Devotional

పూరీ ఆలయంపై డ్రోన్ల కలకలం-NewsRoundup-Jan 05 2025

పూరీ ఆలయంపై డ్రోన్ల కలకలం-NewsRoundup-Jan 05 2025

* కెనడా (Canada) మీదుగా అమెరికాకు భారతీయులను అక్రమంగా తరలించడం ఇటీవల పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తమ దేశస్థులను కెనడా మీదుగా అక్రమంగా పంపిస్తుండటంపై (Human Trafficking) భారత్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ అక్రమ రవాణాపై గడిచిన రెండేళ్లలో కెనడా వద్ద భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై గ్లోబల్‌ అఫైర్స్‌ కెనడా విభాగం ప్రతినిధి స్పందిస్తూ ‘‘భారత్‌-కెనడా మధ్య విస్తృతమైన ప్రజా సంబంధాలున్నాయి. వేర్వేరు అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. వీటిలో విదేశాల్లో మా పౌరుల వలసలు, భద్రత, సంక్షేమం వంటి అంశాలుంటాయి. నేరాలు, మోసాలను అదపు చేయడానికి భారత్‌ అధికారులతో కలిసి పనిచేయడానికి కెనడా సిద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

* తన తనయుడు అకీరా నందన్‌ (Akira Nandan) సినిమాల్లోకి రావడంపై నటి రేణూ దేశాయ్‌ (Renu desai) తాజాగా స్పందించారు. రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. తన తనయుడి ఎంట్రీ కోసం తాను కూడా ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా నాకు ఎదురయ్యే ప్రశ్న అకీరా ఎంట్రీ గురించే. అందరి కంటే ఎక్కువగా ఒక తల్లిగా నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే అది పూర్తిగా అతడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాడు’’ అని తెలిపారు.

* సినీనటి మాధవీలత గురించి ఆవేశంలో అలా మాట్లాడటం తప్పేనని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతోపాటు, భాజపా నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరుతున్నట్టు జేసీ పేర్కొన్నారు. ఆదివారం తాడిపత్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప.. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. కొంతమంది పార్టీ మారిపోవాలని విమర్శిస్తున్నారని, తాను పార్టీ మారాలని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. డిసెంబరు 31న నన్ను నమ్మి 16 వేల మంది అక్కచెల్లెళ్లు జేసీ పార్క్‌కు వచ్చారు. నాగురించి మాట్లాడిన రాజకీయనాయకులంతా ఫ్లెక్సీ గాళ్లే. తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తా. రెండు సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలు మారుస్తా. గత మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించడమే.. ప్రజలు నావైపు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

* అమెరికా ముంగిట భారీ మంచు తుపాను (Winter Storm ) ముప్పు పొంచి ఉంది. దీంతో అనేక రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ దశాబ్దిలోనే అతి తీవ్ర తుపానుగా వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దాదాపు పదిహేనుకుపైగా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండనుందని.. సుమారు 6కోట్ల మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. మధ్య అమెరికాలో మొదలైన శీతల తుపాను తూర్పు దిశగా కదలనున్నట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వెల్లడించింది. పోలార్‌ వర్టెక్స్‌ (Polar Vertex) కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిస్సౌరీ నుంచి మధ్య అట్లాంటిక్‌ వరకు ఇది విస్తరించనుందని, గడిచి దశాబ్దిలోనే అతి తీవ్ర శీతల తుపానుగా మారనున్నట్లు అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో ప్రయాణం ప్రమాదకరంగా ఉండనుందని పేర్కొంది. మరోవైపు అమెరికాలో 2011 తర్వాత అత్యంత శీతల జనవరిగా నిలవనుందని ప్రైవేటు వాతావరణ విభాగం ‘అక్యూవెదర్‌’ కూడా అంచనా వేసింది. దీని తీవ్రత వారం పాటు ఉండనున్నట్లు తెలిపింది.

* టెస్టుల్లో నిలకడగా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli)పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తీవ్ర విమర్శలు గుప్పించాడు. టీమ్‌ఇండియాకు సూపర్‌ స్టార్ సంస్కృతి అవసరం లేదని, కోహ్లీని పక్కనపెట్టి అతడి స్థానంలో యువ ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవడానికి సమయం ఆసన్నమైందన్నాడు. విరాట్ దేశవాళీ క్రికెట్ ఎందుకు ఆడట్లేదని ప్రశ్నించాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ (AUS vs IND)లో ఓటమి అనంతరం ఇర్ఫాన్‌ పఠాన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ బీజీటీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో మాత్రం ఒక సెంచరీ చేశాడు. తర్వాత భారీ స్కోర్లు చేయలేకపోయాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడే బంతులను వేటాడి పెవిలియన్ చేరాడు. ఈ ఆసీస్‌ పర్యటనలో కోహ్లీ ఏడుసార్లు ఇదే విధంగా ఔట్ కావడం గమనార్హం.

