* రాబోయే రెండేళ్లలో చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో 50 అమృత్ భారత్ రైళ్లను (Amrit Bharat trains) తయారు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. అమృత్‌భారత్ వెర్షన్ 2.0 రైళ్లలో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ సుబ్బారావుతో కలిసి శుక్రవారం కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. అమృత్ భారత్ రైళ్లతో పాటు, వందేభారత్ 2.0 స్లీపర్ రైళ్ల తయారీని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2024 జనవరిలో అమృత్ భారత్ వెర్షన్ 1.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని మంత్రి తెలిపారు. ఏడాదిలో వచ్చిన స్పందన ఆధారంగా వెర్షన్ 2.0ను తీర్చిదిద్దినట్లు చెప్పారు. కొత్తగా 12 రకాల ఫీచర్లను జోడించినట్లు తెలిపారు. సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫీచర్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్, వందే భారత్ రైళ్ల తరహాలో నిరంతరం వెలిగే లైట్లు, ఛార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ కూడా మార్చినట్లు వెల్లడించారు. ప్యాంట్రీ కారును సమూలంగా మార్చినట్లు తెలిపారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల లక్ష్యంగా ఈ రైళ్లను తీసుకొచ్చామని, తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని వివరించారు. అమృత్ భారత్ రైళ్లలో చేపడుతున్న మార్పుల గురించి ఎక్స్‌లో ఓ థ్రెడ్‌ను కూడా మంత్రి పోస్ట్ చేశారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. చివరికి వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లు లాభపడగా.. ఫైనాన్షియల్, హెల్త్, ఆటోమొబైల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,450 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 77,682.59 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,620.21) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత లాభనష్టాల మధ్య కదలాడింది. ఇంట్రాడేలో 77,919.70 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా నష్టాల్లోకి జారుకుంది. చివరికి 241.30 పాయింట్ల నష్టంతో 77,378.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 23,431 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ మరో 10 పైసలు క్షీణించి 85.96కు చేరింది.
* గ్లోబల్ బ్యాంక్‌లు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలను కత్తిరించొచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఆ సంస్థ టెక్నాలజీ ఆఫీసర్ల సర్వే ఆధారంగా కనీసం 3శాతం మేరకు ఉద్యోగాల కోత ఉండొచ్చు. ఈ అంచనాలు గురువారం పబ్లిష్ చేసింది. ముఖ్యంగా బ్యాక్‌ఆఫీస్, మిడిల్ ఆఫీస్, ఆపరేషన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగుల తగ్గింపు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. ఇక కస్టమర్ సర్వీసులో బాట్ మెసేజ్ విభాగాల్లో మార్పులు చోటుచేసుకొంటాయని ఈ నివేదిక తయారుచేసిన టోమస్ నోయెట్జెల్ వెల్లడించారు. నో యూవర్ కస్టమర్ విభాగం కూడా కృత్రిమ మేధ కారణంగా ప్రభావితం కావచ్చని తెలిపారు. రొటీన్‌గా ఒకేరకమైన పనిచేసే ఏ ఉద్యోగమైనా రిస్క్‌లో ఉన్నట్లే అని వెల్లడించారు. అలాగని అన్ని ఉద్యోగాలను తీసేయకపోయినా.. ఉద్యోగుల ట్రాన్స్ఫర్మేషన్కు దారితీయోచ్చని వెల్లడించారు. దాదాపు బ్లూమ్‌బెర్గ్ సర్వేలో సమాధానం చెప్పినవారిలో 93 మంది 5-10శాతం ఉద్యోగుల సంఖ్య తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. వీరు అంచనాలు తయారు చేసిన సంస్థల్లో సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ ఛేస్, గోల్డ్‌మన్‌శాక్స్ వంటివి ఉన్నాయి. ఇక బ్యాంకుల్లో టెక్నాలజీ మార్పులు 2027 నాటికి వాటి లాభదాయకతను పెంచి 12-17శాతం వద్దకు చేర్చవచ్చు. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో జనరేటీవ్ ఏఐ ద్వారా ఆదాయాలు 5శాతం వరకు వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది.
* ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (worlds most powerful passports) జాబితాలో భారత్ (India) 85వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 80వ స్థానంలో ఉండగా.. ఈ సారి ఐదు స్థానాలు దిగజారింది. వీసా రహితంగా ట్రావెల్ చేయగలిగిన గమ్యస్థానాల ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ఈ ర్యాంకింగ్స్‌ను ఇచ్చింది. మొత్తం 199 దేశాల్లో అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z