Business

మూడోరోజు కూడా ఆగని బంగారం ధరల పతనం-BusinessNews-Dec 20 2024

మూడోరోజు కూడా ఆగని బంగారం ధరల పతనం-BusinessNews-Dec 20 2024

* గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ తాజాగా సంస్థలో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఇందులో మేనేజర్ స్థాయి పోస్టులు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉంటారని గూగుల్ వర్గాల కథనం. ఇటీవల అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఉద్యోగుల ఉద్వాసన నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ధృవీకరించారు. ఓపెన్ఏఐ మాదిరిగా ఏఐ ఫోకస్డ్ సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని ఆపరేషన్స్ క్రమబద్ధీకరించేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు.

* వరుసగా మూడో రోజు బంగారం ధరలు దిగి వచ్చాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) ధర రూ.170 తగ్గి రూ.78,130లకు చేరుకున్నది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.78,300 పలికింది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ.1,800 పతనమై రూ.88,150లకు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.90 వేలు పలికింది. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.50 పెరిగి రూ.75,071 వద్ద నిలిచింది. వెండి ఫ్యూచర్స్ మార్చి డెలివరీ ధర రూ.86,540 పలికింది.

* భారత్ ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserve) నిల్వలు పతనం అయ్యాయి. ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు దాదాపు రెండు బిలియన్ డాలర్లు పతనమై 652.87 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఆరు నెలల కనిష్ట స్థాయికి సమానం అని వివరించింది. ఈ నెల 13తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఐదో తేదీతో ముగిసిన వారానికి 3.235 బిలియన్ డాలర్లు పతనమై 654.857 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నా, కొన్ని వారాలుగా ఫారెక్స్ రిజర్వు నిల్వలు పడిపోతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లతో జీవిత కాల గరిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే.

* దలాల్‌ స్ట్రీట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. వడ్డీ రేట్ల కోత విషయంలో ఫెడ్‌ వైఖరి కారణంగా నిన్న భారీ నష్టాలు చవిచూసిన మన మార్కెట్ సూచీలు.. ఇవాళ కూడా అదే బాటలో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో వరుసగా ఐదో రోజూ నష్టాలు చవిచూశాయి. ముఖ్యంగా రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎల్‌అండ్‌ టీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఈ వారంలో మొత్తంగా సెన్సెక్స్‌ దాదాపు 4 వేల పాయింట్ల మేర నష్టపోయింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఇవాళ ఒక్కరోజే దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరై.. రూ.441 లక్షల కోట్లకు చేరింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z