Editorials

అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు-NewsRoundup-Dec 28 2024

అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు-NewsRoundup-Dec 28 2024

* టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1 నుంచి రూ.లక్షలోపు విరాళం ఇవ్వదలచిన భక్తుల కోసం పలు చోట్ల నెలకొల్పిన కియోస్క్‌ మిషన్ల (Kiosk Missions) ద్వారా 50 రోజుల్లో రూ. 55 లక్షల విరాళం (Donations) వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయాల్లో టీటీడీ ఈ మిషన్లు ఏర్పాటు చేసింది. పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో శనివారం ఈ కియోస్క్ మిషన్ ను టీటీడీ (TTD) అడిషనల్‌ ఈవో ప్రారంభించారు. మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నట్లు వెల్లడించారు.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప‌ర‌మర్శించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నాడు. కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని మాటిచ్చాడు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. అయితే పవ‌న్ మీడియాతో సీరియ‌స్‌గా మాట్లాడుతుండ‌గా.. అత‌ని అభిమానులు చేసిన ప‌నికి అస‌హానం వ్య‌క్తం చేశాడు.

* ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టంచేశారు. గత కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఏడాది సైబర్ క్రైమ్‌కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు తస్కరించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టడంపై ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని, ఆయా కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ తరహాలో సైబర్ షీట్ తెరుస్తామని చెప్పారు. మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో 1 లక్ష సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈగల్’ వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని చెప్పారు.

* ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లపై అవగాహన కల్పించామని.. త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్‌ (Hydra Police Station) ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath) వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చెరువులు, కుంటలను కబ్జాల నుంచి కాపాడుతున్నామన్నారు. శాటిలైట్‌ చిత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నాం. ఇప్పటివరకు 5,023 ఫిర్యాదులు మాకు అందాయి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తాం’’ అని రంగనాథ్‌ చెప్పారు. ‘‘300 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నాం. చెరువుల పునరుద్ధరణకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. హైడ్రా కూల్చివేతలు(Hydra demolitions) ఆగవు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందన్న రంగనాథ్.. ఎఫ్‌టిఎల్‌ గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయన్నారు. హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. హైడ్రా నోటీసులు ఇవ్వదు. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కమిషనర్‌ స్పష్టం చేశారు.

* టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి వ్యతిరేకంగా నెల్లూరు(Nellore)జిల్లా మైనింగ్ కంపెనీల యజమానులు సమావేశమయ్యారు. జిల్లాలో క్వార్జ్ మైనింగ్‌ వివాదం రోజురోజుకు ముదురుతోంది. సైదాపురంలో ఉన్న తెల్లరాయి తవ్వకం,రవాణాకు అనుమతులు దక్కించుకుని వందల కోట్ల మైనింగ్‌ను ఎంపీ వేమమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakarreddy) తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తాను చెప్పిన ధరకే క్వార్ట్జ్‌ అమ్మాలంటూ గనుల యజమానులపై వేమిరెడ్డి ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గూడూరులోని ఓ హోటల్లో గనుల యజమానులు రహస్య సమావేశం నిర్వహించారు. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు మైనింగ్‌ యజమానులు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

