Health

HMPV గురించి భయపడవద్దు-NewsRoundup-Jan 06 2025

HMPV గురించి భయపడవద్దు-NewsRoundup-Jan 06 2025

* కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) నగరంలో ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ(HMPV) వైరస్‌ సోకడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్‌ కొవిడ్‌(COVID-19)లా వ్యాప్తి చెందేది కాదని.. అందువల్ల ఎవరూ భయపడొద్దని విజ్ఞప్తి చేసింది.

* ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతర పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

* కర్ణాటక, గుజరాత్‌లో హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ (HMPV) కేసులు బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.
రాష్ట్రానికి వైరస్‌ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఇప్పటికే ఐసీఎంఆర్‌ ప్రకటించిందని స్పష్టం చేశారు.

* ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలి ఓరియన్‌ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఈ మేరకు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు.

* దేశంలో మూడు హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ (HMPV) కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) స్పందించారు. ఈ వైరస్‌ కొత్తదేమీ కాదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

* కొత్త అందాలతో లక్నవరం రారమ్మంటూ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. సరస్సులో బోటింగ్ ఇప్పటికే సందర్శకులకు మధురానుభూతులు పంచుతోంది. తాజాగా అధునాతన సౌకర్యాలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దిన మూడో ద్వీపం అందాలు కట్టిపడేస్తున్నాయి.

* ఫిబ్రవరి 19 నుంచి ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కంటే ముందు ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమ్‌ఇండియా (Team India)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

* కృత్రిమ మేధను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందేందుకు వీలుగా తమ సేవలను విస్తరిస్తామన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. సత్య నాదెళ్లతో భేటీ కావడంపై ప్రధాని మోదీ స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, ఏఐ తదితర అంశాలపై తాము చర్చించామన్నారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్‌ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

* భారత్‌లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2001నుంచి ఈ వైరస్‌ ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో ఎలాంటి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కాలేదన్నారు. అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌ లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మైక్రోబయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్‌ మెడిసిన్‌ నిపుణులతో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీని నియమించాలని సీఎం ఆదేశించారు.

* ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్‌ బోర్డు పొడిగించింది. రూ.2,500 అపరాధ రుసుంతో ఈ నెల 16 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

* బ్రిటన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చేసిన వ్యాఖ్యలను ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తిప్పికొట్టారు. తప్పుడు, అసత్య వార్తలను మస్క్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిటన్‌ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో (Keir Starmer) ధ్వజమెత్తారు. బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్మర్‌ను ప్రభుత్వం నుంచి తప్పించి.. కొత్తగా ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న లైంగిక వేధింపుల కేసుల్లో ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై మండిపడ్డారు. 2008-13 మధ్యకాలంలో ఇంగ్లాండ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో బాధితులకు స్టార్మర్‌ న్యాయం చేయలేదని ఆరోపించారు.

* నటి హనీ రోజ్‌ (Honey Rose) తాజాగా పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోషల్‌మీడియా వేదికగా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ ఆదివారం ఆమె పోస్ట్‌ పెట్టారు. దీంతో సోమవారం ఉదయం కేరళలోని ఎర్నాకుళం నగర పోలీసులు దాదాపు 27 మందిపై కేసు నమోదు చేశారు. అందులో కుంబళంకు చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారని స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ ఆదివారం సాయంత్రం హనీరోజ్‌ ప్రకటన విడుదల చేశారు. “ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడు. నేను సైలెంట్‌గా ఉంటుంటే ‘ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఆ వ్యక్తి గతంలో కొన్ని కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించాడు. వేర్వేరు కారణాల వల్ల వెళ్లేందుకు నిరాకరించాను. అందుకు ప్రతీకారంగా నేను హాజరయ్యే ప్రతి ఈవెంట్‌కు రావడం.. వీలు కుదిరినప్పుడల్లా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడు’’ అని ఆమె తెలిపారు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ‘వీరసింహారెడ్డి’తో హనీరోజ్‌ తెలుగు ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే.

* తన ఇంటి పేరును లక్ష్యంగా చేసుకొని భాజపా మాజీ ఎంపీ రమేశ్‌ బిధూడీ (Ramesh Bidhuri) చేసిన వ్యాఖ్యలకు దిల్లీ ముఖ్యమంత్రి ఆతీశీ (Atishi) అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓట్ల కోసం ఇంతకు దిగజారుతారా అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z