* ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ 13 సిరీస్‌పై (OnePlus 13) ఫ్రీ రీప్లేస్‌మెంట్ పాలసీని ప్రకటించింది. ఫిబ్రవరి 13లోపు వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ 5జీ ఫోన్లు కొనుగోలు చేసేవారికి ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. కొనుగోలు చేసిన 180 రోజుల్లో హార్డ్‌వేర్ పరంగా ఏదైనా సమస్య తలెత్తితే ఫోన్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తారు. గ్రీన్‌లైన్ సమస్యపై యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నవేళ కొత్త పాలసీని తీసుకురావడం గమనార్హం. కేవలం వన్‌ప్లస్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని వన్‌ప్లస్ కల్పిస్తోంది. 180 రోజులకు మించి కవరేజీ కావాలంటే వన్‌ప్లస్ 13కి రూ.2,599, వన్‌ప్లస్ 13ఆర్‌పై రూ.2,299 చెల్లించాలి. అప్పుడు మరో మూడు నెలల పాటు అదనపు కవరేజీ లభిస్తుంది. ఇతర ఫోన్లపై ఇప్పటికే డిస్‌ప్లేలపై లైఫ్‌టైమ్ ఫ్రీ వారెంటీని అందిస్తోంది. తద్వారా వన్‌ప్లస్ బ్రాండ్‌పై నమ్మకాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. వన్‌ప్లస్ 13 సిరీస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను మంగళవారం నిర్వహించిన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తారు. వనప్లస్ 13 ధర రూ.69,999 నుంచి ప్రారంభం అవుతుంది. జనవరి 10 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వన్‌ప్లస్ 13ఆర్ ప్రారంభ ధర రూ.42,999గా కంపెనీ నిర్ణయించారు. జనవరి 13 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) SNACC పేరిట కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. క్విక్ బైట్స్, బేవరేజెస్, ఫుడ్ డెలివరీలను అందించేందుకు ఈ అప్లికేషన్ తీసుకొచ్చింది. ఈ యాప్ సాయంతో ఆర్డర్ చేస్తే కేవలం 15 నిమిషాల్లోనే డెలివరీ అందించనుంది. ఇప్పటికే ఈ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. జొమాటోకు అనుబంధ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ 10 నిమిషాల్లోనే స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ అందించేందుకు బిస్ట్రో యాప్‌ను తీసుకొచ్చింది. మరో క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) సైతం కేఫ్ ఆఫరింగ్స్ కోసం ‘జెప్టో కేఫ్’ పేరిట యాప్‌ను లాంచ్ చేసింది. ఇలా వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని సంస్థలు ప్రత్యేక యాప్‌లతో ముందుకొస్తున్న నేపథ్యంలో స్విగ్గీ కూడా కొత్త యాప్‌ను తేవడం గమనార్హం.
* టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ (Errol Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. ‘ప్రజలకు ఎలాన్ చెప్పేది వినాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో అతడో మామూలు మనిషి. అతని దగ్గర డబ్బుంది. బిలియనీర్ కాబట్టి అతను చెప్పిన విషయాన్ని అనేకమంది రీట్వీట్ చేస్తుంటారు. ఎలాన్ చెప్పేవన్నీ పట్టించుకోవద్దు. దానిగురించి చింతించకుండా అతడిని బయటకు పొమ్మని చెప్పాలంతే..’ అని ఎర్రల్ పేర్కొన్నారు. ఎలాన్ మస్క్‌కు ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ (Errol Musk)కు మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలున్నాయి. గతంలో విడుదలైన ఎలాన్ మస్క్ జీవిత చరిత్ర పుస్తకంలో రచయిత ఐజాక్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
* తెలంగాణకు ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోనుంది. ఐదేళ్లుగా ధరలు పెంచకపోవడంతో భారీగా నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యూబీఎల్ ప్రతినిధులు బుధవారం ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిసి.. తెలంగాణకు పూర్తిగా బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్టు లేఖ అందజేశారు. ధరలు పెంచాలని పలు మార్లు కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని, దీంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z