Kids

CA ఫలితాల్లో అదరగొట్టిన తెలుగు విద్యార్థులు-NewsRoundup-Dec 27 2024

CA ఫలితాల్లో అదరగొట్టిన తెలుగు విద్యార్థులు-NewsRoundup-Dec 27 2024

* మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) మృతి పట్ల కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివేకానికి, వినయానికి ప్రతిరూపమైన ఓ గొప్ప నాయకుడిని, మార్గనిర్దేశకుడిని పార్టీ కోల్పోయిందన్నారు. ఆయన దూరదృష్టితో దేశంలోని లక్షలాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు విరిశాయన్నారు. గొప్ప రాజీనీతిజ్ఞుడిగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందారని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్‌ సింగ్‌ వ్యక్తిగతంగా సౌమ్యుడే అయినప్పటికీ.. విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో దృఢ నిశ్చయంతో ఉండేవారని తెలిపారు. ఆయన లేని లోటు పార్టీకి, దేశానికి పూడ్చలేనిదని, వ్యక్తిగతంగా తాను ఓ స్నేహితుడిని, తత్వవేత్తను, మార్గదర్శకుడిని కోల్పోయానని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

* రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందిన ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ఆకాన్ష్‌, రఘుబాబు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్‌ వెళ్తుండగా.. మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్‌లోని పర్వత్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో బుల్లెట్‌ బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్టు మాదాపూర్‌ పోలీసులు తెలిపారు. బైక్‌ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

* భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) మరణం పట్ల ప్రపంచ దేశాధినేతలు సైతం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకొంటున్నారు. ఈ క్రమంలోనే మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం.. మన్మోహన్‌ సింగ్‌తో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనలోని గొప్ప మానవీయ కోణం, దయా గుణాన్ని వివరిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఓ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు తన పిల్లలకు మన్మోహన్‌ సింగ్‌ స్కాలర్‌షిప్‌లు ఆఫర్‌ చేశారని గుర్తు చేసుకున్నారు.

* వైకాపా నేత ఏఎండీ ఇంతియాజ్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. ‘‘పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద విరమణ (వీఆర్‌ఎస్‌) చేసి రాజకీయాల్లోకి వచ్చా. కర్నూలు నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయా. నా బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటాను.. ప్రజా సేవకు కాదు. ఒక రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా మెరుగైన సమాజం కోసం నా వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పటివరకు నాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కర్నూలు నగరవాసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

* హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్‌ అత్యవసర విభాగం వద్ద సిబ్బంది ఆందోళనకు దిగారు. నిమ్స్ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ.. సిబ్బంది ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఓ రోగి .. ఎంఆర్‌ఐ స్కానింగ్ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఈ క్రమంలో స్కానింగ్ పూర్తయిన తర్వాత చూడగా… రోగి బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో అతను.. విధుల్లో ఉన్న వర్కర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా నిమ్స్‌ వర్కర్‌ను పంజాగుట్ట పోలీసులు కొట్టారని ఇతర సిబ్బంది ఆరోపించారు. చివరకు ఆ బంగారు గొలుసు రోగి వద్దే లభించింది. దీంతో పూర్తిగా నిర్ధరణకు రాకుండానే దొంగతనం పేరుతో వర్కర్‌ను పోలీసులు కొట్టారని అత్యవసర విభాగం వద్ద సిబ్బంది నిరసనకు దిగారు.

* వచ్చే ఏడాది (2025 సంవత్సరం)లో మొత్తం నాలుగు గ్రహణాలు (Eclipses) సంభవించనున్నాయి. ఇందులో రెండు చంద్ర గ్రహణాలు కాగా.. రెండు సూర్య గ్రహణాలు. వీటిలో ఒకటి మాత్రమే భారత్‌లో కన్పించనున్నట్లు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్ర ప్రకాశ్‌ గుప్తా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 14న సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించనుంది. అయితే.. అది పగటిపూట ఏర్పడడం వల్ల మన దేశంలో కనిపించే అవకాశం లేదని పేర్కొన్నారు. అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాల వద్ద ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని ప్రకాశ్‌ గుప్తా తెలిపారు. మార్చి 29న పాక్షిక సూర్య గ్రహణం వస్తుందని.. దాని ప్రభావం భారత్‌లో ఉండబోదని చెప్పారు. ఉత్తర అమెరికా, యూరప్, వాయువ్య రష్యాలో ఈ గ్రహణం కనిపిస్తుందన్నారు.

* మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh)కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అస్సాంలోని గువాహటిలో 1991లో డబుల్ బెడ్‌రూం ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన.. 2019 వరకు దానిని కొనసాగించారు. పలు దఫాలుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఆయన ఇంటి అడ్రెస్ ఆ అద్దె ఇల్లే. మధ్యలో పీఎం అయినా.. రెంట్ మాత్రం ఠంచన్‌గా చెల్లించేవారు.

* 1991లో పీవీ నరసింహారావు (P V Narasimha Rao) ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం దివాలా అంచున ఉంది. రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. సోవియట్‌ యూనియన్‌ పతనంతో కేవలం భారత్‌ మాత్రమే కాదు.. యావత్‌ ప్రపంచం సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న సమయమది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ హోదాలో నెదర్లాండ్స్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు వెళ్లిన మన్మోహన్‌సింగ్‌.. పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు. ఇంట్లో నిద్రిస్తుండగా.. ప్రధాని ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న పీసీ అలెక్జాండర్‌ నుంచి అర్ధరాత్రి సమయంలో ఊహించని ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన్ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు దాని సారాంశం. పనులన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ క్రెడిట్ అందరూ తీసుకుంటారని, లేదంటే పదవి నుంచి తొలగిస్తారని నవ్వుతూ చెప్పారు అలెక్జాండర్. బిత్తరపోయిన మన్మోహన్‌ కాసేపు తనని తాను నమ్మలేకపోయారట. ‘‘ నేను ఆర్థిక మంత్రిగా పని చేయడమేంటి?’’ అని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె దమన్‌ సింగ్‌ రాసిన ‘స్ట్రిక్ట్‌లీ పర్సనల్‌: మన్మోహన్‌ అండ్‌ గురుశరణ్‌’ పుస్తకంలో ప్రస్తావించారు. 1991, జూన్‌ 21న రాష్ట్రపతిభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మోహన్‌ సింగ్‌ ఆర్థికశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్కరణల దిశగా అడుగులు వేశారు. ఆర్థిక వ్యవస్థను సరళతరం చేయడం ద్వారా సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని పీవీ నరసింహారావు కొన్నిసార్లు సందేహం వ్యక్తం చేసేవారని, ఆయన్ని ఒప్పించి మన్మోహన్‌ ముందుకెళ్లేవారని ఆ పుస్తకంలో దమన్‌ సింగ్‌ ప్రస్తావించారు. మన్మోహన్‌ చాలా పరిశ్రమలకు లైసెన్స్‌ నియంత్రణల నుంచి విముక్తి కల్పించారు. గుత్తాధిపత్యం, నిర్బంధ వ్యాపార విధానానికి సంబంధించిన చట్టాలను సవరించారు. కొత్త పన్నుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించారు. దమన్‌ సింగ్‌ రాసిన పుస్తకంలో మన్మోహన్‌ సింగ్‌, ఆయన భార్య గురుశరణ్‌ కౌర్‌ వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయాలు ప్రస్తావించారు. తల్లిదండ్రులతో చేసిన సంభాషణలు, గ్రంథాలయాల్లో సేకరించిన సమాచారంతో దమన్‌ సింగ్‌.. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

