Business

మార్గదర్శి కేసు…తెలంగాణ హైకోర్టు ఆగ్రహం-BusinessNews-Jan 03 2025

మార్గదర్శి కేసు…తెలంగాణ హైకోర్టు ఆగ్రహం-BusinessNews-Jan 03 2025

* ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (SBI) రెండు కొత్త డిపాజిట్‌ స్కీమ్‌లను తీసుకొచ్చింది. హర్‌ ఘర్‌ లఖ్‌పతి (Har Ghar Lakhpati), ఎస్‌బీఐ ప్యాట్రాన్స్‌ (Patrons) పేరుతో వీటిని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హర్‌ఘర్‌ లఖ్‌పతి అనేది ప్రీ క్యాలుక్యులేటెడ్‌ రికరింగ్‌ డిపాజిట్‌ (RD) పథకం. రూ.1 లక్ష లేదా ఆపై రూ.లక్ష చొప్పున నిధులను సమకూర్చుకోవడానికి ఉద్దేశించిన పథకం ఇది. వ్యక్తులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. మైనర్లకూ ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ ప్యాట్రన్స్‌ అనేది సీనియర్‌ సిటిజన్లకు ఉద్దేశించిన పథకం. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారి కోసం ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. వీరికి అధిక వడ్డీని అందిస్తామని బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుత, కొత్తగా ఎఫ్‌డీ చేసే వారికి ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ డిపాజిట్‌ స్కీమ్‌లను తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. డిపాజిట్ల విషయంలో 23 శాతం మార్కెట్‌ వాటాతో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉంది. ఎస్‌బీఐలో ప్రస్తుతం కనీసం 12 నెలల నుంచి గరిష్ఠంగా 120 నెలల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకునే సదుపాయం ఉంది.

* మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్‌ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్‌ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్‌ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.కాగా, చందాదా­రుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్‌ 6న బట్టబయలైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చట్టం సెక్షన్‌ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు.

* ఈపీఎస్‌ పింఛన్‌దారుల (EPS Pensioners)కు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్‌ నుంచైనా పెన్షన్‌ (Pensions from any Bank) తీసుకునేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను (CPPS) దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. దీనివల్ల 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనకరమని పేర్కొంది. ప్రస్తుతం పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్‌ వ్యవస్థ ఉంది. దీని వల్ల ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీంతో పింఛను (Pension) ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్‌ విధానం వల్ల బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం తప్పింది. అంతేకాదు పింఛన్‌ (Pension) విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 80,072 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 79,147.32 పాయింట్ల కనిష్ట స్థాయి వరకూ సాగింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 183.90 పాయింట్లు కోల్పోయి 24,004.75 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో 24,196.45 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకెళ్లి, 23,978.15 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. బీఎస్ఈ-30 సెన్సెక్స్ లో జోమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, టీసీఎస్ షేర్లు భారీగా నస్టపోయాయి. టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభ పడ్డాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ 75.61 డాలర్లు పలికితే, ఔన్స్ బంగారం 2670 డాలర్ల వద్ద ట్రేడయింది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ మీద అమ్మకాల ఒత్తిడితో సూచీలు పతనం అయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర బ్లూచిప్ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z