* అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా నటించిన ‘పుష్ప2: ది రూల్’ ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద రికార్డులు తిరగరాస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఏ కమర్షియల్ మూవీ సాధించనన్ని వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓటీటీకి (Pushpa 2 OTT) రానున్నదంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా జనవరి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానుందంటూ పోస్టులు కనిపించాయి. ఎట్టకేలకు ఆ వార్తలపై చిత్రబృందం తాజాగా స్పందించింది. 56 రోజుల (థియేటర్లలో విడుదలైన నాటి నుంచి) కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్ కాదని స్పష్టం చేసింది. వెండితెరపైనే ‘పుష్ప 2’ను చూసి హాలీడే సీజన్‌ను ఎంజాయ్ చేయమని చెప్పింది.
* ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు.
* బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో న్యాయ శాఖ మంత్రి ఫరూక్‌తో కలిసి ఫాస్ట్ ట్రాక్, స్పెషల్ కోర్టులలో ఉన్న కేసులు, పనితీరు, పురోగతిపై సమీక్ష నిర్వహించారు. స్పెషల్ కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఏసీబీ కోర్టులు, పోక్సో చట్టం, మహిళలకు సత్వర న్యాయమందించే న్యాయ వ్యవస్థలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. పోలీసు, జైళ్లు, న్యాయ వ్యవస్థల్లోని ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో కక్షలు, ఆక్రమణలపై ప్రశ్నించినందుకు కేసులు ఎదుర్కొన్న వారికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు.
* తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారు.. వారికి అభినందనలు తెలియజేస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఫార్ములా-ఈ రేసు అంశంపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఫార్ములా-ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చించాలని కోరితే.. భారాస సభ్యులను సభ నుంచి బయటకు పంపి చర్చించారు. ఫార్ములా-ఈ రేస్‌కు మూడో విడత కింద 50 శాతం నిధులు.. 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని ఏవీవీ కంపెనీ డిసెంబరు 22న దాన కిశోర్‌కు లేఖ రాసింది. 50శాతం నిధులు అంటే కేవలం రూ.45 కోట్లు మాత్రమే. నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప.. ఇల్లీగల్ మాత్రం లేదు. రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి. ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీపడ్డాయి. రేసింగ్ కోసం మొదటి దఫాలో రూ.30కోట్లు ఖర్చు పెడితే జీఎస్‌టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.71 కోట్లు వచ్చింది. మూడో విడతలో రూ.45 కోట్లు చెల్లిస్తే..రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం వచ్చేది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా-4 నిర్వహించి రూ.140 కోట్లు ఖర్చు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్రో-ఏసియన్ గేమ్స్ నిర్వహించింది.
* ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకునేందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుదోవ పట్టించేలా థంబ్‌నైల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. అసలు వీడియోకు టైటిల్‌కు సంబంధమే ఉండదు. ఉదాహరణకు ఫలానా సినిమా అంటూ థంబ్‌నైల్‌లో చూపించి ఏదో సినిమాను లోపల పెడుతుంటారు. ఇక సెలబ్రిటీలు, రాజకీయ నేతల గురించి ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ క్రియేట్ చేస్తుంటారు. తీరా లోపలికి వెళ్తే.. అలాంటిదేమీ ఉండదు. ఇలా తప్పుదోవ పట్టించే చర్యలతో యూజర్లు విసుగెత్తి పోతున్నారు. వీటి కారణంగా సమయం వృథా అవ్వడమే కాకుండా ప్లాట్‌ఫామ్‌పై విశ్వాసం తగ్గిపోతోంది. దీంతో యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. బ్రేకింగ్ న్యూస్, తాజా వార్తల విషయంలోనూ ఇలాంటి క్లిక్ బైట్ టైటిల్స్, థంబ్‌నైల్స్ వాడకం మరీ ఎక్కువైంది. దీంతో ఎలాగైనా వీటికి అడ్డుకట్టు వేయాలని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నిర్ణయించుకుంది. ఇలా తప్పుదోవ పట్టించేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తే రానున్న రోజుల్లో కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా త్వరలోనే కొత్త నిబంధనల్ని తేనున్నట్లు పేర్కొంది. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు పాటించని వారి వీడియోలను తొలుత డిలీట్ చేయనున్నట్లు తెలిపింది. ఒకవేళ మళ్లీ నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఛానల్‌పై స్ట్రైక్ (strikes) వేస్తుంది. ముఖ్యంగా భారత్‌లో ఇలాంటి తప్పుదోవ పట్టించే వీడియోలు ఎక్కువవుతున్న వేళ ఈ చర్యలకు దిగినట్లు యూట్యూబ్ తెలిపింది.
* రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలని తిరుపతి కొండ ఎక్కినప్పుడు మొక్కుకున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(pawankalyan) అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ బాగుజోల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం నూతన రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో సుమారు రూ.36.71 కోట్ల వ్యయంతో, 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు.. తద్వారా 55 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 2017 పోరాట యాత్ర సమయంలో గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కొన్ని సమస్యలు చూశానని పవన్ తెలిపారు. తాగునీరు, రహదారులు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టారు గానీ.. ఇక్కడ రోడ్లు మాత్రం వేయలేకపోయారని వైకాపా(ysrcp) పాలనను విమర్శించారు.
* జమిలి ఎన్నికల(simultaneous polls)పై అధ్యయనానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ఛైర్మన్‌గా భాజపా ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో సభ్యుల సంఖ్యను గురువారం 31 నుంచి 39కి పెంచారు. దీని ప్రకారం లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉంటారు.
* ముగ్గురిపై పెట్రోల్ పోసి హతమార్చిన కేసులో నిందితుడికి నాంపల్లి కోర్టు మరణ శిక్ష విధించింది. 2022లో నారాయణగూడకు చెందిన సాయిలు.. తన భార్య, ఆమె ప్రియుడు, చిన్నారిపై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశాడు. సుదీర్ఘ వాదనల అనంతరం మరణ శిక్ష విధిస్తూ శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పు వెలువరించింది. సాయిలుకు సహకరించిన అతని స్నేహితుడు రాహుల్‌కు రూ.1000 జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
* పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Winter Session).. అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు సహా కొన్ని అసాధారణ ఘటనల మధ్య ముగిశాయి. రాజ్యాంగంపై చర్చ, జేపీసీకి జమిలి బిల్లులు (One Nation One Election) పంపించడం వంటివి జరిగినప్పటికీ.. బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోమ్ మంత్రి అవమానకర వ్యాఖ్యలు చేశారని విపక్షాల ఆరోపణలతో ఉభయ సభలు అట్టుడికాయి. అమిత్ షా రాజీనామా చేయాలన్న విపక్షాల నిరసనల మధ్య ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే చివరి రోజు ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల ఉత్పాదకత భారీగా పడిపోయినట్లు వెల్లడైంది.
* దేశ రాజధాని నగరం దిల్లీ(Delhi)లో దారుణ ఘటన వెలుగుచూసింది. మహిళల వాష్‌రూమ్‌లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ కెమెరా ఆన్‌చేసి ఎవరికీ కనిపించకుండా ఉంచడం అందరినీ షాకింగ్‌కు గురిచేసింది. ద్వారక ప్రాంతంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ వాష్‌రూమ్‌కి వెళ్లిన సందర్భంలో అకస్మాత్తుగా ఆ ఫోన్ మోగడంతో ఈ దుర్మార్గపు చర్య బయటపడింది. నిందితుడు ఆస్పత్రిలో హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నెల రోజుల నుంచి ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో చెప్పాడని పోలీసులు వెల్లడించారు. మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
* ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన డ్రగ్స్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వసీమ్‌ఖాన్ ముంబయి నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వసీమ్‌ఖాన్‌పై నిఘా పెట్టిన పోలీసులు.. బస్సులో ముంబయి నుంచి 320 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తీసుకొస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న మరో నిందితుడు ఆయాన్ కోసం గాలిస్తున్నారు.
* జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేసినట్లు తితిదే పేర్కొంది. మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబరు 25న ఉదయం 11 గంటలకు, మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 26న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తితిదే పేర్కొంది. ఈ మార్పును భక్తులు గమనించాలని.. తితిదే వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు సూచించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z