* గృహ వినియోగ, వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు జనవరి ఒకటో తేదీ నుంచి పెరుగనున్నాయి. ఇటీవలి కాలంలో 14 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలు హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. గృహ వినియోగ, కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్) ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏటీఎఫ్ ధరలకు అనుగుణంగా విమాన టికెట్ల ధరలూ పెరుగుతాయి.
* ఉద్యోగు భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పెన్షనర్లు జనవరి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఈపీఎఫ్ఓ కొత్త నిబంధన తెచ్చింది. దీనివల్ల పెన్షనర్లకు పెన్షన్ విత్ డ్రా మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందుకోసం అదనపు ధృవీకరణ అవసరమే లేదు. దీనివల్ల పెన్షనర్ల పెన్షన్ విత్ డ్రాయల్ ప్రక్రియ తేలికవుతుంది.
* స్మార్ట్ ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ చెల్లింపుల విధానం అమల్లోకి తెచ్చింది ఆర్బీఐ. ఈ ఫీచర్ ఫోన్ల ద్వారా రోజూ రూ.5,000 నుంచి రూ.10 వేల వరకూ పేమెంట్స్ చేయొచ్చు. 2025 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నది. అలాగే ఫీచర్ ఫోన్ల నుంచి ఆన్ లైన్ చెల్లింపులు కూడా చేయొచ్చు.
* వ్యవసాయ రంగానికి మద్దతుగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎటువంటి గ్యారంటీ లేకుండా రైతులు ఎకరం భూమిపై రూ.2 లక్షల వరకూ రుణం తీసుకోవచ్చు. ఇంతకు ముందు ఎకరానికి రూ.1.6 లక్షల పరిమితి మాత్రమే ఉండేది. వ్యవసాయ కార్యకలాపాలు, దిగుబడి పెంపు, మెరుగైన జీవన విధానం కోసం ఈ రుణాలు వాడొచ్చు.
* జనవరి ఒకటో తేదీ నుంచి జీఎస్టీ పోర్టల్ యాక్సెస్ చేయడానికి వ్యాపారులు మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ (ఎంఎఫ్ఏ) విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఓటీపీ వంటి అదనపు ధృవీకరణ చర్యల కోసం ఈ సెక్యూరిటీ లేయర్ తీసుకొచ్చారు. చివరి 180 రోజులకు మాత్రమే ఇక నుంచి ఈ-వే బిల్లులకు సంబంధించిన డాక్యుమెంట్లు జనరేట్ అవుతాయి. కనుక కంపెనీలు, వ్యాపాులు తమ కాంటాక్ట్ వివరాలు అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మల్టీ ఫ్యాక్టర్ అథంటికేషన్ కోసం తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.
* సెన్సెక్స్, సెన్సెక్స్-50, బ్యాంకెక్స్ ఎక్స్ పైరీ తేదీల్లో ప్రధాన మార్పు రానున్నది. సంప్రదాయంగా ఈ ఇండెక్సులు శుక్రవారాల్లో ఎక్స్ పైరీ అవుతాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మంగళవారాల్లోనే ఎక్స్ పైరీ అవుతాయి. దీనికి తోడు త్రైమాసికం, అర్థ సంవత్సర కాంట్రాక్టులు తదుపరి నెల చివరి మంగళవారం ఎక్స్ పైరీ అవుతాయి. ఇక నిఫ్టీ-50లో మంత్లీ కాంట్రాక్ట్స్ గురువారం ఎక్స్ పైరీ అవుతాయి.
* గతంతో పోలిస్తే రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. సొంతిండ్లకు, గోదాములకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతన్నది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో సంస్థాగత పెట్టుబడులు క్రమంగా పుంజుకుంటున్నాయి. 2023తో పోలిస్తే దేశీయ రియాల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 51 శాతం వృద్ధి చెందాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2023లో రియాల్టీ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు 5.878 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే, ఈ ఏడాది 8.878 బిలియన్ డాలర్లకు పెరిగింది.
* కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా స్పేసియస్‌గా ఉండే ఎస్ యూవీ కార్లతోపాటు లగ్జరీ కార్ల పైనా మోజు పారేసుకుంటున్నారు. 2024లో ప్రతి గంటకు ఆరు రూ.50 లక్షలపై చిలుకు ధర గల లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. ఐదేండ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లు మాత్రమే అమ్ముడయ్యేవి. సంపన్న వినియోగదారుల పునాది క్రమంగా పెరుగుతుండటంతో ప్రీమియం కార్లకు గిరాకీ పెరుగుతోంది. లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను గమనించిన కార్ల తయారీ సంస్థలు 2025లో రెండు డజన్లకు పైగా కొత్త మోడల్ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధం చేసుకుంటున్నాయి. బేస్ పెరుగుతున్నా కొద్దీ.. 50 వేల కార్లు అమ్ముడవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
* అట్రిక్షన్లు అనే పదం ఇప్పటి వరకూ ఐటీ, టెక్నాలజీ కంపెనీల్లోనే ఉండేది. ఒక కంపెనీలో పని చేస్తున్న వృత్తి నిపుణుల్లో పలువురు మెరుగైన వేతన ప్యాకేజీ కోసం ఇతర కంపెనీల్లోకి బదిలీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి బ్యాంకులను తాకింది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగులు 25 శాతం అట్రిక్షన్లు కొనసాగుతున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల బ్యాంకుల నిర్వహణకు ముప్పు పొంచి ఉందని ‘2023-24లో భారతీయ బ్యాంకుల్లో ప్రగతి- ధోరణులు’ అనే అంశంపై ఆర్బీఐ నివేదిక పేర్కొంది. సెలెక్టెడ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్‌బీస్)ల్లో ఉద్యోగుల అట్రిక్షన్లు అధికంగా ఉంటాయని తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువ అని వెల్లడించింది. కానీ, గత మూడేండ్లలో ప్రైవేట్ బ్యాంకుల్లో అట్రిక్షన్ రేటు దాదాపు 25 శాతం ఉందని వివరించింది.
* గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.86,847.88 కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ధి పొందాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ -30 గతవారం 657.48 పాయింట్లు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 225.9 పాయింట్ల లాభంతో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ లాభ పడ్డాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) నష్టపోయాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,235.95 కోట్లు పుంజుకుని రూ.13,74,945.30 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎం-క్యాప్ రూ.20,230.9 కోట్ల లాభంతో రూ.16,52,235.07 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.17,933.49 కోట్ల లబ్ధితో రూ.5,99,185.81 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.15,254.01 కోట్ల లాభంతో రూ.9,22,703.05 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11,948.24 కోట్లు పెరిగి రూ.9,10,735.22 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.1,245.29 కోట్లు పుంజుకుని రూ.5,49,863.10 కోట్లకు చేరుకుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z