* ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో (OYO) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకొచ్చింది. ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది. అందులో భాగంగా ఇకపై పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు. ఈ నిబంధనలు తొలుత మేరఠ్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం వెల్లడించింది. ఓయో సవరించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్‌లు ఇవ్వరు. కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లోనైనా రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెల్లుబాటు అయ్యే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో ఇలాంటి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు అందించింది. మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్దేశించింది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
* గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లోని టాప్ 10 కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.96,605.66 కోట్లు కోల్పోయాయి. వాటిల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) భారీగా నష్టపోయాయి. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) లాభ పడ్డాయి. టాప్-10 సంస్థల్లో మిగతా ఆరు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.82,861.16 కోట్లకు పెంచుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,025.46 కోట్లు పతనమై రూ.13,37,919.84 కోట్లకు చేరుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్య్రాప్ రూ.29,324.55 కోట్ల నష్టంతో రూ. 8,93,378.50 కోట్ల వద్ద స్థిర పడింది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.24,856.26 కోట్లు కోల్పోయి రూ.14,83,144.53 కోట్లకు పరిమితమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ. 5,399.39 కోట్ల పతనంతో రూ.7,08,168.60 కోట్లకు చేరుకున్నది.
* రాష్ర్టానికి చెందిన ప్రత్యేక ఇంజినీరింగ్ పరికరాల తయారీ సంస్థ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్..హైదరాబాద్‌లో మరో ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నది. ఇప్పటికే నగరం చుట్టు తొమ్మిది యూనిట్లు ఉండగా, రూ.130 కోట్ల పెట్టుబడితో పదో యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు, వచ్చే ఏడాదిన్నరలోగా ఈ యూనిట్ అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ చైర్మన్ నాగేశ్వర్ రావు తెలిపారు. నగరానికి సమీపంలోని జిన్నారం వద్ద 36 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఈ యూనిట్‌లో ఆయిల్-గ్యాస్, పెట్రోకెమికల్స్, వంటనూనెలకు సంబంధించి రియక్టర్లను తయారు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ చేతిలో రూ.450 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయని, వీటిని వచ్చే ఏడాదిలోగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా రియక్టర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు, వీటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.540 కోట్లుగా ఉన్న టర్నోవర్, ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఇదే క్రమంలో వచ్చే ఐదేండ్లలో రూ.4 వేల కోట్ల టర్నోవర్ చేరుకునే అవకాశాలున్నాయన్నారు.
* సామాన్యులకు రిజర్వుబ్యాంక్ గట్టిషాకిచ్చింది. ఒకేసారి పలు బ్యాంకుల్లో వ్యక్తిగత రుణాలు తీసుకోవాలనుకునేవారికి సెంట్రల్ బ్యాంక్ పరిమితులు విధించింది. బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తుండటంపై గతంలో ఆందోళన వ్యక్తంచేసిన సెంట్రల్ బ్యాంక్..వీరికి ముకుతాడువేయడానికి ఏకంగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో ఈ నూతన సంవత్సరంలో తక్కువ వ్యవధిలో పలు బ్యాంకుల్లో ఎక్కువ సంఖ్యల్లో రుణాలు తీసుకోవడం ఇక కుదరకపోవచ్చు. ఈ నూతన నిబంధనలతో ఒకేసారి పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం అంత సులభం కాదు. పలువురు ఖాతాదారులు తమ సంపాదనకు మించి రుణాలు తీసుకుంటున్నారని, తిరిగి చెల్లింపులు జరపడంలో విఫలంకావడంతో బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు పెరగడానికి ఇవే కారణమని గుర్తించిన ఆర్బీఐ, వీటికి చెక్ పెడుతూ నూతన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z