Business

మన్మోహన్ పెట్టుబడులు అన్నీ FDల్లోనే-BusinessNews-Dec 27 2024

మన్మోహన్ పెట్టుబడులు అన్నీ FDల్లోనే-BusinessNews-Dec 27 2024

* యూపీఐ చెల్లింపుల విధానంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక మార్పులు చేసింది. ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్‌ పార్టీ మొబైల్‌ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు (సెండ్‌/ రిసీవ్‌) చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్‌ ఇకపై థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా పేమెంట్లు చేసుకోవచ్చని పేర్కొంది. సాధారణంగా ప్రీపెయిడ్‌ చెల్లింపు సాధనాల్లో (పీపీఐ) ముందుగానే మనం కొంత డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వాలెట్లు, లేదా ప్రీ పెయిడ్‌ కార్డులుగా చెప్పొచ్చు. వీటి ద్వారా యూపీఐ, ఆన్‌లైన్‌ లావాదేవీలకు చెల్లింపులు చేయొచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా ఖర్చు చేయొచ్చు. ఇప్పటివరకూ పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఇక నుంచి ఈ పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ను అనుసంధానం చేసి, చెల్లింపులు చేయొచ్చు.

* డాలరుతో రూపాయి మారక విలువ శుక్రవారం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు రెండేళ్ల జీవితకాల ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి రూ. 85.80కి చేరుకుంది. తర్వాత సెంట్రల్ బ్యాంక్ గట్టి ప్రయత్నాలతో కొంత మేర పుంజుకుని రికార్డు స్థాయికి 23 పైసలు దిగువన 85.50 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక ఫార్వర్డ్ కాంట్రాక్ట్‌లలో డాలర్ చెల్లింపులను కొనసాగించడం డాలరు కొరతను పెంచింది. దీంతో నెలాఖరు చెల్లింపుల కోసం దిగుమతిదారుల నుంచి డాలరుకు డిమాండ్‌ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన సెంటిమెంట్ ఉన్నప్పటికీ, విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి పతనమైనట్లు దిగుమతిదారులు చెబుతున్నారు.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ వద్ద రూ.85.31 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి 53 పైసలు పడిపోయి ఇంట్రాడేలో కనిష్ట స్థాయి రూ.85.80కి పడిపోయింది. చివరకు డాలరుతో పోలిస్తే రూ.85.50 (తాత్కాలిక) వద్ద సెషన్‌ను ముగించింది. దాని మునుపటి ముగింపు స్థాయి రూ.85.27 నుండి 23 పైసలు నష్టపోయింది.గత రెండు వారాల్లో రూపాయి దాదాపు ప్రతిరోజూ కొత్త కనిష్ట స్థాయిలను తాకుతోంది. గత రెండు సెషన్లలో 13 పైసలు క్షీణించిన తర్వాత గురువారం డాలర్‌తో పోలిస్తే 12 పైసలు పతనమై 85.27 వద్దకు చేరుకుంది. రూపాయి అంతకుముందు 2023 ఫిబ్రవరి 2న 68 పైసలు పతనమైంది.

* ఫుడ్ డెలివరీ సంస్థగా మొదలైన ‘స్విగ్గీ’ (Swiggy) నేడు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని డెలివరీ చేస్తోంది. అత్యధిక డెలివరీలతో రికార్డ్ బ్రేక్ చేసి.. అర్ధరాత్రి వరకు కూడా కస్టమర్లను సేవలను అందిస్తూనే ఉంది. హైదరాబాద్‌లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంది.జూన్ 2021లో ప్రారంభమైన స్విగ్గీ.. రోజువారీ అవసరాలు, బొమ్మలు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, అలంకరణ సామాగ్రి, పండుగల సమయంలో కావాల్సిన వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ (Fast Delivery) చేస్తున్న వాటిలో పాలు, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలు, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ ‘అమితేష్ ఝా’ అన్నారు.హైదరాబాద్‌ (Hyderabad)లో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకొని డెలివరీ చేసిన ఘనత స్విగ్గీ సొంతం. అంతే కాకూండా.. నగరంలో 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్‌లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్‌లకు స్వీకరించింది.లోదుస్తుల కోసం 18,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్‌లను స్విగ్గీ స్వీకరించింది. 2024లో 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది. ప్రజలు ఆర్డర్ చేసిన మ్యాగీ ప్యాకెట్‌లను ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 25 కిలోమీటర్ల ఎత్తు అవుతుందని సమాచారం. మొత్తం మీదీ అదీ.. ఇదీ అని తేడా లేకుండా ప్రజలకు అవసరమైన వస్తువులను డెలివరీ చేసి అందరికీ అందుబాటులో ఉంది.

