Business

RTGS-NEFT చెల్లింపుల్లో నూతన సమాచారం-BusinessNews-Dec 30 2024

RTGS-NEFT చెల్లింపుల్లో నూతన సమాచారం-BusinessNews-Dec 30 2024

* అంతర్జాతీయ బలహీన సంకేతాల నేపథ్యంలో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 450.94 పాయింట్లు పతనమై 78,248.13 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 79,092.70 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 78,077.13 పాయింట్ల కనిష్ట స్థాయి మధ్య తచ్చాడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 168.50 పాయింట్లు నష్టంతో 23,644.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నిఫ్టీ 23,915.35 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23,618.90 పాయింట్ల మధ్య ట్రేడయింది. బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్టాక్స్‌తో సూచీలు పతనం అయ్యాయి. సెన్సెక్స్‌ ఉదయం 78,637.58 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 78,699.07) ఫ్లాట్‌గా ప్రారంభమైంది. 11 గంటల సమయంలో లాభాల్లోకి వెళ్లి సూచీ.. 79,092 వద్ద గరిష్ఠాన్ని తాకింది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 78,077.13 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 450.94 పాయింట్ల నష్టంతో 78,248.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 168.50 పాయింట్ల నష్టంతో 23,664.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 4 పైసలు క్షీణించి 85.52గా ఉంది.

* RTGS, NEFT చెల్లింపుల విషయంలో పొరబాట్లకు ఆస్కారం లేకుండా ఉండేందుకు కొత్త సదుపాయం రానుంది. ఇకపై ఆయా చెల్లింపుల వ్యవస్థల ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసేటప్పుడు అవతలి వ్యక్తి పేరు కనిపించనుంది. ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేయాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌కు (NPCI) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సూచించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1కల్లా దీన్ని అందుబాటులోకి తెచ్చేలా చూడాలని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. బ్యాంకులన్నీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌పీసీఐకి గడువును నిర్దేశించింది. ప్రస్తుతం యూపీఐ (UPI), ఐఎంపీఎస్‌ (IMPS)లో నేమ్‌ లుక్‌- అప్‌ సదుపాయం ఉంది. కొత్తగా రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (RTGS), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (NEFT) సిస్టమ్‌లోనూ విస్తరించనున్నారు. పొరబాటు చెల్లింపులను తగ్గించేందుకు ఈ సదుపాయం ఉయోగపడనుంది. దీనివల్ల పేమెంట్ చేసేటప్పుడు అకౌంట్‌ నంబర్‌, బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ ఎంటర్ చేసేటప్పుడు అవతలి వ్యక్తి పేరు కూడా కనిపిస్తుంది. చెల్లింపుల్లో పొరబాట్లకు ఆస్కారం తగ్గుతుంది. యూపీఐ సదుపాయం పాపులర్‌ కాకముందు ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ పేమెంట్ సదుపాయాలు విస్తృతంగా వాడుకలో ఉండేవి. పెద్దమొత్తంలో సొమ్ములు పంపించేందుకు వీటిని ఇప్పటికీ వినియోగిస్తుంటారు. ఈ పేమెంట్ల కోసం బ్యాంక్‌ ఖాతా నంబర్‌, బ్యాంక్‌ పేరు, బ్రాంచి ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, అమౌంట్ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

* భారత బిలియనీర్ గౌతం అదానీ (Gautam Adani )సారధ్యంలోని అదానీ గ్రూప్ (Adani Group) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మార్ (Adani Wilmar) నుంచి తన వాటా పూర్తిగా విక్రయిస్తున్నట్లు అదానీ గ్రూప్ (Adani Group) ఫ్లాగ్ షిప్ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్ (Adani Enterprises) సోమవారం ప్రకటించింది. అదానీ గ్రూప్ అవినీతికి పాల్పడిందని అమెరికా కోర్టులో అభియోగాలు నమోదైన తర్వాత సింగపూర్ సంస్థ విల్మార్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థ నుంచి నిష్క్రమించడం గమనార్హం. తద్వారా 200 కోట్ల డాలర్ల నిధులను అదానీ గ్రూప్ సేకరించనున్నది.

* జీరో కార్బన్ ఉద్గారాల వైపు అడుగులు వేస్తూ.. ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ‘ప్యూర్ ఈవీ’ (Pure EV) పునరుత్పత్పాదక శక్తి ద్వారా విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకుంది. తెలంగాణలోని కంపెనీ సదుపాయంతో డీజీ అండ్ గ్రిడ్‌తో కూడిన 500 కిలోవాట్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్.. 125 కిలోవాట్ సిస్టం వంటి వాటిని ఏకీకృతం చేయడం ద్వారా.. ఎనర్జీ ఎఫిషియన్సీలలో సరికొత్త మైలురాయిని సాధించింది. మునుపటి ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. విద్యుత్ బిల్లులకు సంబంధించిన ఖర్చులలో 60 శాతం, డీజీ ఇంధన బిల్లులలో 65 శాతం తగ్గింపును నమోదు చేసింది. సోలార్ ఇన్‌స్టాలేషన్ అనేది కంపెనీ కార్యకలాపాలను శక్తివంతం చేయడానికి.. పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడానికి మాత్రమే కాకుండా గ్రిడ్ నుంచి విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడానికి సహాయం చేస్తుంది. 500 KWh పూర్తిగా కొత్త బ్యాటరీలను కలిగి ఉంటుంది. అంటే పాత బ్యాటరీల స్థానంలో లేటెస్ట్ జనరేషన్ బ్యాటరీలను అమర్చింది. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్తిగా ఎలక్రిక్, సోలార్ వంటి వాటిని ఉపయోగించడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు.

* భారతీయ రైల్వే 2024 ప్రారంభంలో మొదలు పెట్టిన ‘ట్రైన్ ఎట్ ఎ గ్లాన్స్(TAG)’ 44వ ఎడిషన్ రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. తదుపరి ఎడిషన్‌ను 2025 జనవరి 1 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. రైల్వేశాఖ కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు, పాత ఎడిషన్‌లోని కొన్ని అంశాలను సవరించనున్న నేపథ్యంలో దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణికులు ప్రభావితం చెందుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైల్ (Vande Metro), రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను 2025లో ప్రవేశపెట్టాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు 2024లో 70 కొత్త సర్వీసులు, 64 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z