తెలుగు భాష, తెలుగు జాతి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత కవులు, రచయితలపై ఉందని 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల గౌరవాధ్యక్షుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్జిల్లా విజయవాడలో రెండ్రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు.
‘‘చెన్నైలో ఇటీవల ఓ సినీనటి మాట్లాడుతూ.. తమిళనాడుకు తెలుగువారు పరిచారకులు (సేవకులు)గా వచ్చారని చెప్పారు. అది వాస్తవం కాదు. తమిళనాడును మొదట పాలించింది తెలుగువారే… ఆ తర్వాతే తమిళులు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి అత్యధిక సంఖ్యలో ముఖ్యమంత్రిగా పనిచేసింది కూడా తెలుగువారే. శ్రీకృష్ణ దేవరాయలు, రాణి మంగమ్మ, నాయకరాజులు తెలుగులోనే పరిపాలన చేశారు. తమిళనాట తెలుగు ఓ వెలుగు వెలిగింది తప్ప.. దాస్య ప్రవృత్తితో తెలుగువారు అక్కడ లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించేందుకు తమిళులెవరూ ముందుకు రాలేదు. సైమన్ కమిషన్ వస్తే గుండుకు ఎదురుగా గుండె చూపిన వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మాగాంధీ పిలుపునిస్తే.. కాశీనాథుని నాగేశ్వరరావు, ప్రకాశం పంతులు, దుర్గాభాయమ్మ నాయకత్వం వహించారు. మద్రాసు నగరంలో ఏ కార్యక్రమమైనా విజయవంతంగా నడిపించిన ఘనత తెలుగువారిది. మనలో భాషాభిమానం, జాతీయాభిమానం తగ్గింది. ఫలితంగా తమిళనాడులో ఉన్న తెలుగువారు.. తెలుగువారని నమోదు చేసుకోకపోవటంతో రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష నాలుగో స్థానానికి పడిపోయింది. త్వరలో జరగబోయే జనగణనలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి.. తెలుగువారని నమోదు చేసుకోవడం ద్వారా తెలుగు భాషను మళ్లీ రెండో స్థానానికి తీసుకెళ్లాలి. మహాసభలకు విచ్చేసిన కవులు, రచయితలు తెలుగు భాషను, తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లేందుకు యోధులుగా మారాలి’’ అని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z