* ఐపీఓల పర్వం కొనసాగుతున్న తరుణంలో కొత్తగా మరికొన్ని కంపెనీలు నిధులు సమీకరణకు పూనుకుంటున్నాయి. ఇండిక్యూబ్ స్పేసెస్ లిమిటెడ్ అనే వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.850 కోట్లు నిధులు సమీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ముసాయిదా పత్రాలను(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్-DRHP)దాఖలు చేసింది. ఇందుకు సెబీ(SEBI) అనుమతిస్తే ఐపీఓకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు, మరో రూ.100 కోట్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇలా వచ్చిన నిధులను మూలధన వ్యయాలకు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. కొత్త కేంద్రాల ఏర్పాటుకు రూ.462.6 కోట్లు, రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) యూజర్లకు షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల (Data Vouchers) వ్యాలిడిటీని కుదించింది. జియో వెబ్‌సైట్‌లో ప్లాన్లను పరిశీలిస్తే ఇప్పటికే కొత్త కాలపరిమితులు అమల్లోకి వచ్చాయని స్పష్టమవుతోంది. రోజువారీ డేటా అయిపోయినప్పుడు, అదనపు డేటా అవసరమైనప్పుడు ఇంటర్నెట్‌ సేవలు పొందేందుకు ప్రత్యేక డేటా ప్యాక్‌లను అందిస్తోంది. రూ.19 ప్లాన్‌తో 1జీబీ డేటా, రూ.29 ప్లాన్‌తో 2జీబీ డేటా ఇస్తోంది. ప్రస్తుత ప్లాన్‌ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్‌ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితం చేసింది. రూ.29 ప్లాన్‌కు గడువును రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో రూ.11తో మరో డేటా ప్యాక్‌ను అందిస్తోంది. కేవలం ఒక గంట వ్యవధి కలిగిన ఈ ప్యాక్‌తో అపరిమిత డేటా పొందొచ్చు.

* దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. లావా యువ 2 (Lava Yuva 2 5G) పేరిట అందుబాటులోకి తెచ్చింది. మార్బుల్‌ ఫినిష్‌తో యువతకు ఆకట్టుకొనేలా తీసుకొచ్చింది. కేవలం ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.9,499 గా కంపెనీ నిర్ణయించింది. మార్బుల్‌ బ్లాక్‌, మార్బుల్‌ వైట్‌ రంగుల్లో లభిస్తుంది. లావా రిటైల్‌ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. లావా కొత్త ఫోన్‌.. 6.67 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 700నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 90Hz రీఫ్రెష్‌ రేటుతో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారంగా పనిచేస్తుంది. UNISOC T760 ప్రాసెసర్‌ అమర్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ సెన్సర్‌ ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందు వైపు 8ఎంపీ కెమెరా అమర్చారు. నోటిఫికేషన్‌ వస్తే కెమెరా చుట్టూ ఉన్న లైట్‌ బ్లింక్‌ అవుతుంది. 5000mAh బ్యాటరీ, 18W వైర్డ్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో తీసుకొచ్చారు. డ్యూయల్‌ సిమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్‌, బ్లూటూత్‌ 5.2, యూఎస్‌బీ టైప్‌- సి పోర్ట్‌ ఉన్నాయి. ఏడాదిలోపు ఫోన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే సర్వీస్‌ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేకుండా నేరుగా ఇంటికే వచ్చి సర్వీస్‌ను అందిస్తారు.