* టికెట్‌ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరకు వెళ్లి దేహి అని అడుక్కోవడం సరికాదంటున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj). మొన్న జరిగింది ఇండస్ట్రీ సమావేశం కాదని, వ్యక్తిగతంగా కొందరు ప్రభుత్వాన్ని కలిశారని తెలిపాడు. కాగా సంధ్య థియేటర్‌ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుగు సినీ ప్రముఖులతో గురువారం (డిసెంబర్‌ 26న) సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌ గురించి తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘ఇది ప్రభుత్వం పిలిచి మరీ ఏర్పాటు చేసిన మీటింగ్‌ కాదనుకుంటున్నాను. ఆ మీటింగ్‌కు నాకు ఆహ్వానం అందలేదు. ఇండస్ట్రీ అంటే ఛాంబర్‌ ఒక్కటే.. అన్ని సెక్టార్లు కలిపితేనే ఇండస్ట్రీ. అవన్నీ ఛాంబర్‌ కిందే ఉంటాయి. అది ఛాంబర్‌ సమావేశం కాదని తెలిసింది. టీఎఫ్‌డీసీ (Telangana Film Development Corporation) చైర్మన్‌ దిల్‌రాజును పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. సినిమాలు తీసే నిర్మాతలు వాటి పరిష్కారం కోసం వెళ్లారు. బెనిఫిట్‌ షోలు వద్దని ముందే చెప్పా.. ఇప్పటికైతే పుష్ప 2తో ఏర్పడిన గ్యాప్‌ పోయింది. అల్లు అర్జున్‌ సమస్య సద్దుమణిగిపోయింది. టాలీవుడ్‌ ఇప్పటికే ప్రపంచరికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మన దగ్గర అన్ని భాషల సినిమా షూటింగ్స్‌ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్స్‌ ఇక్కడ పెట్టాలంటే హైదరాబాద్‌లో ఆఫీస్‌లు ఉండాలి. ఇకపోతే అల్లు అర్జున్‌, సుకుమార్‌ గతంలో మంచి సందేశాన్నిచ్చే షార్ట్‌ ఫిలిం చేశారు. ఎన్టీఆర్‌, చిరంజీవిగారు కూడా చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతుండాలి. కేవలం మూవీ రిలీజప్పుడే కాకుండా అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చాడు.

* భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh)మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నప్పుడు .. తమ కుటుంబం పట్ల ఆయనకున్న విశాల హృదయం, దయ గుర్తుకు వచ్చిందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. ‘‘2004 అలిపిరి బాంబు దాడి నుంచి చంద్రబాబు కోలుకున్నాక.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ క్లిష్ట సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు భద్రత తగ్గించే ప్రయత్నం చేసింది. మా పార్టీ నేతలు ఈ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చంద్రబాబుకు పూర్తి భద్రత పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. నాటి రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి వ్యతిరేకంగా ఎన్‌ఎస్‌జీ కమాండోలతో పూర్తి భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చారు. మన్మోహన్‌ సింగ్‌ అరుదైన రాజనీతిజ్ఞుడు. ఆయన విశాల హృదయానికి మేం రుణపడి ఉంటాం’’ అని లోకేశ్‌ గుర్తు చేసుకున్నారు.

* బాలీవుడ్‌ జంట బిపాసా బసు, ఆమె భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సింగర్‌ మికా సింగ్‌ (Mika Singh). వారితో వర్క్‌ చేయడం తనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చిందని ఆయన వాపోయారు. వారు తన డబ్బును వృథా చేశారని ఆరోపించారు. వాళ్ల ప్రవర్తన వల్ల.. తాను మళ్లీ సినిమా, సిరీస్‌ నిర్మాణంలోకి రాకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ‘‘ఎన్నో విధాలుగా ఆలోచించి నేను నిర్మించిన ఏకైక ప్రాజెక్ట్‌ ‘డేంజరస్‌’. ప్రముఖ దర్శకుడు విక్రమ్‌ భట్‌ దీనికి కథ అందించారు. క్యాస్టింగ్‌ విషయంలోనూ పలు ఆలోచనలు చేశా. కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ అయితే కథకు సెట్‌ అవుతారనిపించింది. ఆయనకు జంటగా నూతన నటిని ఎంచుకుంటే బడ్జెట్‌ పరిధి దాటదనుకున్నా. అలాంటి సమయంలో బిపాసా బసు మా టీమ్‌లోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గా తాను యాక్ట్‌ చేస్తానని అన్నారు. ఆమె ఇష్టాన్ని కాదనలేక ఓకే చెప్పా. ఆ తర్వాత ఈ జంట నాకు ఎన్నో సమస్యలు సృష్టించారు. మూడు నెలల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్‌ను ఆరు నెలలు సాగ దీశారు.

* శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Jishnu Dev Varma) సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సందర్శించి మాట్లాడారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z