* వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇందులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా దూకుడు కొనసాగిస్తోంది. గతేడాది నవంబర్‌లో వివిధ కేంద్ర బ్యాంకులన్నీ కలిపి 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా.. ఆర్‌బీఐ 8 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. తద్వారా నవంబర్ నెలలో మూడో అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా నిలవడంతో పాటు తన నిల్వలను మరింత పెంచుకుందని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) సోమవారం తెలిపింది. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణనలోకి తీసుకొని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకులు వ్యూహాత్మకంగా బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటాయి. అలా 2024లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చెందిన కేంద్ర బ్యాంకులు ఈ విషయంలో ముందువరుసలో ఉన్నాయి.
* ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌ను కనీసం రూ.5 వేలు చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి. సత్వరమే 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాయి. 2025-26 బడ్జెట్‌లో సూపర్ రిచ్‌పై ట్యాక్సులు వేయాలన్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో (Nirmala sitharaman) జరిగిన బడ్జెట్ (Budget 2025) సన్నాహక సమావేశంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు.. పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలు చేయాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరాయి. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరాయి. సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధులు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఆపాలని కేంద్రాన్ని కోరినట్లు టీయూసీసీ జాతీయ కార్యదర్శి ఎస్‌పీ తివారీ అన్నారు. ఈసారి బడ్జెట్‌లో సూపర్ రిచ్‌పై 2 శాతం అదనంగా ట్యాక్స్ వేసి.. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించాలని, వారికీ కనీస వేతనాలు కల్పించాలన్నారు.
* దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం ధర రూ.700 తగ్గి రూ.79,000లకు పడిపోయింది. శుక్రవారం పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.79,700 వద్ద స్థిర పడింది. మరోవైపు, కిలో వెండి ధర రూ.300 వృద్ధితో రూ.90,700లకు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.90,400 వద్ద ముగిసింది. సోమవారం 99.5శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.700 తగ్గి రూ.78,600 పలికింది. శుక్రవారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం రూ.79,300 వద్ద స్థిరపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి డెలివరీ తులం బంగారం ధర రూ.247క్షీణించి, రూ.77,070 పలికింది. కిలో వెండి మార్చి డెలివరీ ధర రూ.479 పతనమై రూ.89,700 వద్ద ముగిసింది. ఇదిలా ఉండగా, కన్జూమర్ డిమాండ్లకు అనుగుణంగా వెండి, వెండి ఆభరణాల విక్రయంపై హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే విషయమై సంబంధిత వాటాదారులతో సంప్రదించి చర్య తీసుకోవాలని బ్యూరో ఆఫ్ స్టాండర్డ్ ఇండియా (బీఎస్‌ఐ)ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం 0.18 శాతం పుంజుకుని 2,659.60 డాలర్లు పలికింది. ఔన్స్ బంగారం 30.87డాలర్లకు చేరుకుంది. హాలీడే సీజన్ నేపథ్యంలో గత 20 ఏండ్ల తర్వాత జనవరిలో బంగారం ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని జ్యువెల్లరీ ఆభరణాల వ్యాపారులు చెప్పారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టపోయాయి. చైనాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన హెచ్‌ఎంపీవీ వైరస్‌పై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చైనాకే పరిమితమైన కేసులు భారత్‌లోనూ నమోదయ్యాయి. కర్నాటక, గుజరాత్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పెట్టుబడిదారులు దాదాపు రూ.12లక్షల కోట్లకుపైగా సంపదను కోల్పోయారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. సోమవారం ఉదయం 79,281.65 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పతనమైంది. ఇంట్రాడేలో 79,532.67 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 77,781.62 పాయింట్లకు పడిపోయింది. చివరకు 1,258.12 పాయింట్లు తగ్గి.. 77,964.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388.70 పాయింట్లు తగ్గి.. 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, ట్రెంట్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్ ఉన్నాయి. అయితే, అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్, టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ 4శాతం పతనమైంది. మెటల్, రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ, పవర్, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి 3 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం పడిపోయాయి.
* రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేకించి ఇండ్ల నిర్మాణ పరిశ్రమలో సంస్థాగత పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధిరేటు 46 శాతం పెరిగిపోయింది. నివాస ఆస్తులకు గల డిమాండ్‌ను ఇన్వెస్టర్లు సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ కొల్లియర్స్ ఙండియా తెలిపారు. 2023లో ఇండ్ల నిర్మాణ పరిశ్రమలో సంస్థాగత పెట్టుబడులు 786.9మిలియన్ డాలర్లు. దీంతో పోలిస్తే 2024లో భారత రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 22 శాతం వృద్ధి చెంది 6.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. 2023లో 4.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇన్వెస్టర్లు పెట్టారు. 2024లో మొత్తం పెట్టుబడులు 66 శాతం పెరిగాయి. ఇండస్ట్రీయల్ అండ్ వేర్ హౌసింగ్ సెగ్మెంట్‌లో 2024లో సంస్థాగత ఇన్వెస్టర్లు గరిష్టంగా 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2023లో 877.6 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఆఫీస్ సెగ్మెంట్‌లో మాత్రం 23శాతం పెట్టుబడులు తగ్గాయి. గత ఐదేండ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని సెగ్మెంట్లలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దేశీయ, అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు పుంజుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనే రియల్ ఎస్టేట్‌లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z