* ‘స్టాక్‌మార్కెట్‌ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’.. ఇదీ 1992లో ఆర్థికమంత్రిగా ఉన్న వేళ పార్లమెంట్‌లో మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) చేసిన వ్యాఖ్య. ఆయన నిజ జీవితంలో కూడా ఎటువంటి సాహసాలకు పోకుండా తాను జీవితంలో సంపాదించిన మొత్తాన్ని దాచుకొన్నారు. 2019 నాటికి మన్మోహన్ సింగ్‌- గురుశరణ్‌ కౌర్‌ దంపతుల ఆస్తి రూ.15 కోట్లు. ఈవిషయాన్ని ఆయన రాజస్థాన్‌ నుంచి దాఖలు చేసిన ఎన్నికల ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. ఆయన 33 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు రాజ్యసభకు కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు. సింగ్‌ దంపతులకు దిల్లీలోని వసంత్‌ కుంజ్‌, ఛండీగడ్‌లోని సెక్టార్‌ 11బీలో రెండు ఇళ్లున్నాయి. కౌర్‌ వద్ద సుమారు 150 గ్రాముల బంగారం ఉందని అందులో పేర్కొన్నారు. వీటిల్లో అన్నికంటే ఆసక్తికరమైంది ఇన్వెస్ట్‌మెంట్లు. ఆర్థికవేత్త అయిన ఆయన డబ్బును ఎక్కడ మదుపు చేశారని చూస్తే.. సంప్రదాయ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లని సమాధానం వస్తుంది. రూ.7 కోట్లను బ్యాంకుల్లో దాచిపెట్టుకోగా.. మరో 12 లక్షలను ఆయన పోస్టాఫీస్‌ జాతీయ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టారు. ఇక 2013లో అస్సాం నుంచి ఫైల్‌ చేసిన ప్రమాణపత్రంలో కూడా ఎఫ్‌డీలే అత్యధికంగా ఉన్నాయి. నాడు ఆయన ఆస్తులు మొత్తం రూ.11 కోట్లు కాగా.. రూ.లక్ష నుంచి రూ.95 లక్షల రేంజ్‌లో ఎనిమిది ఎఫ్‌డీలు ఉన్నాయి. వీటి విలువ రూ.4 కోట్లు. ఇక పోస్టాఫీస్‌లో నాడు రూ.4 లక్షలు ఉన్నాయి. ఈ ఆస్తులే 2019 నాటికి రూ.15 కోట్లకు చేరాయి. మన్మోహన్‌ చాలా క్రమశిక్షణగా తన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ప్లాన్‌ చేశారు. ఉదాహరణకు ఆయన రూ.2 కోట్లు విలువైన మూడు ఎఫ్‌డీలను 2013లో వేశారు. అవి 2016 ఫిబ్రవరిలో మెచ్యూర్‌ కాగా.. వాటిని రీఇన్వెస్ట్‌ చేశారు. ఆ రకంగా ఆయన మార్కెట్‌ జోలికివెళ్లకుండా.. సంపదను కేవలం 6 ఏళ్లలో రూ.4 కోట్లకు చేర్చారు. మన్మోహన్‌ 1991లో ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టేనాటికి సెన్సెక్స్‌ 999 పాయింట్లు మాత్రమే ఉంది. ఇక 2004-05లో ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి సెన్సెక్స్‌ 6,954కు చేరింది. ఆ తర్వాత 2014-15లో పీఎం పదవీ బాధ్యతల నుంచి దిగే సమయానికి దాదాపు 25 వేల మార్కు వద్దకు చేరింది. ‘మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మధ్యతరగతి వర్గానికి హీరో’ అని ఈ ఏడాది మొదట్లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత ఖర్గే వ్యాఖ్యానించారు. నిజమే.. ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్‌ సింగ్‌ స్వయంగా తన ఆదాయాన్ని ఇన్వెస్ట్‌ చేసే విషయంలో రిస్క్‌ చేయకుండా మధ్యతరగతి వర్గంలానే ఆలోచించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z