* సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు (Allu Arjun) నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టుకు హాజరైన ఆయన సరికొత్త లుక్‌లో కనిపించారు. ‘పుష్ప2’ (Pushpa2: The Rule) కోసం పొడవైన జుట్టు, గడ్డం పెంచి మాస్ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు సాధారణ హెయిర్‌స్టైల్‌కు వచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కోర్టుకు వచ్చిన పలువురు అల్లు అర్జున్‌తో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు అల్లు అర్జున్ కోర్టు వద్దకు వచ్చి వెళ్లే వరకూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
* కరోనా (Corona Virus) మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో (China)లో హెచ్‌ఎంపీవీ (HMPV Symptoms) అనే మరో వైరస్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి పిల్లులు (cats) ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే ప్రాణాంతక వైరల్ వ్యాధి బారిన పడుతున్నట్లు సమాచారం. తమ పెంపుడు పిల్లులు ఈ వ్యాధి (Feline Infectious Peritonitis) బారిన పడకూడదనే ఆలోచనతో కొంతమంది తమ పిల్లులకు మనుషుల్లో కొవిడ్ వైద్యానికి వాడే మందులు (Covid pills) వేస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
* సికింద్రాబాద్ లాలాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి మృతి చెందగా.. తట్టుకోలేక ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లాలాగూడ పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మి, ఆమె కుమారుడు అభినయ్ ఎనిమిదేళ్లుగా లాలాగూడలోని అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో తట్టుకోలేక అభియన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా.. ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి.
* తనకు దేశం విడిచివెళ్లిపోయే అవకాశం వచ్చినా తాను అంగీకరించలేదని పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.‘‘నేను అటోక్ జైల్లో ఉన్నప్పుడు మూడేళ్ల కాలానికి దేశం విడిచి వెళ్లిపోయేందుకు అవకాశం వచ్చింది. కానీ నేను అందుకు నిరాకరించాను. నేను ఉంటాను. ఇక్కడే కన్నుమూస్తాను. నా మాట ఎప్పుడూ ఒక్కటే. అదుపులోకి తీసుకున్న మా నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలి. ఆ తర్వాత నా వ్యక్తిగత పరిస్థితిపై చర్చించడం గురించి ఆలోచిస్తాను. అలాగే పాక్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నది నా అభిప్రాయం.
* ఈశాన్య రాష్ట్రం మణిపుర్ (Manipur)లో జాతుల మధ్య హింస కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని మిలిటెంట్లు.. ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు (Elon Musk) చెందిన ‘స్టార్ లింక్’ నుంచి ఇంటర్నెట్ సేవలు వినియోగిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ‘ది గార్డియన్’ పత్రిక కథనం పేర్కొంది. మణిపుర్‌లో అధికారులు స్థానికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన సమయంలో మిలిటెంట్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్ (starlink satellites) నుంచి ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ‘స్టార్‌లింక్’కు చట్టబద్ధంగా అనుమతి లేదు. కానీ, మణిపుర్ పొరుగున ఉన్న మయన్మార్‌లో మాత్రం దీనిని అనుమతించినట్లు వెల్లడించింది. మణిపుర్‌లో అధికారులు స్థానికంగా ఇంటర్నెట్ నిలిపివేసిన సమయంలో మిలిటెంట్లు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్ (starlink satellites) నుంచి ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు కథనం పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ‘స్టార్‌లింక్’కు చట్టబద్ధంగా అనుమతి లేదు. కానీ, మణిపుర్ పొరుగున ఉన్న మయన్మార్‌లో మాత్రం దీనిని అనుమతించినట్లు వెల్లడించింది. సరిహద్దు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సేవలను వినియోగించుకుంటున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీని సేవలు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్ భారత్‌లోనూ అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని గతంలో వార్తలు వచ్చాయి.
* దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల (Delhi Assembly Elections) కోలాహలం మొదలైంది. ఎన్నికల సంఘం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. అధికార ఆమ్ ఆద్మీ (AAP) పార్టీతోపాటు, భాజపా (BjP), కాంగ్రెస్ (Congress) ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నాయి. ప్రత్యేకించి ‘కృత్రిమ మేధ’ (Artificial Intelligence) సాయంతో తయారు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో అధికార ఆప్ ఇప్పటికే వ్యూహాలకు పదునుపెట్టింది. అందరికంటే ముందుగానే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. పార్టీ సారథి కేజ్రీవాల్ గతంలో ప్రస్తావించిన ‘‘GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్), సన్ ఆఫ్ దిల్లీ’’ లాంటి నినాదాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి వీడియోల ద్వారా ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష భాజపా ‘ అరవింద్ కేజ్రీవాల్ మోసగాడు’ అంటూ కొన్ని ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది.
* ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటన ఖరారైంది. జనవరి 8న ప్రధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 4.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వరకు నిర్వహించనున్న రోష్ షోలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు తిరిగి భువనేశ్వర్ వెళ్లనున్నారు.
* హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని రంగనాథ్ సూచించారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే 040-29565758, 040-29560596 నంబర్లను సంప్రదించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని రంగనాథ్ వెల్లడించారు.
* విజయానికి షార్ట్ కట్స్ ఉండవని.. కష్టపడితేనే ఫలితాలు ఉంటాయని భారత్ బయోటెక్ కో-ఫౌండర్ సుచిత్ర ఎల్ల (Suchitra Ella) అన్నారు. వసుధైక కుటుంబంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అందుకే విజయాలు సాధించగలుగుతున్నామని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు (World telugu federation conference) హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటిత పరిచి… తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టం చేస్తూ నేటితరం, భావితరాలకు అందించే లక్ష్యంతో సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
* ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.
* HMPV (హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్) వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. హెచ్‌ఎంపీవీ సోకితే జలుబు, దగ్గుతో పాటు ముక్కు మూసుకుపోవడం (శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం), ముక్కుకారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని.. ఇది కొందరిలో ఊపిరితిత్తులను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యారోగ్య హెచ్చరించింది. హెచ్ఎంపీవి వైరస్ కారణంగా తీవ్ర జ్వరం, చర్మంపై దద్దుర్లు (స్కిన్ ఇన్ఫెక్షన్) కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని.. జలుబు, దగ్గు, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించింది. ఇమ్యూనిటీ సిస్టం బలహీనంగా వుండే చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
* హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్‌ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.”
* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 29 మంది పేర్లను ప్రకటించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ తరఫున పర్వేష్ వర్మ పోటీ చేయబోతున్నారు. అలాగే కల్‌కాజీ నుంచి సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని బీజేపీ రంగంలోకి దింపింది. ఢిల్లీ బీజేపీ(BJP) చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరంటూ తొలి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి . ఈలోపు.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం గమనార్హం. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు కమలం పార్టీ తొలి జాబితాతో అవకాశం కల్పించింది.
* ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైందని.. రేవంత్‌కు పరిపాలన చేతకావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైతు బంధుకు కొర్రీలు పెడుతున్నారన్న కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని కటింగ్ మాస్టర్‌గా అభివర్ణించారు. శనివారం.. సిరిసిల్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, పుట్టమధు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా? లేదా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఊరికి పోదామా అంటూ అసెంబ్లీలో అడిగితే సమాధానం లేదు. సర్వశిక్షా అభియాన్ వాళ్ల సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామన్నాడు రేవంత్.. ఏమైంది?. కాంగ్రెస్ మాట తప్పిన ప్రభుత్వం. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడాల్సిన రైతుబంధు.. ఓట్లు పడ్డప్పుడు వేసిన ఘనత కాంగ్రెస్‌ది. రైతు ప్రమాణ పత్రం రాయడమేంటి..?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.
* విశాఖ కారాగారంలో ఖైదీలు ఉండే నర్మదా బ్లాక్‌లో శుక్రవారం సెల్‌ఫోన్ దొరకడం కలకలం రేపింది. ప్రాంగణంలో సెల్‌ఫోన్ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ మహేష్‌బాబు తెలిపారు. నర్మదా బ్లాక్ భవనాన్ని పరిశీలించగా అక్కడ గచ్చును తవ్వి అందులో సెల్‌ఫోన్ ఉంచి పైన మార్బుల్ పలక అమర్చినట్లు గుర్తించామన్నారు. సెల్‌ఫోన్‌లో సిమ్ తొలగించారని పేర్కొన్నారు. ఆ బ్లాక్‌లోని ఓ ఖైదీపై అనుమానం ఉందని, అతను గంజాయి సరఫరా కేసులో నిందితుడని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z