* స్నేహితులు కలిస్తేనో, ఇంట్లో వంట చేసుకోని సందర్భాల్లోనో మీరు ఎక్కువగా ఆర్డర్‌ చేసే ఫుడ్‌ ఏదని అడిగితే.. అందరూ ఠక్కున చెప్పేది బిర్యానీ (Biryani). మనమే కాదు.. దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో (Zomato report) వెలువరించిన వార్షిక నివేదికలోనూ ఇదే తేలింది. ఈ ఏడాది తమ వేదికగా డెలివరీ అయిన ఫుడ్‌ డెలివరీల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది. ఈమేరకు 2024 ఏడాదికి సంబంధించి ఇయర్‌ ఎండ్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ ఐటెమ్స్‌, డైనింగ్‌ ట్రెండ్స్‌ను ప్రస్తావించింది. జొమాటోలో (Zomato) వరుసగా తొమ్మిదో ఏడాదీ బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంటే సగటున సెకనుకు మూడు బిర్యానీలు చొప్పున డెలివరీ చేసినట్లు తన నివేదికలో తెలిపింది. మరో ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీలోనూ బిర్యానీనే టాప్‌గా నిలవడం బట్టి.. బిర్యానీకున్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. బిర్యానీ తర్వాత అత్యధిక డెలివరీలు అయిన ఫుడ్‌ ఐటెమ్‌గా పిజ్జా నిలిచింది. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో వేదికగా 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసినట్లు తెలిపింది.

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ICAI) సీఏ తుది పరీక్షల ఫలితాల్లో (CA Final Exams Results) తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్‌, తిరుపతికి చెందిన విద్యార్థులిద్దరూ ఒకటో ర్యాంకుతో మెరిశారు. నవంబర్‌లో జరిగిన సీఏ తుది పరీక్షల ఫలితాలను ICAI గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఎంటర్‌ చేయడం ద్వారా స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

* మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) కేవలం ఆర్థికవేత్తే కాదు.. హాకీ ప్రియుడు కూడా. దీనికి పాక్‌ జాతిపిత జిన్నానే సాక్ష్యం. ఈవిషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా మన్మోహనే (Manmohan Singh) చెప్పారు. ఒకప్పుడు భారత్‌లో క్రికెట్‌ కంటే హాకీ అంటేనే క్రేజ్‌ ఎక్కువ. అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌లో మన్మోహన్‌ సింగ్‌ జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. 1945లో ఆయనకు 13 ఏళ్లు. ఓ రోజు లాహోర్‌ జూనియర్‌ కాలేజీ గ్రౌండ్‌లో మన్మోహన్‌ తన మిత్రులతో కలిసి హాకీ ఆడుతున్నారు. ఆ గ్రౌండ్‌ పక్కనే ఓ పెద్దాయన వీరి ఆటను వీక్షిస్తున్నారు. ఇంతలో మన్మోహన్‌ గోల్‌ పోస్టులోకి కొట్టిన బంతి నేరుగా వెళ్లి ఆ పెద్దాయన తలను తాకింది. ఏం జరిగిందో కొద్దిసేపు ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు. ముస్లిం లీగ్‌ అగ్రనేత మహమ్మద్‌ అలీజిన్నా. కళాశాల పొరుగునే ఆయన ఇల్లు ఉంది. ఆడుతోంది చిన్న పిల్లలు కావడంతో జిన్నా కూడా నవ్వి ఊరుకొన్నారు.

* వైకాపా నేత ఏఎండీ ఇంతియాజ్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపారు. ‘‘పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద విరమణ (వీఆర్‌ఎస్‌) చేసి రాజకీయాల్లోకి వచ్చా. కర్నూలు నియోజకవర్గం నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయా. నా బంధువులు, శ్రేయోభిలాషులతో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటాను.. ప్రజా సేవకు కాదు. ఒక రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిగా, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా మెరుగైన సమాజం కోసం నా వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పటివరకు నాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా కర్నూలు నగరవాసులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా పని చేసే స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నా’’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

* మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పేర్ని నాని తన సతీమణి పేరుతో పౌరసరఫరాల సంస్థకు మచిలీపట్నంలో గోదాము అద్దెకిచ్చారు. ఇందులో నిల్వ ఉంచిన 3,708 బస్తాల రేషన్‌ బియ్యం మాయమవడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయసుధతో పాటు గోదాము మేనేజర్‌ మానస్‌ తేజపై మచిలీపట్నం తాలూకా స్టేషన్‌లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు జయసుధ మచిలీపట్నం 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా లంకే వెంకటేశ్వరరావు వ్యవహరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 30న బెయిల్‌ పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

* తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో లోన్‌ డబ్బులు కట్టాలని యువతిని వేధింపులకు గురి చేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వివరించారు. సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె ఫినబుల్‌ యాప్‌లో లోన్‌ తీసుకున్నట్టు తెలిపింది. సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో తన ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు బెదిరించారు. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్‌ చేసి డబ్బులు కట్టలేదని దూషించారు. అంతటితో ఆగకుండా ఆమె సోదరుడికి కొన్ని న్యూడ్‌ ఫొటోలు కూడా పంపించారు. ఏజెంట్ల వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాలు తీసుకొనే సమయంలో జాగ్రత్త అవసరమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫినబుల్ లోన్ యాప్‌పై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశామన్నారు.

* మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సురేశ్‌ అన్నారు. వాజ్‌పేయీ ప్రభుత్వం అమలు చేసిన విదేశాంగ విధానాన్ని ఆయన కొనసాగించారని చెప్పారు. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో రష్యాలోని ఇండియన్‌ ఎంబసీలో పనిచేసినట్లు సురేశ్‌ తెలిపారు. అనువాదకుడిగా ఆయన్ను చాలా దగ్గరగా చూశానన్నారు. ‘‘మన్మోహన్‌ గొప్ప ఆర్థికవేత్త. వివిధ దేశాల ప్రధానులతో జరిగిన సమావేశాల్లో ఆయనకు అనువాదకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ఆయన్ను చాలా దగ్గరగా చూశా. ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మన్మోహన్‌ హయాంలో అమెరికాతో జరిగిన అణు ఒప్పందం ఎంతో కీలకమైంది. ఆ అంశంలో ఎన్నో విమర్శలు వచ్చినా ముందుకెళ్లారు. రష్యా, ఇతర దేశాలతో భారత్‌ బంధం పటిష్ఠం అయ్యేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. మన్మోహన్‌కు అనువాదకుడిగా పనిచేసిన సమయంలో ఓ రోజు ఆయన నా వద్దకు వచ్చి ప్రశంసించారు. బాగా అనువాదం చేశారని మెచ్చుకున్నారు. మరింత స్ఫూర్తితో పనిచేసేందుకు అది దోహదపడింది’’ అని సురేశ్‌ గుర్తుచేసుకున్నారు.

* గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా లేని పరిస్ధితి ఉందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారని.. కొందర్ని తొలగించారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ కాదు.. సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. భుజాలపై మోసే సొంత మీడియా ఉండడమే చంద్రబాబు అదృష్టం. పేరులో ఉచితం తప్పా..ఉచిత ఇసుక ఎక్కడా?. చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరూ మినహయింపు కాదు. బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు’’ అని కన్నబాబు దుయ్యబట్టారు. ‘‘ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్సార్‌సీపీ పోరుబాట దిగ్విజయంగా జరిగింది. విద్యుత్ భారం, మూడు డిమాండ్లను అధికారులకు వినతిపత్రం ద్వారా అందించాం. ఒక్క నెలలోనే ఆరు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎంత కాలం జగన్ నామ స్మరణం చేస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పచ్చి అబద్దాలను కూటమి ప్రభుత్వం మానిఫెస్టోలో పెట్టింది. చంద్రబాబు సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసిన ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ పోరు ఆపదు.’’ అని కన్నబాబు స్పష్టం చేశారు.

* జర్మనీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఆ దేశ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. “ముఖ్యంగా కష్ట సమయాల్లో జర్మనీకి ముందస్తు ఎన్నికలు సరైన మార్గమని స్టెయిన్‌మీర్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఛాన్సలర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ విశ్వాస పరీక్షలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటును రద్దు చేసి, ఫిబ్రవరి 23న ఎన్నికలు జరపడానికి నిర్ణయించారు. అయితే, అనుకున్న సమయం కన్నా ఏడు నెలల ముందుగానే ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. జర్మనీ చాన్సెలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ డిసెంబర్‌ 16న పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలు కావడంతో యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీసింది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్‌ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టగా, మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. కాగా, ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్‌ ‘సోషల్‌ డెమోక్రాట్‌’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్‌ బ్లాక్‌ ముందంజలో ఉందంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z