* సినిమా పాటలు రాస్తూ మన వ్యాసాంగం కుంటు పడకూడదన్న ఉద్దేశంతో అప్పుడప్పుడు నా సంతృప్తికోసం కూడా పాటలు రాస్తుంటా. అంతర్వేది వద్ద గోదావరి సముద్రంలో కలుస్తున్నప్పుడు, కృష్ణానది హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే ప్రాంతాన్ని చూస్తే T ఆకారంలో కనిపిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసినప్పుడు పాట రాయాలనిపించింది. ‘‘ఎన్ని నదులు కలిస్తే.. ఎన్నెన్ని నదులు కలిస్తే ఏ లాభం. కడలిలో ఉప్పదనం కాస్త కూడా తగ్గనప్పుడు. ఎన్ని నదులు కలిస్తే ఏం లాభం. ఎన్నెన్ని గుడులు వెలిస్తే ఏ లాభం’’ అంటూ తాను రాసిన పాటు సభికులకు వినిపించారు. సింగిల్ బెడ్‌రూమ్ కొందామా? డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ కొందామా? అని ఇలా బెడ్ రూమ్‌ల సంఖ్యతో మన స్థాయిని కొలుచుకునే పరిస్థితి వచ్చింది. అంటూ.. ‘‘ఎన్ని గదులు తెరిస్తే ఏం లాభం’’ అంటూ మరో గేయాన్ని ఆలపించారు. అనంత శ్రీరామ్ ఆలపించిన రెండు గేయాలను సభికులను అలరించడంతో పాటు ఆలోచింపజేశాయి.
* భారతీయ సినిమాకి అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కొనియాడడంపై నాగార్జున (Nagarjuna Akkineni) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఐకానిక్ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్ దూరదృష్టి, ఇండియన్ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి’’ అని నాగార్జున పేర్కొన్నారు.
* అల్లు అర్జున్ అభిమానుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంటిపై దాడి చేసినందుకు వెంటనే అల్లు అర్జున్‌కు క్షమాపణ చెప్పాలని అల్లు అర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో వందల కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామని బెదిరిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమానుల నుంచి మాకు ప్రాణహాని ఉంది. మా ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత అల్లు అర్జున్‌దే. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మందితో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తాం. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
* ఓఆర్‌ఆర్ లీజు అంశంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తన మామ, బామ్మర్దిని ఇరికించేందుకే ఓఆర్‌ఆర్ టోల్ లీజ్‌పై సిట్ వేయాలని అడిగారని మంత్రి అన్నారు. హరీశ్‌రావు అసెంబ్లీలో కోరడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి సిట్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా-ఈ కారు రేసింగ్ వ్యవహారంలో దొంగలు దొరికారన్నారు. ‘‘ ఓఆర్‌ఆర్ టోల్‌లీజ్‌లో అవకతవకలు కూడా బయటపడతాయి. ఆర్‌ఆర్‌ఆర్ కోసం దిల్లీలో ఉండి ఎంతో కృషి చేశాను. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టుకు మా కృషి వల్ల ముందడుగు పడింది. ఆర్‌ఆర్‌ఆర్ మంజూరు చేసిన ప్రధానికి కృతజ్ఞతలు. దీనికి సహకరించిన కేంద్రమంత్రి గడ్కరీకి ధన్యవాదాలు’’ అని కోమటిరెడ్డి తెలిపారు.
* భారత భద్రతా వ్యవస్థపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని అన్నారు. బాహ్యంగా, అంతర్గతంగా శత్రువుల కదలికలపై దృష్టి పెట్టాలని సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ భద్రతను పరిగణనలోకి తీసుకుంటే మనం అంత అదృష్టవంతులం కాదు. ఎందుకంటే.. ఉత్తర, పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. అంతేకాకుండా.. అంతర్గతంగానూ భద్రతా పరమైన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ పరిస్థితి పట్ల ఆందోళన లేకుండా నిశ్శబ్దంగా కూర్చోలేం. శత్రువులు కార్యకలాపాలపై మరింత నిఘా అవసరం. వారి కదలికలను గమనిస్తూనే ఉండాలి. అప్పుడే వారి కుట్రను భగ్నం చేయగలం’’ అని రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ సిబ్బందికి సూచించారు.
* అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన ఓ విమానం ఇటీవల కజఖ్‌స్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్లే ఆ విమానం ప్రమాదానికి గురైందని అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ.. ప్రమాద కారణాన్ని దాచేందుకు మాస్కో యత్నించిందని విమర్శించారు. ఈ ఘటనపై రష్యా అధినేత పుతిన్ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజే ఆయన ఈమేరకు స్పందించారు. జరిగిన నేరాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ విమానాన్ని రష్యానే కూల్చేసినట్లు స్పష్టంగా చెప్పొచ్చు. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందని చెప్పడం లేదు. ప్రమాదానికి దారితీసిన కారణాల గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడం ద్వారా.. నిజాన్ని కప్పిపుచ్చేందుకు రష్యా అధికారులు యత్నించారు. ఇది విచారకరం. ఘటనానంతరం మొదటి మూడు రోజులు తప్పుడు వాదనలే చేయడం దురదృష్టకరం’’ అని అలియెవ్ వ్యాఖ్యానించారు. జరిగినదానికి క్షమాపణలు చెప్పి, తప్పును అంగీకరించి, ఈ ఘటనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేసినట్లు అజర్‌బైజాన్ అధికారిక మీడియా తెలిపింది.
* ‘నా దృష్టిలో రామారావు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి, దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు. కానీ ఒక దశలో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆ దరిద్రం వచ్చిన తర్వాతే అంతా మారిపోయింది’ అన్నారు. ‘నాడు ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్లనే. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చారు. వాళ్లు బయటపడటంతోపాటు తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. నేను ఆవిడ గురించి మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. నిజానికి ఆవిడ మీద నాకు మర్యాద లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
* తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆలయాల్లో అందర్నీ సమానంగా చూస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తిరుమలలోనూ అందర్నీ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
* అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు మొత్తం లక్షా 12వేల 750కోట్లు అప్పులు చేశారు.. ఇప్పుడు రాష్ట్రం ఏమవుతుందో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. అలాగే, ఈ అప్పులు ఎవరు కడతారని ప్రశ్నించారు. ఇదే సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి నేతలు అమలు చేయడం లేదని తెలిపారు.
* భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. తెలుగు తేజం కోనేరు హంపి విజయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. హంపీ నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ అభినందనలు తెలిపారు.
* ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిమాలిన హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. డిగ్రీ చదివిన ఆడబిడ్డలకు స్కూటీలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇప్పుడా హామీ సంగతి ఏమైందని ఆమె ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని ఆమె ఫైరయ్యారు. అదేవిధంగా మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కారు అమలు చేయలేదని కవిత ఆరోపించారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు పెన్షన్‌లను కూడా పెంపు చేయలేదని విమర్శించారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.
* రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని అయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే.. బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతదని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో ‘ఈ బువ్వ మేం తినలేం.. మమ్మల్ని తీసుకెళ్లండి’ అని విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని, మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారని హరీష్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటనను మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z