Business

హైదరాబాద్ కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు-BusinessNews-Jan 04 2025

హైదరాబాద్ కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు-BusinessNews-Jan 04 2025

* క్యాబ్‌ బుక్‌ చేసినప్పటికీ డ్రైవర్‌ స్పందించకపోవడంతో ఓ ప్రయాణికుడు విమానం అందుకోలేకపోయాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి.. వినియోగదారుల ఫోరంలో ఉబర్‌ ఇండియాపై (Uber India) దావా వేశాడు. సేవలు అందించడంలో ఉబర్‌ విఫలమైనట్లు తేలడంతో కన్జూమర్‌ కోర్టు ఆ ప్రయాణికుడికి రూ.54 వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇంకో విమానంలో ప్రయాణానికైన ఖర్చు రూ.24 వేలు, మానసిక ఒత్తిడికి కారణమైనందుకు మరో రూ.30వేలు కలిపి ఆ మొత్తాన్ని సదరు పిటిషనర్‌కు చెల్లించాలని పేర్కొంది. దాదాపు మూడేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. దిల్లీకి చెందిన వైద్యుడు ఉదయం 3 గంటలకు ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేశాడు. బుకింగ్‌ కన్ఫామ్‌ అవడంతో క్యాబ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎంతకీ క్యాబ్‌ రాకపోవడంతో డ్రైవర్‌కి కాల్ చేశాడు. స్పందించకపోవడంతో ఉబర్‌ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేశాడు. అక్కడా ప్రయోజనం లేకపోయింది. దీంతో అప్పటికప్పుడు ట్యాక్సీ మాట్లాడుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అప్పటికే తాను ఎక్కాల్సిన విస్తారా విమానం వెళ్లిపోయింది. దీంతో చేసేది లేక ఇంకో విమానానికి టికెట్‌ బుక్‌ చేసుకొని వెళ్లాడు. తన విమానం అందుకోకపోవడానికి కారణమైన ఉబర్‌ ఇండియాపై జిల్లా కన్జూమర్‌ కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఉబర్‌ సేవా లోపాన్ని గుర్తించి కన్జూమర్‌ కమిషన్‌ ఆ సంస్థకు ఫైన్‌ వేసింది.

* జామ్‌నగర్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తానని ముకేశ్‌ అంబానీ తనయుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ (Anant Ambani) అన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిఫైనరీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రిలయన్స్‌ వారసత్వాన్ని కొనసాగిస్తానని అనంత్‌ అంబానీ పేర్కొన్నారు. తాత ధీరూభాయ్‌ అంబానీ జామ్‌నగర్‌కు పునాదులు వేస్తే.. తన తల్లిదండ్రులు ముకేశ్‌, నీతా అంబానీ విజయానికి కృషి చేశారని చెప్పారు. వారి మార్గదర్శనంలో దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళతానని పేర్కొన్నారు. పశు పక్ష్యాదులను ప్రేమించాలని చిన్నప్పటి నుంచి తన తల్లి నీతా అంబానీ చెప్తూ ఉండేవారని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా వన్య ప్రాణుల కోసం వంతారాను ప్రారంభించామని చెప్పారు. మనుషుల్లానే వన్య ప్రాణుల సంరక్షణను రిలయన్స్‌ చూసుకుంటుందని చెప్పారు. రిలయన్స్‌ సేవా గుణానికి వంతారా ప్రాజెక్టు నిదర్శనమని అనంత్‌ అంబానీ అన్నారు.

