Business

2024 డిసెంబరు 31 నాటికి ఒక డాలరుకు ₹85.65-BusinessNews-Dec 31 2024

2024 డిసెంబరు 31 నాటికి ఒక డాలరుకు ₹85.65-BusinessNews-Dec 31 2024

* సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. గతేడాది సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించగా.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 5,246 బస్సులను నడిపింది. గత సంక్రాంతి అనుభవాల దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్‌, ఆరాంఘర్, ఎల్‌బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది.

* అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే యువత వారానికి 70 గంటల చొప్పున పని చేయాలని ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) గతంలో వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ (Adani Group chairman Gautam Adani) ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘వర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బాలెన్స్‌. పనిలోనే నిమగ్నమైపోతే.. భార్య పారిపోతుంది. మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం. పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి, ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరూ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది’’ అని అదానీ (Gautam Adani) అన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు క్యాలెండర్‌ సంవత్సరం చివరి రోజును సూచీలు స్వల్ప నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా నష్టాల్లో చలించాయి. ఐటీతో పాటు కొన్ని బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. మధ్యాహ్నం కాస్త భారీ నష్టాల నుంచి కోలుకోవడం సానుకూలాంశం. దీంతో సెన్సెక్స్‌ 100 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 77,982.57 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 78,248.13) నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,560.79 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 109.12 పాయింట్ల నష్టంతో 78,139.01 వద్ద ముగిసింది. నిఫ్టీ కేవలం 0.10 పాయింట్‌ నష్టంతో 23,644.80 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 13 పైసలు క్షీణించి 85.65గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, జొమాటో, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బంగారం ఔన్సు 2626 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

* చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (small savings schemes) వడ్డీ రేట్లను కేంద్రం మరోసారి యథాతథంగా ఉంచింది. జనవరి – మార్చి త్రైమాసికానికి పాత వడ్డీ రేట్లే (Interest rates) కొనసాగనున్నాయి. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వంటి పథకాలపై వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది నాలుగోసారి. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. నోటిఫికేషన్‌ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2 శాతం వడ్డీ లభించనుంది. మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ పథకానికి (PPF) 7.1 శాతం, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్‌ వికాస్‌ పత్ర పథకంపై 7.5 శాతం లభిస్తుంది. 115 నెలల్లో గడువు తీరుతుంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ 7.4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z