* ప్రముఖ హోటల్‌ అగ్రిగేటర్‌ ఓయో (OYO) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది. అందులో భాగంగా ఇకపై పెళ్లికాని జంటలు రూమ్‌ బుక్‌ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరఠ్‌ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. ఓయో సవరించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్‌లు ఇవ్వరు. కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్ బుకింగ్‌ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.

* దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే ఆదివారం ఆయా ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi).. ఆప్‌ సర్కారుపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. గత పదేళ్ల ఆప్‌ ప్రభుత్వ పాలనలో దిల్లీ అభివృద్ధి పట్టాలు తప్పిందని మండిపడ్డారు. దీనిపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) స్పందిస్తూ.. ప్రధాని తన ప్రసంగంలో ఎక్కువ భాగం దిల్లీ ప్రభుత్వాన్ని విమర్శించడానికే కేటాయించారన్నారు. నేడు ప్రారంభించిన ప్రాజెక్టులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే చేపట్టినవని గుర్తుచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు.. దిల్లీ మౌలిక సదుపాయాల కల్పనలో కీలకం. అవి దిల్లీ, కేంద్ర ప్రభుత్వాల మధ్య సహకారంతో చేపట్టినవే. కేంద్రంతో ఆప్‌ సర్కారు కేవలం కయ్యాలకే పరిమితమని ఆరోపించేవారికి ఈ ప్రారంభోత్సవాలే సమాధానం. మా పార్టీ నేతలను జైల్లో పెట్టి హింసించారు. కానీ.. మేం మాత్రం పాలనపైనే దృష్టి సారించాం. అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇచ్చాం. ప్రధాని మోదీ నేటి ప్రసంగంలో దిల్లీ ప్రజలను, స్థానిక సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపాకు ప్రజలే సరైన సమాధానం చెబుతారు’’ అని కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

* విదేశాలకు వెళ్లిన తెలుగువారంతా ఒకే వేదిక మీదకు రావడం సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీ వేదికగా 3 రోజుల పాటు జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల ముగింపు కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విదేశాలకు వెళ్లిన వారికి తెలుగుతో అనుబంధం తగ్గిపోతోందని, నాలెడ్జ్‌ కోసం ఏ భాష నేర్చుకున్నా తెలుగును తక్కువ చేయొద్దని సూచించారు. హైదరాబాద్‌లో అద్భుతమైన అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయని, నగరాభివృద్ధికి పాటుపడేందుకు తెలుగు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ‘‘రాజీవ్‌గాంధీ ఈ దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసి… సాంకేతిక నైపుణ్యాన్ని అందించారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కంప్యూటర్‌ యుగాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతమంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతోంది. ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలు కల్పిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధిపథం వైపు నడిచేందుకు ఉపయోగపడుతోంది. అందుకు కొనసాగింపుగా వైఎస్‌ఆర్‌ హయాంలో.. ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, ఫార్మా రంగాల్లో పెట్టుబడులతో మరింత ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఆదాయంలో 65 శాతం ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. అందుకు కారణం ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు.

* ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) తనకు ఇచ్చిన ఆఫర్‌పై బిహార్‌ (Bihar) ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) స్పందించారు. తాను తిరిగి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా కంటే ముందు అధికారంలో ఉన్న వారు ఎలాంటి అభివృద్ధి చేశారు..? అప్పుడు స్త్రీల పరిస్థితి ఎలా ఉండేది..? సూర్యాస్తమయం తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడేవారు. నేను పొరపాటున అలాంటి వారితో రెండు సార్లు పొత్తు పెట్టుకున్నాను. తప్పు చేశా’’ అని నీతీశ్ వ్యాఖ్యానించారు. కాగా.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో నీతీశ్ కుమార్‌ కీలక పాత్ర వహించారు.

* గతేడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తన విరోధులకు చెంపపెట్టు లాంటివని శివసేన చీఫ్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) అన్నారు. వారంతా ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానాలను సైతం విమర్శించారని మండిపడ్డారు. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన పలువురు నేతలు తన పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శివసేన బలంగా ఎదుగుతోందన్నారు. ప్రజలు తమ పక్షమని భావించిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టులా మారాయని పేర్కొన్నారు.