* జరిమానా పేరుతో రూ.50 వేలు లంచం, బంగారు బ్రేస్‌లెట్‌ తీసుకున్న ఆరోపణలపై రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు కస్టమ్స్‌ అధికారులు, ఓ బ్యాంకు అధికారిపై సీబీఐ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన మహ్మద్‌ ముల్తానీ తన కుటుంబ సభ్యులతో కలిసి గతేడాది సెప్టెంబరు 23వ తేదీన హజ్‌ యాత్రకు వెళ్లి అక్టోబరు 4 అర్ధరాత్రి 12.20 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న కస్టమ్స్‌ అధికారులు వారిని తనిఖీ చేశారు. ముల్తానీ కుమార్తె బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారని, వాటికి సంబంధించి కస్టమ్స్‌ కార్యాలయంలో బిల్లులు చూపించి అక్కడే పాస్‌పోర్టు తీసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లే కస్టమ్స్‌ కార్యాలయానికి వెళ్లిన ముల్తానీని అక్కడ విధుల్లో ఉన్న అధికారులు బంగారం గురించి ప్రశ్నించారు. తన కుమార్తె ఒక గొలుసు, బ్రేస్‌లెట్‌లు ధరించారని ఇవి 30 గ్రాములు మాత్రమేనని, గతంలో హజ్‌కు వెళ్లినపుడూ ఈ ఆభరణాలు ధరించారని ముల్తానీ తెలిపారు. కానీ వారు రూ.1.5 లక్షలు జరిమానా చెల్లించాల్సిందేనని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమవద్ద అంత డబ్బు లేదని బతిమలాడగా రూ.50 వేలు చెల్లించేందుకు ఒప్పుకొన్నారు. దీంతో ముల్తానీ రూ.50 వేలు కస్టమ్స్‌ కార్యాలయం వద్ద కెనరాబ్యాంకు కౌంటర్లో చెల్లించారు. బ్యాంకు సిబ్బంది దీనికి సంబంధించి రసీదు ఇవ్వకుండా కస్టమ్స్‌ అధికారులు ఇస్తారని చెప్పారు. అనంతరం కస్టమ్స్‌ అధికారులు రకరకాల సాకులు చూపి బెదిరించారు. పైగా గొలుసు మాత్రమే ఇచ్చి బ్రేస్‌లెట్‌ వారివద్దే ఉంచుకున్నారు. జరిమానా పేరుతో తమవద్ద రూ.50 వేలు, బ్రేస్‌లెట్‌ లంచం తీసుకున్నారని భావించిన ముల్తానీ అక్టోబరు 16వ తేదీన సీబీఐకి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్లు వినయ్‌కుమార్, ముకేశ్‌ కుమార్, కస్టమ్స్‌ విభాగం తరఫున బ్యాంకు విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌లతో పాటు మరికొందరిపై వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

* ఒకప్పుడు బాలానగర్‌ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్సీ), సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే. ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ (ఐడీపీఎల్‌) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్‌ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్‌ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు. ఇప్పుడిప్పుడే బాలానగర్‌ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్‌ సిటీకి బాలానగర్‌ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్‌ నుంచి హైటెక్‌ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్‌ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.

* ఇండో అమెరికన్‌ పారిశ్రామికవేత్త, ఇన్ఫోసిస్‌ మాజీ సీఈఓ విశాల్‌ సిక్కా శనివారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సోషల్ మీడి యావేదిక ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వల్ల భారత్‌ మీద చూపే ప్రభావంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ‘ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కావడం గర్వకారణం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, దానివల్ల భారత్‌పై ప్రభావంపై మోదీ విస్తృత స్థాయి చర్చలు జరిపాం. ఈ భేటీ తర్వాత టెక్నాలజీపై ప్రధాని మోదీకి గల అసాధారణ పరిజ్ఞానం నన్ను అబ్బుర పరిచింది. ప్రజాస్వామ్య విలువలతోపాటు దాన్ని ఉపయోగంతో ప్రతి ఒక్కరి అభ్యున్నతికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాం’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

* ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్‌ అండ్‌ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 2024లో మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయంలో గణనీయ వృద్ధిరేటు నమోదు చేసింది. 2023తో పోలిస్తే, 2024లో 32 శాతం వృద్ధితో 58,01,498 యూనిట్లు విక్రయించింది. వాటిలో 52,92,976 యూనిట్లు దేశీయంగా విక్రయిస్తే, 5,08,522 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేసినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ తెలిపింది. గత నెలలో 3,08,083 యూనిట్లు విక్రయిస్తే, వాటిలో దేశీయంగా 2,70,919 యూనిట్లు అమ్ముడయ్యాయి. విదేశాలకు 37,164 మోటారు సైకిళ్లు, స్కూటర్లు ఎగుమతి చేసినట్లు పేర్కొంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z