* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆటో, ఫైనాన్స్ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతుతో కాసేపు రాణించాయి. తర్వాత ప్రధాన షేరల్లో మదుపర్లు విక్రయాలకు దిగగా నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో కదలాడిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,557.28 పాయింట్ల (క్రితం ముగింపు 78,472.87) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,173.38 – 78,898.37 మధ్య కదలాడింది. చివరకు 0.39 పాయింట్ల నష్టంతో 78,472.48 వద్ద స్థిరపడింది. ఇక ఇంట్రాడేలో 23,854.50 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 22 పాయింట్ల లాభంతో 23,750 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 (SENSEX- 30) సూచీలో అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి. టైటాన్, ఏషియన్ పెయింట్స్, జొమాటో, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్లు వద్ద, బంగారం ఔన్సు 2,642 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు క్షీణించి 85.27 వద్ద ముగిసింది.
* ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు చెందిన ఈ- టికెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్, యాప్‌లు గురువారం పనిచేయడంలేదు. అయితే నిర్వహణపరమైన పనులు చేపట్టడంతోనే టికెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ‘‘నిర్వహణ పనుల కారణంగా.. ఈ-టికెట్ సేవలు అందుబాటులో లేవు. తర్వాత ప్రయత్నించండి. టికెట్ రద్దు చేసుకోవడానికి, ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ లేదా etickets@irctc.co.inకు మెయిల్ చేయండి’’ అని ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. కాసేపటి తర్వాత మళ్లీ ఐఆర్‌సీటీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో సేవల్లో అంతరాయం తలెత్తడంపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
* కొత్త సంవత్సరంలోనూ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగా తరలి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు, సవాళ్లు ఉన్నప్పటికీ.. ఈ ఏడాదిలో ప్రతి నెలా సగటున 4.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.38,250 కోట్ల) ఎఫ్‌డీఐ మన దేశంలోకి వచ్చింది. ఇదే జోరు 2025లోనూ కొనసాగొచ్చని పరిశ్రమ ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్‌దీప్ సింగ్ భాటియా తెలిపారు. వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితులను పెంచడం, నియంత్రణపరమైన అవరోధాలను తొలగిస్తుండటం, వ్యాపారానుకూల పరిస్థితులను మెరుగుపర్చడమే ఇందుకు కారణమని ఆయన విశ్లేషించారు.
* డిజిటల్ యుగంలో లావాదేవీలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది యూపీఐ పేమెంట్ సదుపాయం. యూపీఐ ఐడీ, ఫోన్ నంబర్, క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇలా దేనితోనైనా చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీని వైపు మక్కువ చూపుతున్నారు. ఒక్కోసారి పొరపాటున రాంగ్ నంబర్‌కు దీని నుంచి చెల్లింపులు చేసేస్తుంటాం. దీంతో ఆ సొమ్మును ఎలా రాబట్టాలో తెలియక తికమకపడుతుంటాం. ఆ డబ్బు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి. లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను భద్ర పరుచుకోవడం ముఖ్యం. ట్రాన్సాక్షన్ ఐడీ, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ జరిపిన తేదీలను జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే మీరు యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం మంచిది. మీరు ఏ యాప్ ద్వారా చెల్లింపు జరిపారో.. దాని కస్టమర్ కేర్‌ను సంప్రదించి విషయం తెలియజేయండి. ప్రతి యాప్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను నిర్వహిస్తుంది. వారికి సాక్ష్యాలు చూపించగానే రిఫండ్ ప్రాసెస్ గురించి మీకు సమాచారం అందిస్తారు. యూపీఐ యాప్ కస్టమర్ సర్వీసు నుంచి సాయం అందకపోతే.. మీరు ఎన్‌పీసీఐ పోర్టల్‌లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎన్‌పీసీఐ (NPCI) అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఎడమవైపు కనిపించే యూపీఐ సెక్షన్‌లో Dispute Redressal Mechanism ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కనిపించే Complaint సెక్షన్‌లో మీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ఫిర్యాదు స్వీకరిస్తుంది. మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్లు సాయం చేస్తారు. లావాదేవీకి సంబంధించి విషయాన్ని మీ బ్యాంక్‌లో తెలియజేసి సాయం కోరచ్చు. బ్యాంక్ అడిగే అన్ని వివరాలు, పత్రాలు అందించగానే రిఫండ్ కోసం ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియను మొదలుపెడతారు. సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఎవరికైతే పొరబాటున పంపామో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి. ఒకవేళ డబ్బు వాపసు పంపేందుకు నిరాకరించినట్లయితే.. చట్టబద్ధంగా ఫిర్యాదు చేయొచ్చు. పైన తెలిపిన మార్గాల ద్వారా మీరు సమస్యను పరిష్కరించుకోలేకపోతే నేరుగా ఆర్‌బీఐకి కూడా ఫిర్యాదు పంపొచ్చు.
* దేశ రాజధాని ఢిల్లీలో గురువారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.250 పెరిగి రూ.78,850లకు చేరుకున్నది. మంగళవారం తులం బంగారం ధర రూ.78,600 వద్ద స్థిర పడింది. మరోవైపు కిలో వెండి ధర వరుసగా మూడో సెషన్ లోనూ రూ.300 వృద్ధి చెంది రూ.90,800లకు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.90,500 వద్ద ముగిసింది. ఇక గురువారం 99.5 శాతం స్వచ్ఛత గత బంగారం తులం ధర రూ.250 పెరిగి రూ.78,450లకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఫిబ్రవరి డెలివరీ బంగారం తులం ధర రూ.442 వృద్ధితో రూ.76,712 వద్ద స్థిర పడింది. మార్చి వెండి డెలివరీ కిలో ధర రూ.343 పెరిగి రూ.89,669లకు చేరుకున్నది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర 9.10 డాలర్లు పుంజుకుని 2664.60 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ వెండి ధర 30.34 డాలర్లు పలికింది.
* ప్రతి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెడతారు. గతంలో ఫిబ్రవరి నెల చివరి రోజు సాయంత్రం ప్రవేశ పెడితే, తర్వాత మధ్యాహ్నానికి మార్చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్‌లో వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ ప్రతి ఒక్కరూ ఆదాయం పన్నులో మార్పులూ చేర్పులూ ఉంటాయా? అన్న కోణంలో చూస్తూ ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపు దారులకు రిలీఫ్ కల్పించాలని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారు. పట్టణాల్లో నివసించే వారికి రూ.15 లక్షల వరకూ పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా మధ్య తరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతోపాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇంటి అద్దెలు, పొదుపు పథకాల్లో మదుపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ 2020లో తీసుకొచ్చిన కొత్త ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z