Devotional

తితిదేలో తెలంగాణా లేఖలకు ఆమోదం-NewsRoundup-Dec 30 2024

తితిదేలో తెలంగాణా లేఖలకు ఆమోదం-NewsRoundup-Dec 30 2024

* ప్రముఖ మ్యూజిక్‌ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌లో సందడి చేశారు బాలీవుడ్‌ అలనాటి నటి సంగీతా బిజ్లానీ (Sangeeta Bijlani). ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌తో పెళ్లి గురించి గతంలో జరిగిన ప్రచారంపై ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె పెదవి విప్పారు. ‘సల్మాన్‌ ఖాన్‌తో నా పెళ్లి జరగాల్సింది. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది నిజమే’ అని కంటెస్టెంట్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

* నటుడు మురళీమోహన్‌ (murali mohan) మనవరాలు రాగ, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, నటుడు శ్రీ సింహా (SriSimha) వివాహం ఇటీవల వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి గురించి మురళీమోహన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పెళ్లి విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ తనకు ఎంతో కాలం నుంచి తెలుసని ఆయన అన్నారు. పెళ్లి విషయంలో మాత్రం పూర్తి నిర్ణయం తన మనవరాలు, శ్రీసింహాదేనని ఆయన తెలిపారు. పెళ్లికి ముందే వారిద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు రాగ తన మనసులో మాట చెప్పిందని మురళీమోహన్‌ వెల్లడించారు.

* రాజకీయాల్లో పని తీరే ప్రామాణికమని, కలిసి పనిచేసిన వారిని గుర్తించాల్సిన బాధ్యత తనకు ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. సోమవారం మంగళగిరిలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. సోదరుడు, జనసేన నాయకుడు అయిన నాగబాబుకు (Naga Babu) మంత్రి పదవి ఇచ్చే విషయమై స్పందించారు.

* ‘‘రేషన్‌ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం.. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?’’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు తిట్టలేదా.. అని నిలదీశారు. మంగళగిరిలో పవన్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

* తమిళనాడులో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందించమని కోరుతూ స్థానిక మీడియా సంస్థ ఫోన్‌ కాల్‌లో ఆమెను సంప్రదించింది. భాజపా ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై విలేకరి ఆమెను ప్రశ్నించాడు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తమిళనాడు భాజపా తనని పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డ్‌ను సదరు మీడియా సంస్థ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. ఆమె అనుమతితోనే దీనిని రిలీజ్‌ చేస్తున్నామని పేర్కొంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ‘‘మరి ఇంత దిగజారుతారని అనుకోలేదు. నా అనుమతి తీసుకోకుండా ఈవిధంగా నా వాయిస్‌ ఎలా రికార్డు చేస్తారు? కానీ, నేను నిజమే చెప్పా. భాజపా కార్యక్రమాల్లో మీరెందుకు కనిపించడం లేదని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారందరికీ ఒక్కటే సమాధానం చెబుతా. ఆయా కార్యక్రమాలకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం ఇవ్వరు. వాటికి నన్ను ఆహ్వానించరు. ఒకవేళ సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో చెబుతారు. కొంతమంది ఊహిస్తున్నట్లు నేను అయితే పార్టీని వీడటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ విజన్‌, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తా’’ అని ఖుష్బూ పేర్కొన్నారు.

* దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని తాత్కాలిక సీఎంగా ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) పేర్కొనడంపై లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తనను బాధించిందన్నారు. ఒక ముఖ్యమంత్రిగా కేవలం ఆతిశీకే (Atishi Marlena) కాదని.. రాష్ట్రపతి ప్రతినిధిగా తనకూ అవమానకరమని అన్నారు. కేజ్రీవాల్‌ చేస్తున్న ప్రకటనలు దిల్లీ ప్రభుత్వ తీరుపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటూ సీఎంకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (VK Saxena) సుదీర్ఘ లేఖ రాశారు. ‘‘కొన్ని రోజుల క్రితం మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ మిమ్మల్ని (ఆతిశీ) తాత్కాలిక ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు. అది నాకు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది మీతో (సీఎం) పాటు మాకు కూడా అవమానకరమే. కేజ్రీవాల్‌ చెప్పిన తాత్కాలిక ముఖ్యమంత్రి అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేదే’’ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి అతిశీకి రాసిన లేఖలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేర్కొన్నారు.

