Politics

రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు-NewsRoundup-Jan 09 2025

రేవంత్ ఆస్ట్రేలియా పర్యటన రద్దు-NewsRoundup-Jan 09 2025

* సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సినిమా థియేటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

* పదేళ్ల భారాస పాలనలో అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో, ఎక్కడా అవినీతి లేకుండా పనిచేశామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

* గ్రీన్‌లాండ్, పనామా కాలువలను అమెరికాలో (USA) విలీనం చేసుకోవడంపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) బహిరంగ ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) స్పందించారు.

* ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. ఈనెల 14న దిల్లీ వెళ్లనున్నారు. 15, 16 తేదీల్లో సీఎం దిల్లీ పర్యటన కొనసాగనుంది. 15న దిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఈనెల 17న దిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్లనున్నారు.

* తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్విమ్స్‌(SVIMS) ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులు దాదాపు 35 మంది స్విమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ బాధితులను సీఎం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్విమ్స్‌ వైద్యులతో మాట్లాడిన సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. సీఎం వెంట మంత్రులు, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఉన్నారు.

* ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవడమే సంక్రాంతి అసలు లక్ష్యమని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (Purandeswari) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన ఆరింటిలో తెలుగు ఒకటని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో నాలుగోది అన్నారు. ‘‘దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయులు ఏనాడో చెప్పారు. మాతృభాషను రక్షించుకోకపోతే.. అది మన ఉనికికే ప్రమాదం. జీవోలు తెలుగులో ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు జీవోలు తెలుగులో ఇచ్చేవారు. మహానదిగా విలసిల్లిన తెలుగు.. ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోందని బాధగా ఉంది’’ అని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బత్తుల బలరామకృష్ణ, భాజపా నేత సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

* సినిమా నిర్మాణంలో వృథా ఖర్చు పెరిగిపోతోందని నటుడు సోనూసూద్‌ (Sonu Sood) అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఫతేహ్‌’ (Fateh). జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోనూసూద్‌ మాట్లాడారు. నటీనటులు ఆలస్యంగా షూటింగ్‌కు రావడం, విదేశాల్లో షూటింగ్‌కు 100 మంది అవసరమైతే 150-200 మంది సిబ్బందిని నిర్మాత తీసుకెళ్తున్నారని వెల్లడించారు.

* శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. క్షేత్రంలోని చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. గత 23 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,39,61,457 ఆదాయంగా వచ్చినటు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అదే విధంగా 139.200 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 5.400 కేజీల వెండి ఆభరణాలు కూడా లభించాయని చెప్పారు. అలాగే, 481 యూఎస్ డాలర్లు , కెనడా డాలర్స్‌ 35, యూకే పౌండ్స్ 20, యూఏఈ దిర్హమ్స్‌ 140, మలేషియా రింగేట్స్ 15, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు 60, ఆస్ట్రేలియా డాలర్లు 60, ఖతర్‌ రియాల్స్ 45, జపాన్ యెన్స్‌ ఒకటి, సౌదీ అరేబియా కరెన్సీ 50, రోమనియా లియాస్ 10, ఉగండా షిల్లింగ్స్ 2వేలు, ఓమాన్ బైసా 600 సహా పలు దేశాలకు చెందిన కరెన్సీ హుండీ ద్వారా లభించినట్లు అధికారులు వివరించారు.

* తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి రోజా (Ex-minister Roja) కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్లే ఆరుగురు చనిపోయారని, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, పాలకమండలి తమ పదవులకు రాజీనామాలు చేయాలని, వారిపై క్రిమినల్‌ కేసులు (Criminal Cases) నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. గురువారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు . వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరిగిన దాఖాలాలు లేవని అన్నారు. చంద్రబాబు టీటీడీ చైర్మన్‌గా అసమర్దుడిని పెట్టారని ఆరోపించారు. లక్షలాధి మంది వచ్చే దేవస్థానంలో భద్రతపై చిత్తశుద్ధిలేని వ్యక్తిని ఎస్పీగా పెట్టారని ఆరోపించారు. వీరంతా చంద్రబాబుకు ఊడిగం చేసేందుకే పనిచేస్తున్నారని విమర్శించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z