* అన్ని వర్గాల ప్రజలు పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు మోసపోయామన్నారు. వరంగల్‌ జిల్లా మొగిలిచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి.. గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల రాష్ట్రంగా మర్చారని మండిపడ్డారు. ‘‘ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. రూ.2 లక్షలలోపు ఉన్న రైతు రుణాలను ఒకే విడతలో మాఫీ చేశాం. 3 నెలల్లోనే రైతులు ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశాం. సాంకేతిక కారణాలతో ఎవరికైనా వర్తించకపోతే వారికి కూడా రుణమాఫీ చేస్తాం. గత ప్రభుత్వం పదేళ్లపాటు గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించలేదు. కానీ, ఈ ప్రభుత్వం తొలి ఏడాదే 56 వేల ఉద్యోగాలు ఇచ్చింది. రైతు భరోసాపై ఎంతో దుష్ప్రచారం చేశారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తాం. సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇస్తాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.

* ఉత్తరాంధ్రకు జగన్‌ చేసిందేమీ లేదని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) విమర్శించారు. ఒక్క ఐటీ పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పర్యటనపై సమీక్ష అనంతరం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కియా పరిశ్రమను తీసుకొచ్చింది చంద్రబాబే (Chandrababu). వైకాపా పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోయాయి. గతంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పారు.. చేశారా? ప్రస్తుతం దేశంలో భారీగా పింఛన్‌ ఇస్తోంది ఏపీనే. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మేము చెల్లిస్తున్నాం. గాడితప్పిన పాలనను సరైన దారిలో పెడుతున్నాం. విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు తీసుకువస్తాం. ఏపీకి కావాల్సిన ప్రతి ప్రాజెక్టును రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాలకు నీరు అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.’’ అని లోకేశ్ తెలిపారు.

* మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) భాజపా (BJP) ప్రజాస్వామ్య సంస్థ అని పేర్కొన్నారు. ఏ కుటుంబానికి చెందినది కాదన్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో 2,300 పైగా రాజకీయ పార్టీలున్నాయి. కానీ, జాతీయ హోదా కలిగిన పార్టీలను మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టవొచ్చు. భాజపా, సీపీఐ మాత్రమే ఏ కుటుంబానికి చెందిన పార్టీలు కాదు. అయితే.. ఇప్పుడు సీపీఐ జాతీయ పార్టీ కాదు. కానీ, ప్రజలు, కార్యకర్తలు తమదిగా భావించే ఏకైక పార్టీ భాజపా. కిందస్థాయి నుంచి దేశ ప్రధానిగా (ప్రధాని మోదీని ఉద్దేశించి) బాధ్యత వహించే వ్యక్తిని కాషాయ పార్టీలోనే చూశాం’’ అని ఫడణవీస్‌ పేర్కొన్నారు.

* ఒడిశాలోని (Odisha) విశ్వ ప్రసిద్ధ శ్రీక్షేత్రమైన పూరీ జగన్నాథుడి ఆలయంపై (Puri Jagannath temple) డ్రోన్‌ (Drone) కనిపించడం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పూరీ జగన్నాథుడి ఆలయం సహా చుట్టు పక్కల ప్రాంతం ‘నో ఫ్లై జోన్‌’లో ఉంది. అయితే.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆలయంపై ఒక డ్రోన్‌ అనుమానాస్పద రీతిలో కనిపించింది. అరగంట పాటు అది గుడిపై చక్కర్లు కొట్టింది. దీంతో భద్రతాపరమైన ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే.. ఆ డ్రోన్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందుకోసం బృందాలను ఏర్పాటు చేశారు.

* అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇటలీ (Italy) ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. శనివారం ఫ్లోరిడాలోని మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ‘ఇది సంతోషకరమైన సమయం. అద్భుతమైన మహిళ, ఇటలీ ప్రధానితో ఉన్నాను’ అని ట్రంప్ అక్కడి వారితో పేర్కొన్నారు.

* ఉక్రెయిన్‌ (Ukraine)తో జరుగుతోన్న యుద్ధంలో రష్యా (Russia)కు మద్దతుగా ఉత్తరకొరియా (North Korea) సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఉక్రెయిన్‌పై దాడులకు దిగుతున్న రష్యా, ఉత్తర కొరియా సైనికులు తమ సైన్యం చేతుల్లో ఓటమిని చవిచూస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) అన్నారు. రష్యాలోని దక్షిణ కుర్స్క్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో తమ సైనికులు భారీగా విరుచుకుపడడంతో అక్కడి బలగాలకు భారీ ప్రాణనష్టం సంభవించిందన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z