Fashion

రైల్వేలో 32వేల ఉద్యోగాలు-NewsRoundup-Jan 03 2025

రైల్వేలో 32వేల ఉద్యోగాలు-NewsRoundup-Jan 03 2025

* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది. ఉత్తర్వుల అనువాదానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ సేవలు వినియోగించుకోవాలని తెలిపింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

* చైనా (China)లో మరో వైరస్ వ్యాప్తి చెందుతోందని, ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారంటూ వస్తోన్న కథనాలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెల్త్‌ ఏజెన్సీ డీజీహెచ్‌ఎస్‌ స్పందించింది. హ్యూమన్‌ మెటానిమోవైరస్‌ (HMPV)వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాత్రం భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

* రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపు 32 వేల లెవెల్‌ -1 (గ్రూప్‌ డి) ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోన్న రైల్వే బోర్డు.. విద్యార్హతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లమా లేదా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (NCVT) జారీ చేసిన నేషనల్‌ అప్రెంటిషిప్‌ సర్టిఫికెట్‌ (NAC) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

* మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR)కు తెలంగాణ ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసులో ఈనెల 6న ఉదయం 10గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్‌ శాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటుచేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఏయూడీ(పురపాలక శాఖ) ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఏసీబీ.. ఇటీవల దానకిశోర్‌ నుంచి సుమారు ఏడు గంటలపాటు వివరాలను తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

* హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా (Ravi Gupta)తో తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలపై చర్చించారు. థియేటర్ల లైసెన్స్‌ల పునరుద్ధరణ సులువుగా ఉండాలన్న అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దిల్‌ రాజుతోపాటు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, పలువురు ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.

* సిరియాలోని ఓ భూగర్భ ఆయుధ తయారీ స్థావరంపై ఇజ్రాయెల్‌ కమాండోలు మెరుపుదాడి చేశారు. కేవలం మూడు గంటల్లోనే మొత్తాన్ని పూర్తి చేశారు. అక్కడి పేలుడు పదార్థాలను ధ్వంసం చేస్తే.. ఏకంగా మినీ భూకంపమే వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్‌ అందులోని కీలక ఘట్టాల వీడియోను పోస్టు చేసి దాడిని కళ్లకు కట్టినట్లు చూపింది. దీనికి పెట్టిన కోడ్‌నేమ్‌ ‘ఆపరేషన్‌ మెనీవేస్‌’..! 120 మంది మెరికల్లాంటి కమాండోలు ఇందులో పాల్గొన్నారు. 2017కు ముందు దక్షిణ సిరియాలోని జమ్రాయ వద్ద ది సైంటిఫిక్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ పేరిట ఓ ఆయుధ కర్మాగారం ఉండేది. ఇది ఇరాన్‌ కనుసన్నల్లో నడిచేది. ఇక్కడ వివిధ రకాల రాకెట్‌ ఇంజిన్లను తయారుచేసేవారు. 2017లో ఇజ్రాయెల్‌ వాయుసేన దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఆయుధ కర్మాగారాన్ని మస్యాఫ్‌ ప్రాంతంలోకి తరలించాలని ఇరాన్‌ నిర్ణయించింది. ఇక్కడ కొండల్లో దాదాపు 70 నుంచి 130 మీటర్ల మేరకు భూమిని తవ్వి 2021లో ఇందులో క్షిపణుల ఉత్పత్తి మొదలుపెట్టింది. డమాస్కస్‌ తర్వాత ఈ ప్రదేశంలోనే అత్యధిక స్థాయిలో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు మోహరించి ఉన్నాయి. గుర్రపునాడా ఆకారంలో మూడు ప్రవేశద్వారాలతో దీనిని నిర్మించారు. ఒక దానినుంచి ముడి పదార్థాలు, రెండో దానినుంచి పూర్తయిన క్షిపణులు, మూడో దానినుంచి లాజిస్టిక్స్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 16 గదుల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో రాకెట్‌ ఫ్యూయల్‌ మిక్సర్లు, మిసైల్‌ బాడీ తయారీ యూనిట్లు, పెయింట్‌ రూమ్‌ వంటివి ఏర్పాటుచేశారు. ఈ ఫెసిలిటీలో 300 కిలోమీటర్ల రేంజిలో దాడి చేసే 100 నుంచి 300 క్షిపణులను ఏటా తయారు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇక్కడి ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, ఇతర కారణాలరీత్యా హెజ్‌బొల్లాకు ఆయుధ సరఫరా సమయంలో కాన్వాయ్‌లపై ఇజ్రాయెల్‌ దాడి చేయలేదని భావించింది.

* రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక ప్రైవేట్‌ పరం కానుంది. బీమా కంపెనీలకు చంద్రబాబు సర్కార్‌.. ఆరోగ్యశ్రీని అప్పగించేసింది. ఎన్టీఆర్‌ వైద్యసేవకు అనుసంధానంగా ఇన్సూరెన్స్‌ హైబ్రిడ్‌ మోడ్‌ తీసుకొస్తున్నామని వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. రూ.2.50 లక్షల లోపు బిల్లులను ఇకపై ఇన్సూరెన్స్‌ సంస్థలు చెల్లిస్తాయని పేర్కొన్నారు. మరో వైపు.. ‘ఆరోగ్య శ్రీ(ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకం కింద ప్రజలకు అందించిన వైద్య సేవలకు గాను చెల్లించాల్సిన రూ.3 వేల కోట్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీనివల్ల ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారింది. ప్రభుత్వం తక్షణమే కనీసం రూ.2 వేల కోట్ల బిల్లులైనా చెల్లించకపోతే జనవరి ఆరో తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తాం’ అని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

* తల్లితో సహా నలుగురు చెల్లెల్ని ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసిన ఘటన యూపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. మాయమాటలతో హోటల్‌కు తీసుకెళ్లి తన కుటుంబంలోని సభ్యులను హతమార్చాడు. యూపీలోని సాంబాల్‌కు చెందిన అర్షద్‌.. తన తల్లి, చెల్లెళ్లను కొత్త ఏడాది సంబరాల పేరుతో లక్నోలోని హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆపై తాను వేసుకున్న పథకం ప్రకారం వారిని బంధించి భయానకంగా చంపేశాడు. అనంతరం తన బంధువుల్లో ఒకరికి వీడియో కాల్‌ చేసి మరీ తన కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంగతిని ఏదో ఘనకార్యం చేసినట్లుగా చెప్పుకున్నాడు. ‘అంకుల్‌.. చూడు.. కుటుంబాన్ని మొత్తం చంపేశా’ అంటూ అస్మా సోదరుడు(అర్షద్‌కు మేనమామ)కు ఫోన్‌ చేసి చెప్పాడు. అర్షద్‌ అనే యువకుడు తల్లి అస్మాను, చెల్లెళ్లు అలియా(9), అక్సా(16); రాచ్‌మీన్‌(18), అల్షియా(19)లను లక్నోలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. న్యూ ఇయర్‌ సంబరాలు చేసుకుందాం అంటూ వారిని హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే మృత్యువు కొడుకు రూపంలో వస్తుందని తల్లీ గ్రహించలేకపోయింది. చెల్లెళ్లు కూడా సోదరుడు సంబరాలు చేసుకుందామంటే తెగ సంబర పడ్డారే కానీ వారికి అదే చివరి రోజు అవుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. తన కొడుకు.. చెల్లెళ్లతో కలిసి సంబరాలు చేసుకుందామంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. కానీ అది ఆ కన్నపేగుకు ఎంతోసేపు నిలవలేదు. ఇంత కిరాతకానికి ఒడిగడతాడని తల్లి ఊహించలేపోయింది. కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోయే క్ష ణంలో తల్లి ఏమీ చేయలేని జీవచ్ఛవంలా మారిపోయింది.

