* తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితులపై రాష్ట్రంలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) వివరణ ఇచ్చింది. ‘‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ ధర కేవలం 16 శాతం మాత్రమే. అందులో 70శాతం ప్రభుత్వ పన్నులే ఉంటాయి. కంపెనీకి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. నష్టాలతో వ్యాపారం చేయలేకనే రాష్ట్రానికి బీర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించాం’’ అని యూబీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
* ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy) మరో యాప్ తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతోంది. క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ (Instamart) కోసం కొత్త అప్లికేషన్‌ను త్వరలో తీసుకురానుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ శ్రీహర్ష మజేటీ (Sriharsha Majety) ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు వెల్లడించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని సంస్థలు ప్రత్యేక యాప్‌లతో ముందుకొస్తున్న నేపథ్యంలో స్విగ్గీ కూడా కొత్త యాప్ పరిచయం చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ కంటే ఇన్‌స్టామార్ట్‌కే ఎక్కువ యూజర్ బేస్ ఉంది. రానున్న రోజుల్లో మరింత వృద్ధి సాధించే అవకాశం క్విక్ కామర్స్ విభాగంలో ఉంది. అందుకోసమే ప్రత్యేక యాప్ తీసుకురానున్నాం. అయితే స్విగ్గీలో అందిస్తున్న ఇన్‌స్టామార్ట్ సేవల్ని అలానే కొనసాగిస్తాం. క్విక్ డెలివరీలలోని వస్తువులు, వాటి ఆఫర్లు మాత్రమే చూడాలను కొనే వారి కోసమే ఈ కొత్త యాప్ పరిచయం చేయనున్నాం’’ అని స్విగ్గీ సీఈఓ అన్నారు.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ ఫలితాలతో పాటు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేట్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల ప్రకటనల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,206.21 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటిక సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో 78,206.21 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 77,542.92 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది. చివరకు స్వల్పంగా కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 528.28 పాయింట్లు పతనమై.. 77,620.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.45 పాయింట్లు తగ్గి 23,526.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో దాదాపు 1,175 లాభపడగా.. మరో 2,610 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, కోల్ ఇండియా, బీపీసీఎల్ నష్టపోయాయి. హెచ్‌యూఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా అన్ని సూచీలు.. ఐటీ, మెటల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, పవర్, రియాల్టీ ఒకటి నుంచి రెండుశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు తగ్గుముఖం పట్టాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.86 వద్ద ఉన్నది.
* ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థించగా.. చాలా మంది వ్యతిరేకించారు. తాజాగా ఎల్ అండ్ టీ చైర్మన్ (L&T chairman) ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (SN Subrahmanyan) సైతం ఇదే తరహా వ్యాఖ్యలే చేశారు. అయితే, నారాయణమూర్తి కంటే ఆయన ఓ అడుగు ముందుకేసి.. వారానికి 90 గంటలు పనిచేయాలని తన ఉద్యోగులకు (employees) సూచించారు. తన ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని (90-hour work week) సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నారు. ఎంతసేపు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు..? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కవ సమయం ఉంటామని భార్యలతో చెప్పాలని ఉద్యోగులతో అన్నారు. ‘ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. మీతో ఆదివారాలూ పనిచేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను’ అని ఉద్యోగులతో అన్నారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z