Videos

యూట్యూబ్ ఛానళ్లపై గరికిపాటి క్రిమినల్ చర్యలు-NewsRoundup-Jan 07 2025

యూట్యూబ్ ఛానళ్లపై గరికిపాటి క్రిమినల్ చర్యలు-NewsRoundup-Jan 07 2025

* దేశంలో హెచ్‌ఎంపీవీ (HMPV) కేసులు నమోదు కావడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలో (Karnataka) రెండు కేసులు వెలుగు చూడడంతో ప్రతిపక్ష భాజపా (BJP) స్పందించింది. ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని హెచ్చరించింది. ‘‘కొత్త వైరస్‌ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడారు. కానీ, దాని ప్రభావం గురించి ఏం తెలియనప్పుడు హెచ్‌ఎంపీవీని తేలికగా తీసుకోవద్దు. ఈ వైరస్‌ ఛైనాలో బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి చిన్నారులు ఆస్పత్రుల పాలయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది’’ అని ప్రతిపక్ష నేత ఆర్‌. ఆశోక (R Ashoka) విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

* అసంబద్ధమైన ప్రశ్నలు అడగవద్దని ఓ రిపోర్టర్‌పై రజనీకాంత్ (Rajinikanth) అసహనం వ్యక్తంచేశారు. తన అప్‌కమింగ్‌ సినిమా ‘కూలీ’ షూటింగ్‌ కోసం థాయిలాండ్‌ వెళ్తున్న ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆ చిత్రం అప్‌డేట్‌ను పంచుకున్నారు. అదే సమయంలో ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించగా అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దన్నారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగవద్దని ఘాటుగా చెప్పారు. ఇటీవల చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విలేకరి మహిళల భద్రతపై ప్రశ్నించగా.. రజనీకాంత్ తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని అసహనం వ్యక్తంచేశారు.

* భాజపా కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ నాయకుల దాడిని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. యూత్‌ కాంగ్రెస్‌ నేతలను పిలిచి మందలించనున్నట్లు తెలుస్తోంది. యూత్‌ కాంగ్రెస్‌ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ప్రియాంక గాంధీపై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని, అయితే.. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భాజపా నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా భాజపా నాయకులు సహకరించాలని కోరారు.

* ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి రద్దు చేసిందని దిల్లీ సీఎం ఆతిశీ (Atishi) విమర్శించారు. మూడు నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారని అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నివాసాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సోమవారం కూడా నోటీసులు వచ్చాయని అన్నారు. ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారని వివరించారు.

* రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల (Assembly Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. 70 శాసనసభ స్థానాలున్న దిల్లీ (Delhi)కి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

దిల్లీ ఎన్నికల తేదీలివే..
నోటిఫికేషన్‌ విడుదల : జనవరి 10
నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: జనవరి 17
నామినేషన్ల పరిశీలన : జనవరి 18
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : జనవరి 20
పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 5
ఓట్ల లెక్కింపు : ఫిబ్రవరి 8

* ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం (TG High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ (HMDA) ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర (Telangana News) ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్‌ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

* భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెకీ అతుల్‌ సుభాశ్‌ ఆత్మహత్య చేసుకొన్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజా పరిణామం చోటుచేసుకుంది. తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అతుల్ తల్లి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది (Atul Subhash case). ‘‘చిన్నారి తల్లి సజీవంగా ఉంది. ఈ మాట మేం చెప్పకూడదు కానీ.. ప్రస్తుతానికి మీరు ఆ బిడ్డకు అపరిచిత వ్యక్తి మాత్రమే. మీకు కావాలనుకుంటే ఆ చిన్నారి వద్దకువెళ్లి చూసిరండి. మీకు బాలుడి కస్టడీ కావాలనుకుంటే..అదంతా వేరే ప్రక్రియ’’ అని స్పష్టం చేసింది. నేరం రుజువయ్యేవరకు సుభాశ్‌ భార్య నికితా సింఘానియాను దోషిగా పేర్కొనొద్దని సూచించింది. అయితే, బాలుడి జాడ గుర్తించేందుకు వేసిన పిటిషన్‌పై విచారణను మాత్రం జనవరి 20కు వాయిదా వేసింది.

* ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌ పిటిషన్‌పై మంగళవారం ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

* బీపీఎస్‌సీ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష (fast unto death)ను సోమవారం పోలీసులు భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన షరతులు లేని బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో ప్రశాంత్‌ కిశోర్‌ ఆరోగ్యం క్షీణించిందని.. ఆయనను పట్నాలోని ఆస్పత్రికి తరలించామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

* గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్‌ను ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత, అక్కడి నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు నీళ్లు తీసుకువెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. అటవీ, పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్‌ టన్నెల్‌ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో 24 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకువెళ్లేందుకు వీలుగా 118 కి.మీ పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా మూడుచోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్‌ నిర్మాణమూ అవసరమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కి.మీ. పొడవున టన్నెల్‌ తవ్వుతారు. ఇది వన్యప్రాణి అటవీ సంరక్షణ ప్రాంతం కావడంతో ఈ టన్నెల్‌ను భూగర్భంలో తవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ టన్నెల్‌ ప్రారంభం, ఆ తర్వాత వెలుపలికి నీళ్లు వచ్చే ప్రాంతం కూడా అటవీ ప్రాంతంలో లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు. అటవీ ప్రాంతం అంతా భూగర్భంలోనే నీళ్లు ప్రవహిస్తాయి. ఈ టన్నెల్‌ కోసం 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరమని లెక్కిస్తున్నారు. ఇందులో బొల్లాపల్లి జలాశయంలోనే 15 వేల ఎకరాలు కావాలి.

* ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao)పై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన టీమ్‌ స్పందించింది. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులను కలత పెడుతోందని తెలిపింది. ఈ మేరకు గరికపాటి సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో పరువు తీస్తున్నారు. గరికపాటిపై వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం.. సత్యదూరం. వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటూ ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్‌ ఛానళ్లు, సంస్థలపై క్రిమినల్‌, పరువు నష్టం కేసులు వేస్తాం. ఇకపై అలాంటి దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

* భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కాంగ్రెస్‌ పార్టీ.. తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడటం దుర్మార్గమన్నారు. పోలీసులను వెంట తీసుకొచ్చి భాజపా కార్యాలయంపై రాళ్లు విసిరారని, పోలీసులు ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజమని హైదరాబాద్‌ సీపీని ప్రశ్నించారు. భాజపా తలచుకుంటే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రోడ్లమీద తిరగలేరని హెచ్చరించారు. రోజు రోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. నిరాశతో భౌతిక దాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరన్నారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు, భౌతిక దాడులకు తావు లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఎక్కడ ఉందని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించారు. దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

* ఒక్క ఏడాదికాలంలోనే (2024) 901 మందికి ఇరాన్ (Iran) మరణశిక్ష విధించింది. డిసెంబర్‌లో ఒక్క వారంలో 40 మందికి ఈ శిక్ష (capital punishment) విధించిందని ఐరాస వెల్లడించింది. ఈ మృతుల్లో 31 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పింది. ఈ కఠిన శిక్షకు గురయ్యేవారి సంఖ్య పెరుగుతుండటం కలవరపరుస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఏటికేటికీ ఈ సంఖ్యలో మరోసారి పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. హత్య, మాదకద్రవ్యాల అక్రమరవాణా, అత్యాచారం, లైంగిక దాడి వంటి నేరాలకు ఇరాన్‌లో మరణ దండన అమలు చేస్తుంటారు. చైనా మినహా ఒక ఏడాదికాలంలో ఈ తరహా శిక్ష ఎక్కువగా అమలు చేసే దేశం ఇరానే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు మానవ హక్కుల గ్రూపుల గణాంకాల ప్రకారం.. చైనా విషయంలో పూర్తి వివరాలు అందుబాటులో లేవు.

* కోర్టు ఆదేశాల మేరకు దక్షిణ కొరియా (South Korea) దేశాధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol)ను అరెస్టు చేసేందుకు ఆ దేశ అవినీతి నిరోధక విభాగం విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యక్షుడి అరెస్టుకు మరోసారి న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వారెంట్‌ గడువు ఎప్పుడు ముగుస్తుందనే విషయం వెల్లడించలేదు. దేశంలో స్వల్పకాలంపాటు సైనికపాలన విధించిన కారణంగా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ పార్లమెంటు అభిశంసనకు గురైన విషయం తెలిసిందే. అధ్యక్షుడి న్యాయవాదులు మాట్లాడుతూ ఈ విధంగా అధ్యక్షుడి నివాసంలోకి ఇతరులు చొరబడడం వల్ల యూన్‌ సుక్‌ యోల్‌కు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేయడానికి..పోలీసుల సహాయంతో అరెస్టు చేయడానికి అవినీతి నిరోధక కార్యాలయానికి చట్టపరమైన అధికారం లేదని అన్నారు.

* కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందులలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్‌ తిరస్కరించడంతో పులివెందులలోని అతని ఇంటికి వెళ్లిన పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైకాపా సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నవంబరు 8న నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో రాఘవరెడ్డి 20వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ వ్యవహరిస్తున్నారు. రాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారంతో వైకాపా కార్యకర్తలు భారీగా పులివెందుల పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z