* సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్‌కుమార్, సాల్మన్ ఆరోక్యరాజ్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2000 బ్యాచ్‌కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ కుమార్‌ను రీడిజిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సాల్మన్ ఆరోక్యరాజ్ ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్, సీహెచ్ శ్రీధర్‌లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సీఎంవోలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంవో కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. వీరపాండ్యన్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా కొనసాగనున్నారు. కడప జిల్లా కలెక్టర్‌గానే శ్రీధర్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఐపీఎస్ అధికారులు విక్రాంత్ పాటిల్, సిద్ధార్థ్ కౌశల్‌కు పదోన్నతి కల్పించారు.
* దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ మార్పులు వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. నిత్యం విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
* బీచ్‌లో రైడింగ్ (Beach riding) చేయడమంటే సరదాతో పాటు సవాలుగానూ ఉంటుంది. సముద్రం అలలను చూస్తూ రయ్‌మని దూసుకెళ్లడం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇలాగే ఓ ఖరీధైన కారులో బీచ్‌లో దూసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు వింత అనుభవం ఎదురైంది. కారు ఇసుకలో కూరుకుపోవడంతో ఎడ్లబండితో బయటకు లాగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ ఘటన మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఓ బీచ్‌లో (Revdanda Beach) చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. తమ ఫెరారీ కారులో రాయ్‌గఢ్‌లోని రేవ్‌దండా బీచ్‌కు వెళ్లారు. అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ బీచ్‌లో ముందుకుసాగిపోయారు. ఈ క్రమంలో కారు ఇసుకలో కూరుకుపోయింది. దీంతో అక్కడున్నవారంతా వచ్చి వాహనాన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఎడ్లబండి వీరి కంటపడటంతో సాయం కోరారు. ఫెరారీ కారు ముందుభాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండిని ముందుకు పోనిచ్చారు. ఇలా లగ్జరీ కారు ఎట్టకేలకు బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
* ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా .. ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియగా.. కేటీఆర్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
* పాకిస్థాన్‌లోని (Pakistan) పంజాబ్ (punjab) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్‌ను (Bhagat Singh) 93 ఏళ్ల క్రితం విచారించిన చారిత్రక పూంచ్‌హౌస్‌లోని ‘భగత్‌సింగ్ గ్యాలరీ’ని పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. భగత్ సింగ్ జీవితం, స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన చిత్రాలు, లేఖలు, వార్తాపత్రికలు, విచారణ వివరాలు, ఇతర పత్రాలు ఆ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జహీద్ అక్తర్ జమన్ సోమవారం ఈ గ్యాలరీని ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ పోరాటఘట్టాలను ప్రదర్శనకు ఉంచినట్లు అక్తర్ జమన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో భగత్ సింగ్ కేసు ఫైల్‌కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రదర్శించింది. అందులో అతడికి ఉరిశిక్ష అమలు, కొన్ని లేఖలు, ఫొటోలు, వార్తాపత్రికల క్లిప్పింగ్‌లు ఇతర అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరంపై భగత్ సింగ్‌ను 23 ఏళ్ల వయస్సులో బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్‌లో ఉరితీసింది. బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి. సాండెర్స్‌ను హత్య చేశారన్న నేరాభియోగంపై భగత్ సింగ్‌తోపాటు రాజ్‌గురుపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను తాజాగా పాక్ పంజాబ్ ప్రభుత్వం గ్యాలరీలో ఉంచింది. భగత్ సింగ్ దళంలో సుమారు 24 -25 మంది సభ్యులు ఉండేవారు. వీళ్లంతా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లి ఉద్యమాలు చేపట్టారు. వీళ్లని బ్రిటిష్ పోలీసు బలగాలు, ఏజెన్సీలు ఎలా పసిగట్టాయి. వారి లింక్‌ను ఎలా ఛేదించాయన్న వివరాలకు సంబంధించిన దస్త్రాలను కూడా గ్యాలరీలో ఉంచారు. మంగళవారం భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ మాట్లాడుతూ.. ఈ గ్యాలరీకి ‘షాడ్‌మన్ చౌక్‌గా’ నామకరణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
* భారత జట్టు.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ విఫలమవుతోంది. తొలి టెస్టులో మినహా తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో నిరాశే ఎదురైంది. నాలుగు టెస్టులు ముగిసేసరికి 2-1తో వెనకబడి ఉంది. బ్యాటింగ్‌లో విఫలమవడం, ముఖ్యంగా టాపార్డర్‌లోని స్టార్ ఆటగాళ్లు నిరాశపరుస్తుండటం టీమ్‌ఇండియాను దెబ్బతీస్తోంది. ఈనేపథ్యంలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేయడంపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand)ను ట్విటర్ (ఎక్స్)లో నెటిజన్లు అడిగారు. దీనికి ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రత్యర్థి జట్టు 11 మందితో ఆడుతుంటే భారత జట్టు కేవలం 9 మందితోనే ఆడుతుందని వ్యంగ్యంగా అన్నారు.
* యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) జరిగిన విమాన ప్రమాదంలో (Plane Crash) భారత సంతతికి చెందిన వైద్యుడు మృతి చెందినట్లు అక్కడి విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం తేలికపాటి విమానం కూలి పోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. వారిలో కో-పైలట్‌గా వ్యవహరిస్తున్న సులేమాన్ అల్ మజిద్ (Sulaymaan Al Majid) కూడా ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువతితో కలిసి తేలికపాటి విమానంలో విహారానికి వెళ్తుండగా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది.
* రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం ఏర్పాటైన సిట్ బృందంలో మార్పులు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల దర్యాప్తు, విచారణ కోసం గతంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. బృందంలో కొందరు సభ్యుల నియామకంపై వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన ప్రభుత్వం సిట్‌లో మార్పులు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ కాకినాడ ఈడీ ఎ.శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమశాఖ కర్నూలు ఆర్జేడీ పి.రోహిణి, విజయనగరం జిల్లా పౌరసరఫరాల అధికారి కె.మధుసూదన్‌రావు, కోనసీమ జిల్లా పౌరసరఫరాల మేనేజర్ బాల సరస్వతి సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన 13 కేసులపై సిట్ విచారణ జరపనుంది. సిట్‌లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారులు, పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ఉన్నారు. గతంలో నియమించిన నలుగురు డీఎస్పీలపై అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం రాబోతోంది. కొత్త ఏడాదిని మరింత స్పెషల్‌గా ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వేడుకల పేరిట కొందరు వికృత చేష్టలకు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ పోలీసులు (Punjab Police) చేసిన వినూత్న ఆలోచనను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మెచ్చారు. పంజాబ్ పోలీసులు నూతన సంవత్సర వేడుకల వేళ పౌరులను అప్రమత్తం చేస్తూ విన్నూతంగా సూచనలు జారీ చేశారు. ‘‘వేడుకల సందర్భంగా అధికంగా మద్యం సేవించడం, వీధుల్లో గొడవలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి పంజాబ్ పోలీసులు ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నారు.. అవి ఏంటంటే.. పోలీసు స్టేషన్‌కు ఉచితంగా ఎంట్రీ ఉంటుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారికి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇస్తాం. అంతేకాకుండా.. ఈ ఏడాది చివరి రాత్రిని నాశనం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. 112కి ఫోన్ చేసి మమ్మల్ని ఆహ్వానించవచ్చు’’ అని పేర్కొన్నారు.
* ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం సడలించింది. దీంతో భారత్‌లో ఉన్న వాట్సప్ యూజర్లందరికీ త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు.. ఇకపై అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్‌నకు వెసులుబాటు లభించింది. ఒకప్పుడు మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్‌లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు. అయితే, పేమెంట్ సేవలను తీసుకురావడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి మాత్రమే అవకాశం కల్పించింది. 2022లో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచింది. తాజాగా దీనిపై ఉన్న పరిమితుల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎత్తివేసింది. దీంతో వాట్సప్ వాడుతున్నవారందరికీ ఈ సేవల్ని వాట్సప్ తీసుకొచ్చేందుకు వీలు కలగనుంది.
* మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వైకాపా హయాంలో గుడివాడ తెదేపా కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైకాపా కార్యకర్తలు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వైకాపా హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో నిందితులు అరాచకాలకు పాల్పడ్డారు. వైకాపా అధికారంలో ఉండగా 2022 డిసెంబర్ 25న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెదేపా కార్యాలయంపై పెట్రోల్ ప్యాకెట్‌లతో దాడులకు తెగబడ్డారు. ఈ విషయంపై నమోదైన కేసులో ఇప్పటికి వరకు 13 మంది కాళీ అనుచరులను ఇటీవల గుడివాడ వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ప్రధాన నిందితుడు కాళీ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతడు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం వెళ్లి అక్కడ చేపల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కాళీ కదలికలపై నిఘా ఏర్పాటు చేసి మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. త్వరలో నిందితుడిని గుడివాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z