* అమెరికా 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్‌ (Jimmy Carter).. అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. వితరణశీలి, నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీకి భారత్‌తోనూ మంచి అనుబంధం ఉంది. గతంలో భారత్‌లో పర్యటించిన ఆయన.. ముంబయి సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో సేవలందించారు. ఆ సందర్భంలో స్వయంగా కార్పెంటర్‌గా అవతారమెత్తారు. అంతకు ముందు అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించగా.. ఇందుకు గుర్తుగా హరియాణాలో ఓ గ్రామానికి కార్టర్‌పురి అని పేరు పెట్టడం విశేషం. మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థ (Habitat for Humanity) పేద కుటుంబాలకు 100 ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు అక్టోబర్‌ 2006లో భారత్‌కు వచ్చిన కార్టర్‌.. సతీమణి రోసలిన్‌తో కలిసి ఓ వారం పాటు ఇక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా జిమ్మీ కార్టర్‌.. కార్పెంటర్‌గా సేవలందించారు. దాదాపు 2వేల మంది అంతర్జాతీయ, స్థానిక వాలంటీర్లతో కలిసి పనిచేశారు. హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌ పిట్‌, బాలీవుడ్‌ నటుడు జాన్ అబ్రహం వంటి ప్రముఖులు ఈ వాలంటీర్ల జాబితాలో ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లో 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు సచివాలయంలో జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐపీబీ సమావేశంలో చర్చించారు. దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 2,63,411కుపైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌ 6 వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా దాదాపు 2,400 మందికి ఉపాధి లభించనుంది. మొత్తం 9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 5 బ్లాకుల్లో ఈ రిఫైనరీ ఏర్పాటు కానుంది. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88వేల కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

* దక్షిణ కొరియాలోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన దుర్ఘటన(South Korean Plane Crash)తో అక్కడి ప్రజలు విమాన ప్రయాణాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది! నిన్నటి నుంచి అక్కడ రద్దవుతున్న బుకింగ్సే ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు దాదాపు 68వేల విమాన రిజర్వేషన్‌ బుకింగ్స్‌ రద్దయినట్లు జెజు ఎయిర్‌ వెల్లడించింది. వీటిలో 33వేలకు పైగా దేశీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ కాగా.. 34వేలకు పైగా అంతర్జాతీయం బుకింగ్స్‌ ఉన్నాయని పేర్కొంది. టూర్‌ ప్యాకేజీల క్యాన్సిలేషన్స్‌ పెరుగుతున్నట్లు స్థానిక ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నట్లు అక్కడి పత్రికలు పేర్కొంటున్నాయి. ఆదివారం ఒక్కరోజే తమకు 40కి పైగా క్యాన్సిలేషన్‌కు సంబంధించిన ఎంక్వైరీలు వచ్చినట్లు ఓ ట్రావెలర్‌ తెలిపారు. బుకింగ్స్‌ దాదాపు 50శాతం మేర తగ్గినట్లు చెబుతున్నారు.

* తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సోమవారం సీఎంతో బీఆర్‌ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు. వారానికి రెండు బ్రేక్‌ దర్శనాలు, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అనుమతి ఇచ్చారని బీఆర్‌ నాయుడు వెల్లడించారు.

* మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కిల్‌ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచీ మైక్రోసాఫ్ట్‌కు సానుకూలంగా ఉంది. హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ సెంటర్‌లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో చర్చించే అవకాశముంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌ యూనివర్సిటీలో ప్రధాన భాగస్వామి కావాలని ఆయన్ని కోరేందుకే ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఫ్యూచర్‌ సిటీ, ఏఐ సిటీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సత్య నాదెళ్లకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించే అవకాశముంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z