* ప్రపంచ కుబేరుడు, టెస్లా చీప్ ఎగ్జిక్యూటివ్ ‘ఇలాన్ మస్క్’ (Elon Musk) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. కొత్త ఏడాది ప్రారంభం కావడానికి ముందే భారీ విరాళం అందించినట్లు సమాచారం. టెస్లా బాస్ ఇటీవల వివిధ ఛారిటీలకు 2,68,000 టెస్లా షేర్ల (Tesla Shares)ను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ 108 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 926 కోట్ల కంటే ఎక్కువ). టెస్లాలో దాదాపు 12.8 శాతం వాటా కలిగిన మస్క్.. తన షేర్లను దానం చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 నుంచి భారీ మొత్తంలో విరాళాలను అందిస్తూనే ఉన్నారు. వందల కోట్లు విరాళంగా ఇచ్చిన ‘మస్క్’ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే మస్క్ ఏ ఛారిటీలకు విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2021లో కూడా ఈయన మస్క్ ఫౌండేషన్‌ (Musk Foundation)కు సుమారు 5.74 బిలియన్ డాలర్ల విరాళం అందించారు. పలు ఛారిటీలకు లెక్కకు మించిన డబ్బు విరాళంగా ఇవ్వడమే కాకుండా.. మానవాళికి ప్రయోజనం చేకూరేలా, దానికి తగిన కృత్రిమ మేధస్సును అభివృద్ధి చేయడానికి కూడా భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.

* బాంద్రాలోని నోఖా, బికనేర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్‌కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్‌సుందర్‌ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్‌కి 2016లో ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్‌ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు.ఆ రిటైర్మ్ంట్‌ ఆర్డర్‌పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్‌ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్‌ 12న విధుల్లో జాయిన్‌ అయినట్లు చెప్పుకొచ్చారు.ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్‌ సుందర్‌ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్‌పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్‌ సుందర్‌ 2011 అక్టోబరు 13న తనకు టీచర్‌న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్‌ కెరీర్‌ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు.​ కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.

* ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది. ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.

* ఏపీలో కూటమి ప్రభుత్వ(Kutami Prabhutvam) ప్రతీకార పాలన కొనసాగుతోంది. నిత్యం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, ఆరోపణలు, తప్పుడు కేసులతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్‌ చేసుకుని ఎల్లో మీడియాతో అడ్డగోలు కథనాలను అచ్చేయిస్తోంది.సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కడప జిల్లా సీకేదిన్నె మండల పరిధిలోని అటవీ భూములు ఆక్రమించిందనే ఆరోపణలను కూటమి అనుకూల మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. కబ్జా కథనాలను తీవ్రంగా ఖండించింది.‘‘అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదు. ఆ మీడియా చానెల్స్‌ చెప్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమికూడా సజ్జల రామకృష్షారెడ్డికి లేదు. అలాంటప్పుడు కబ్జా అన్న ప్రశ్నే తలెత్తదు. 1995 ప్రాంతంలోనే అంటే ఇప్పటి చంద్రబాబు(Chandrababu) అప్పుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఇక్కడ పనికిరాని భూములను సజ్జల, ఆయన సోదరులు కొనుగోలుచేశారు. మామిడితోటలు వేశారు. దీనికి దాదాపు పదేళ్ల తర్వాత సజ్జల రామకృష్షారెడ్డి తన వాటా భూములను సోదరులకు విడిచిపెట్టారు. అప్పటినుంచీ ఆయనకు ఆ భూములతో ఆయనకు సంబంధం లేదు. ఇది జరిగినప్పుడు ఆయన రాజకీయాల్లోకూడా లేరు.2014లో ఫారెస్ట్‌, రెవిన్యూ విభాగాల మధ్య ఈ ప్రాంతంలో మొత్తం భూముల విషయమై వివాదం నెలకొంది. ఫారెస్ట్‌ కిందకు వస్తుందని అటవీశాఖ, ఆ ప్రసక్తే లేదని రెవిన్యూశాఖలు తలోరకంగా చెప్తున్నాయి. ఇరుశాఖలకు మొత్తం రికార్డులు కూడా సజ్జల సోదరులు అప్పగించారు. సంయుక్తంగా సర్వే చేసి ఏదో విషయం తేల్చాలని సజ్జల సోదరులే పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు.కేవలం సజ్జల రామకృష్షారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డమే లక్ష్యంగా ఎల్లోమీడియా ప్రయత్నిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై సజ్జల న్యాయపరమైన చర్యలకు దిగుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ ఒక ప్రకటనలో తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z