NRI-NRT

తానా బోర్డు మీటింగులో FBI నోటీసులపై వాడీవేడీ చర్చ-TNI ప్రత్యేకం

తానా బోర్డు మీటింగులో FBI నోటీసులపై వాడీవేడీ చర్చ-TNI ప్రత్యేకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు FBI-IRS-DOJల నుండి నోటీసులు అందినట్లు TNIలో వార్త ప్రచురితమైన మర్నాడు తానా బోర్డు అత్యవసర కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పోలవరపు శ్రీకాంత్ FBI కేసు, తానాకు FBI-IRS నోటీసులు వంటివాటిపై సుదీర్ఘమైన వాడీవేడి చర్చ జరిగినట్లు సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కార్యవర్గ సభ్యులు TNIతో పేర్కొన్నారు. వారి సమాచారం మేరకు…

* FBIకు ఫిర్యాదు చేశాం…అంతకు మించి అడగొద్దు!
తానా బొక్కసానికి $3.7మిలియన్ డాలర్లు (₹30కోట్లకు పైగా) బొక్కపెట్టిన పోలవరపు శ్రీకాంత్‌పై FBI Dallas విభాగానికి ఫిర్యాదు చేసినట్లు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ ధృవీకరించారని, ఈ ఫిర్యాదు కాపీ నకలు డిమాండ్ చేసినప్పటికీ బోర్డు సభ్యులకు కూడా చూపలేదని సమాచారం. FBI అంటే సాదాసీదా పోలీసులు కాదని, కేసు నెంబర్లు గట్రా ఏమి ఉండవని బోర్డు సభ్యులకు ఈ సమావేశంలో స్పష్టతనిచ్చారని సమాచారం. సంస్థ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము నిజాయితీగా ఫిర్యాదు చేశామని, FBI Dallas కార్యాలయంతో తానా న్యాయవాదులు సమన్వయపడుతూ ఈ కేసులో పురోగమిస్తున్నారని నాగేంద్ర శ్రీనివాస్ తెలిపినట్లు సమాచారం. ఇప్పటివరకు $40వేల డాలర్లను తానా న్యాయవాదులకు ఖర్చు చేశామని డా. కొడాలి సభ్యులకు వెల్లడించారు.

* FBI నోటీసులు అందాయి…అవి టాప్ సీక్రెట్!
FBI-IRSల నుండి తానాకు నోటీసులు అందిన మాట నిజమేనని కూడా బోర్డు సమావేశంలో ధృవీకరించారు. కానీ అవి శ్రీకాంత్ కేసు వలన జారీ చేశారా? లేక తానా గతచరిత్ర గురించి జారీ అయ్యాయా? అనే విషయంపై స్పష్టత కోసం తానా లాయర్లకు వాటిని పంపి శ్రీకాంత్ కేసు చూస్తున్న FBI Dallas అధికారుల నుండి వివరణ కోరమని అడిగినట్లు బోర్డు ఛైర్మన్ చెప్పినట్లు సమాచారం. సదరు నొటీసుల కాపీ తమకు చూపాలని సమావేశంలో పాల్గొన్న బోర్డు సభ్యులు పట్టుబట్టినప్పటికీ, అవి టాప్ సీక్రెట్ దస్తావేజులని, బహిర్గతం చేయకూడదని ఆయా నోటీసుల్లో స్పష్టంగా ఉందని కావున వాటిని అందరికీ చూపించడం కుదరదని బోర్డు ఛైర్మన్ వెల్లడించినట్లు సమాచారం. 2019 జనవరి నుండి 2024 డిసెంబరు వరకు తానాకు సంబంధిచిన చాలా కీలక సమాచారాన్ని ఆ నోటీసుల్లో కోరినట్లు వినికిడి. అయితే ఆ నోటీసును బహిర్గతం చేయకూడదు కాబట్టి, దర్యాప్తు సంస్థలు కోరిన సమాచారాన్ని అందజేసే సమన్వయకర్త బాధ్యత కూడా ఓటింగ్ ద్వారా బోర్డు ఛైర్మన్ ఒక్కడికే దఖలుపరిచినట్లు సమాచారం. అంటే ఈ నోటీసుల్లో కోరిన సమాచారం ఏదైనా బోర్డు ఛైర్మన్ ఒక్కరే తెప్పించుకుని తానా లాయర్ల ద్వారా దర్యాప్తు సంస్థలకు అందజేస్తారు. మార్గమధ్యంలో అప్పుడప్పుడు గుర్తొస్తే న్యాయవిభాగ సమన్వయకర్త, తానా తదుపరి అధ్యక్షుడు డా. కొడాలి నరేన్ విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తారని సమాచారం.

* ప్రైవేట్ కార్పొరేషనా? 501c సంస్థా?
తానా బ్యాంకు ఖాతాలో ఉన్న ప్రతి డాలరు ఎవరో ఒకరు తమ కష్టార్జితాన్ని మరింత మందికి సాయం చేయడానికి వినియోగించమని అందజేసినదే. తానా తల్లివేరు మొత్తం అందులోని జీవితకాల సభ్యులదే! గుప్పిట మూసి అన్నింటికీ గట్టిగా గడియ పెట్టడానికి ఇది ప్రైవేట్ కార్పోరేషన్ కాదు. ఇది 501C సంస్థ. అంటే లాభాపేక్ష లేని, పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన సంస్థ. ప్రతి విషయం గురించి సభ్యులకు పూర్తి స్థాయి సమాచారం తెలియజేయాల్సిన సంస్థ. సరైన పర్యవేక్షణ లేకే ఒక్కడిని నమ్మి ₹30కోట్ల తానా సొమ్ములు ఖండాంతరాలు దాటించి నేడు లబోదిబోమంటున్నారు. అసలు నోటీసులు వచ్చాయని కూడా ఎవరికీ చెప్పకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు నోటీసులు వచ్చాయని అందులో ప్రపంచ శాంతి హననానికి, సృష్టి వినాశనానికి సంబంధించిన రహస్యాలు ఉన్నాయని, వాటికి సమాధానాలు రాసే బాధ్యత మొత్తం మళ్లీ అదే తప్పు చేస్తూ ఒక్కడి మీదే బాధ్యత మోపడం ఎంతవరకు సమంజసమనే వాదన ప్రవాసుల్లో గట్టిగా వినిపిస్తోంది. దర్యాప్తు సంస్థలకు మీరు వ్రాసే తిరుగు టపా వలన రేపు సంస్థకు శాశ్వత నష్టం జరిగితే అప్పుడు తప్పించుకుంటారే తప్ప పూర్తి బాధ్యత తీసుకుంటారా? అని కూడా తానా శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పాత తరం నాయకులతోనైనా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగితే తానా సభ్యుల్లో సంస్థ పట్ల కూసింత నమ్మకం లావెక్కేది.

—సుందరసుందరి(sundarasundari@aol.com)

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z