట్ల కోత ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇవ్వడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో రోజంతా సూచీలు నష్టాల్లో కదలాడాయి. సెన్సెక్స్‌ మళ్లీ 80వేల దిగువ స్థాయికి చేరగా.. మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఒక్క సెషన్‌లో ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆ మేర క్షీణించి రూ.450 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 79,029.03 పాయింట్ల వద్ద నష్టాల్లో (క్రితం ముగింపు 80,182.20) ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కొనసాగింది. ఓ దశలో 1200 పాయింట్ల మేర పతనమైన సూచీ..79,020.08 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 964.15 పాయింట్ల నష్టంతో 79,218.05 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 247.15 పాయింట్ల నష్టంతో 23,951 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠ స్థాయి అయిన 85.08 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2635 డాలర్ల స్థాయి వద్ద కొనసాగుతోంది.

* దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ కియా (Kia) ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. సైరాస్‌ (Syros) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఈ కారు ఆరు వేరియంట్లలో లభిస్తుంది. జనవరి 3 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది. ధర త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. సరికొత్త డిజైన్‌, ఆకర్షణీయమైన లుక్‌తో కియా సైరాస్‌ను తీసుకొచ్చింది. తన ప్రీమియం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈవీ9 తరహా డిజైన్‌తో దీన్ని రూపొందించడం గమనార్హం. వర్టికల్‌ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్స్‌ ఉన్నాయి. అలాయ్‌ వీల్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. HTX+(O), HTX+, HTX, HTK+, HTK (O), HTK.. ఇలా ఆరు వేరియంట్లలో ఇది లభిస్తుంది. భద్రత కోసం ఇందులో 360డిగ్రీ కెమెరా, సిక్స్ ఎయిర్‌ బ్యాగులు, హిల్‌ స్టార్ట్‌ అసిస్టెంట్‌, లెవల్‌- 2 ADAS ఫీచర్లు జోడించారు.

* దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఎయిర్‌ ఇండియా (Air India) గురువారం 34 శిక్షణ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. వీటితో దక్షిణాసియాలోనే అతిపెద్ద వైమానిక శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ప్రారంభించనుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థం నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తీసుకొని దీని కార్యకలాపాలు మొదలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా ఆర్డర్‌ ఇచ్చిన వాటిల్లో అమెరికాకు చెందిన పైపర్‌ సంస్థకు చెందిన 31 సింగల్‌ ఇంజిన్‌ విమానాలు కాగా.. డైమండ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఆస్ట్రియా నుంచి మరో మూడు ట్విన్‌ ఇంజిన్‌వి ఉన్నాయి. జెట్‌ ఏ1 ఇంజిన్‌లు, జీ1000 ఏవియానిక్స్, గ్లాస్‌కాక్‌పిట్‌తో వీటిని తయారు చేయనున్నారు. 2025లో వీటి డెలివరీలు కూడా మొదలు కానున్నాయి. అమరావతిలోని బెలోరా ఎయిర్‌ పోర్టులో ఏర్పాటు చేసిన శిక్షణ సంస్థ నుంచి ఏటా 180 మంది కమర్షియల్‌ పైలట్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ‘‘మన దేశంలో పైలట్‌ శిక్షణ ఇన్ఫ్రా, స్వయం సమృద్ధిని సాధించడంలో ఎయిర్‌ ఇండియా, భారత వైమానిక రంగానికి ఈ సరికొత్త ఎఫ్‌టీవో (ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్‌) ఒక వ్యూహాత్మక ముందడుగు. ఇది ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌కు మద్దతుగా నిలుస్తుంది’’ అని ఎయిర్‌ ఇండియా ఏవియేషన్‌ అకాడమీ డైరెక్టర్‌ సునీల్‌ భాస్కరన్‌ పేర్కొన్నారు.

* దీర్ఘశ్రేణి క్షిపణి టెక్నాలజీ వ్యాప్తికి సహకరిస్తున్నాయంటూ పాక్‌(Pakistan)కు చెందిన నాలుగు కీలక సంస్థలపై అమెరికా (USA) ఆంక్షలను విధించింది. ఈమేరకు బుధవారం అగ్రరాజ్య విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్‌ ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది. ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఇక అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా అమెరికా జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఎన్‌డీసీ సంస్థ క్షిపణి ప్రయోగానికి వినియోగించే వాహనాల చాసిస్‌లను, పరీక్షలకు వినియోగించే పరికరాలను కొనుగోలు చేస్తోందని పేర్కొంది. ఈ సంస్థ షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z