1986లో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మానసపుత్రికగా, ఆయన హయాంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ద్వారా ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌కు పలు ఆదాయ మార్గాలు, ఆర్థిక విభాగాన్ని సమృద్ధి చేసే వనరులు పుష్కళంగా ఉన్నాయని ఆ సంస్థ ఛైర్మన్‌గా ఇటీవల పదవీబాధ్యతలు చేపట్టిన న్యూజెర్సీకి చెందిన గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుడు, నాట్స్ సంస్థ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ తెలిపారు. శనివారం నాడు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో “డాకు మహరాజ్” ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న అనంతరం ఆయన TNIతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు మీ కోసం.
“ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌లో బూర్గుల రామకృష్ణరెడ్డి భవన్‌లో ప్రారంభమైన APTS సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఏ విధమైన, వెబ్‌సైట్, యాప్, పోర్టళ్ల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సాంకేతిక సేవలను అందించేది. రాష్ట్ర విభజన అనంతరం సైతం ఈ సంస్థ పరిధిని, విలువను గుర్తించిన చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్య కాలంలో నవ్యాంధ్రప్రదేశ్‌లో కూడా దీన్ని కొనసాగించింది. మధ్యలో వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా సంస్థ ఉన్నప్పటికీ దాని ఆధ్వర్యంలో టెండర్లను పిలిచి, సాంకేతిక సేవలను ఔట్‌సోర్సింగ్ చేసి సంస్థను నిర్వీర్యం చేశారు.
కానీ 2024లో తెదేపా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ప్రతిభను ప్రోత్సహించడం వంటి సానుకూల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌లు నాకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలకు హార్డ్‌వేర్ ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్లు) సేవలను విస్తృతంగా అందజేస్తున్నాము. గత ప్రభుత్వాల్లో మాదిరి ఏ విభాగం వారు తమకు ఇష్టమొచ్చిన రీతిలో తమకు నచ్చిన సాంకేతిక ఉపకరణాలు కొనుగోలు చేయకుండా APTS సంస్థ పర్యవేక్షణలో వీటి కొనుగోలు, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాము. APTSను ఒక Central IT Hubగా బలోపేతం చేసేందుకు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఏదైనా సేవలను అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రూపొందించేలా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాము. అన్ని ప్రభుత్వ విభాగాలు, ఆయా పోర్టళ్లు, వెబ్‌సైట్లు, యాప్‌లు అన్నీ APTS కిందకు తీసుకువచ్చేలా ప్రయత్నిస్తున్నాము.
మొత్తం భారతదేశంలోనే కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన Empanelment Cybersecurity Certification అథారటీ APTS సొంతం. ఏపీలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు మా సంస్థ సైబర్‌సెక్యురిటీ సేవలను అందిస్తోంది. సొంత రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకే గాక, ప్రైవేట్ రంగానికి, పక్క రాష్ట్రాలకు సైతం APTS ద్వారా సైబర్‌సెక్యురిటీ సేవలను అందజేస్తే రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలకే పరిమితమైన ఈ Empanelment Cybersecurity Certification అథారటీని చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా చేరువ చేస్తాము. తద్వారా ఐటీ రంగం బలోపేతానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. డిజిటల్ సేవల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నాము.
APTS సంస్థలో ఛైర్మన్ క్రింద మేనేజింగ్ డైరక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, జనరల్ మేనేజర్, 16 మంది మేనేజర్లు, 300మంది అనుభవజ్ఞులైన, ప్రతిభావంతులైన ఐటీ నిపుణులు ఉన్నారు. టెండర్లు పిలిచి ఔట్‌సోర్సింగ్ ఇచ్చే విధానాలకు త్వరలోనే స్వస్తి పలికి సొంత రాష్ట్రం-సొంత ఉద్యోగులు-సొంత పరిజ్ఞానం-సొంత సాంకేతికత అనే నినాదాంతో మొత్తం స్వదేశీ తయారీకి బాటలు వేస్తాము. దీని ద్వారా రాష్ట్రానికి ఐటీ ఖర్చు మిగులుతుందని భావిస్తున్నాను.
టెక్నాలజీకి నింగే హద్దు. ఆ నింగిని అందుకోవాలంటే ఎగిరేందుకు బలమైన నేల, ప్రోత్సహించే నాయకత్వం అవసరం. ఏపీ వంటి రాష్ట్రం, చంద్రబాబు వంటి నాయకత్వంలో సాంకేతిక సేవలను నింగే హద్దుగా అభివృద్ధి చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. ఐటీ సేవలకు ఏపీని సరికొత్త చిరునామాగా మార్చేందుకు ప్రయత్నిస్తాను. నా అనుభవాన్ని గుర్తించి, నేను న్యాయం చేయగలిగే బాధ్యతను నాపై ఉంచిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని మన్నవ మోహనకృష్ణ తన ప్రణాళికలను వివరించారు.
—సుందరసుందరి(sundarasundari@aol.com)
###
పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి అమెరికాకు వచ్చిన మోహనకృష్ణకు అమెరికాలోని ఆయన మిత్రమండలి శుక్రవారం నాడు న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z